‘మంత్రి గారూ.. ఈ లెటర్ పనిచేయదండీ’
ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒకాయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్తూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫార్సు లేఖ తీసుకెళ్లారట. వెళ్లేది తిరుమలకు. తీసుకువెళ్లేది దేవుడి మినిస్టర్ లెటర్. ఇంకేముంది. అలా స్వామి వారి దర్శనమైపోయి.. ఇలా బయటకు వచ్చేయొచ్చని ఎంతో సంబరపడిపోయారట. జేబులో మంత్రి సిఫార్సు లేఖ పెట్టుకుని గుండెల నిండా ధైర్యంతో తిరుమలకు వెళ్లిన ఆయనకు అక్కడి టీటీడీ అధికారులు చుక్కలు చూపించారు. ‘సారీ అండీ. ఈ లెటర్ పనిచేయదండీ’ అంటూ ఎంతో మర్యాదగానే మంత్రి గారి లేఖను తోసిపుచ్చారట.
మంత్రి లెటర్ పట్టుకుని ఎంతో నమ్మకంతో పిల్లాపెద్దలతో చాలామంది తిరుమలకు వచ్చామని, ఈసారికి ఎలాగోలా దర్శనం టికెట్లు ఇమ్మని ఎన్నిసార్లు.. ఎన్నిరకాలుగా వేడుకున్నా సదరు అధికారులు మాత్రం కాసింతైనా కనికరించలేదట. ఇది ఆ ఒక్క భక్తుడి కష్టమే కాదు. ఇటీవల మంత్రి లెటర్లు తీసుకువెళ్లిన చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సు లేఖలనే మొహమాటం లేకుం డా తిరస్కరించడం వెనుక చాలా ‘మాటలు’ ఉన్నాయట. టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారితో మంత్రి మాణిక్యాలరావుకు వచ్చిన మా ట పట్టింపు వల్లే ఆయన ఇచ్చే లెటర్లకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
మరోవైపు మంత్రి మాత్రం అసలు సిఫార్సు లేఖలను తాను ప్రోత్సహించ దలుచుకోలేదని, మొత్తంగా అందరి సిఫార్సు లేఖలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమో పక్కన పెడితే దేవుళ్ల శాఖ మంత్రి నుంచి సామాన్య భక్తులు ఆశించేదేముంటుంది? ఎప్పుడో తిరుమలకో.. శ్రీశైలానికో లెటర్లు తీసుకోవడం తప్ప. ఈ విషయంలో టీడీటీ చైర్మన్ కనుమూరి బాపిరాజును కచ్చితంగా అభినందించాల్సిందే. ఈయన జిల్లా నుంచి, ప్రత్యేకించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నరసాపురం నుంచి వెళ్లిన భక్తులకు తృప్తిగా శ్రీవారి దర్శనం చేయించేవారని చెబుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుమలలో వ్యక్తిగతంగా ఓ ఉద్యోగిని కూడా పెట్టారని అంటుంటారు. ఈ సిఫార్సు లేఖల వ్యవస్థ సరైనదా లేదా అనే విషయాన్ని కదిలిస్తే కందిరీగల పుట్టను కదిలించినట్టే. మనం దాని జోలికి పోవొద్దు. కానీ మంత్రి గారూ.. మీరనుకున్న సిఫార్సు లేఖలు లేని ‘వ్యవస్థ’ వచ్చేవరకైనా గోదావరి జిల్లా వాసులను, సామాన్య భక్తుల అవస్థలను కాస్త కనిపెట్టుకోండి.