కేంద్ర మంత్రులపై బీజేపీ నేత విమర్శ
స్వతంత్ర విచారణకు ఎల్‌జేపీ డిమాండ్
ప్రధాని క్షమాపణ చెప్పాలన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: రోహిత్ ఆత్మహత్య, తదనంతర పరిణామాలపై అధికార పార్టీలోనూ భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయ ఈ కేసు విషయంలో సరిగా స్పందించలేదని.. రోహిత్ మృతికి వారి తీరే కారణమని బీజేపీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్ పాశ్వాన్ విమర్శించారు. ప్రధాని జోక్యం చేసుకుని దీనిపై ఓ ప్రకటన చేయాలన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన ఎల్‌జేపీ కూడా స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
ఎల్‌జేపీ ఎంపీ రామచంద్ర పాశ్వాన్ నాయకత్వంలోని ఎల్‌జేపీ కమిటీ హెచ్‌సీయూలోని విద్యార్థులతో మాట్లాడి నివేదికను పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌కు సమర్పించింది. స్మృతీ, దత్తాత్రేయను మంత్రివర్గం నుంచి తొలగించటంతోపాటు.. ప్రధాన మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కాగా, ఢిల్లీలో ఉన్న సమస్యలను పట్టించుకునేందుకు సమయంలేని కేజ్రీవాల్‌కు హైదరాబాద్ సమస్యలు కనిపించాయా అని ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి అశిష్ సూద్ విమర్శించారు.