
సాక్షి, పశ్చిమ గోదావరి : బీజేపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పైడి కొండల మాణిక్యాలరావు రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ తీరుకు నిరసనగానే రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నియోజకవర్గానికి ఇచ్చిన సుమారు 56 హామీలు నెరవేర్చనందుకే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని అల్టిమేటం జారీ చేశారు. మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాడేపల్లిగూడెం నియోజవర్గానికి చెందిన పలు సమస్యల పరిష్కారానికై 3 నెలలుగా చంద్రబాబు చుట్టూ తిరుగతున్నా పట్టించుకోవడం లేదని ఆయన వాపోయారు.
మంగళవారం ఉదయం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ‘15 రోజుల్లోగా సీఎం స్పందించకపోతే 16వ రోజు నుంచి నిరాహారదీక్షకు దిగుతా. మీరు ఈ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలకు సంబంధించిన వివరాలతో కూడిన పత్రాన్ని పంపిస్తున్నా. ఇలాంటి శాసనసభలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా. తాడేపల్లి గూడెంలో మీ తెలుగుదేశం పార్టీ లేనందుకే ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదని భావిస్తున్నా. నన్ను తొలగించి అయినా సరే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చండి. నా రాజీనామాను మీరే స్పీకర్‌కు పంపించండి’ అని వాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment