
నెట్స్‌లో చెమటోడ్చిన భారత క్రికెటర్లు
దుబాయ్: పాక్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల్ని దుబాయ్‌లో ఆడేందుకు వచ్చిన టీమిండియా కసరత్తు మొదలుపెట్టింది. ఆదివారమే అయినా, అక్కడికి చేరుకొని గంటల వ్యవధిలోనే భారత క్రికెటర్లు సాధన మొదలుపెట్టారు. ప్రామాణిక నిర్వాహక విధానం (ఎస్‌ఓపీ)లో భాగంగా కొత్తగా వచ్చిన హర్షిత్ రాణా నుంచి స్టార్ అయిన కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ జట్టు కసరత్తులో పాల్గొనే పద్ధతిని నిక్కచ్చిగా అమలు చేశారు.
ప్రాక్టీస్‌లో ప్రత్యామ్నాయ (ఆప్షనల్) సెషన్ అంటూ లేకుండా ఆటగాళ్లందరూ నెట్స్‌లో శ్రమించారు. అయితే అందరికంటే ఎక్కువగా అనుభవజ్ఞుడైన సీమర్ మొహమ్మద్ షమీ కఠోరంగా ప్రాక్టీస్ చేశాడు. గాయం తర్వాత సుదీర్ఘ విరామనంతరం అతను ఇటీవలే ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లతో అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ముందుగా శారీరక కసరత్తు చేసిన షమీ ఆ వెంటనే బౌలింగ్ ప్రాక్టీస్‌కు ఉపక్రమించాడు.
బ్యాటర్లు నెట్స్‌లో దిగకముందే అతను లైన్ అండ్ లెంత్‌పై దృష్టిపెట్టి మరీ సాధన చేశాడు. బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కచ్చితత్వమైన లెంత్ ప్రాక్టీస్‌కు సహకరించాడు. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్‌లిద్దరూ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పాండ్యా బాదిన షాట్ పక్కనే ఉన్న రిషబ్ పంత్ మోచేతికి తగిలింది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ చేయగా, ఫీల్డింగ్ కోచ్ దిలీప్... హర్షిత్, వరుణ్ చక్రవర్తి, పంత్‌లతో ఫీల్డింగ్ డ్రిల్స్ చేయించాడు.
Comments
Please login to add a commentAdd a comment