Recommendation letter
-
చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్
రాంచీ: అక్రమ మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తూ తనకు తానే మైనింగ్ లీజులను కేటాయించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్ రమేష్ బియాస్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో పంపిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తుది నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం రాంచీకి చేరుకున్న గవర్నర్ రమేష్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండు రోజులు ఉండి వచ్చానని, రాజ్‌భవన్‌కు వెళ్లి ఆ లేఖ చదివే వరకు తాను ఏమీ చెప్పలేదన్నారు. గవర్నర్ నుంచి నిర్ణయం రాకుండానే ప్రభుత్వంపై బీజేపీ దాడికి దిగింది. జేఎంఎం నైతికంగా అధికారంలో కొనసాగలేదని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలే మీడియాలో చూశానే తప్ప అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న డిమాండ్లను జేఎంఎం నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ అన్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. 2019లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. గనుల శాఖ వ్యవహారాలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సోరెన్ స్టోన్ చిప్ మైనింగ్ లీజుని తన కోసం తానే కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరిలో బీజేపీ నేత రఘుబర్‌దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 9ఏని హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని, ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల సీఈసీ దర్యాప్తు పూర్తి చేసింది. అసలేమిటీ కేసు? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నేళ్ల క్రితం రాంచీలో అంగారా బ్లాక్‌లో మైనింగ్ లీజ్ దక్కించుకున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 18న అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణం... రెండు శాఖలూ హేమంత్ పరిధిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ అనుమతుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హేమంత్ తన భార్య కల్పనకు ఓ పారిశ్రామిక కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహాదారు ప్రసాద్ కూడా అక్రమంగా మైనింగ్ లీజులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పొరపాటు జరిగింది’ అని అడ్వొకేట్ జనరల్ స్వయంగా అంగీకరించారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హేమంత్‌కు కేటాయించిన మైనింగ్ లీజ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనర్హత వేటు వేస్తే? ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక జేఎంఎంలో వివాదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేసులో హేమంత్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ముందంజలో నిలువనున్నారు. కానీ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం లేవు. ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమంటూ కొందరు మంత్రులు, సీనియర్ జేఎంఎం నేతలు అప్పుడే గళం విప్పుతుండటం గమనార్హం. మరోవైపు హేమంత్ తన భార్య కల్పనను సీఎంగా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. దాంతో సకాలంలో వానలు కురిపించని వరుణుడిపై, అతనికి ఆ మేరకు ఆదేశాలివ్వని ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎన్ వర్మ అనే ఓ రెవెన్యూ అధికారి తీర్మానించాడు! ఈ మేరకు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే సిఫార్సు చేశాడు!! జరిగిందేమిటంటే...వర్షాభావానికి ఇంద్రుడు, వరుణుడే బాధ్యులని ఆరోపిస్తూ ఫిర్యాదుల స్వీకరణ దినం (సమాధాన్ దివస్) సందర్భంగా గోండా జిల్లాకు చెందిన సుమిత్‌కుమార్ యాదవ్ అనే రైతు వర్మకు లేఖ ఇచ్చాడు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల జనజీవనంపై ప్రతికూల ప్రభావం పడిందని యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులపై ఇద్రుడిని నిందిస్తూ ఇలా లేఖ రాశారు. చాలా నెలలుగా వర్షాలు పడలేదని గౌరవనీయమైన అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. కరువు కాటకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి జంతువులు, వ్యవసాయంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. దీంతో ఆయా కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున, ఈ విషయంలో వరుణుడిపై తగు చర్యలు తీసుకుని బాధ్యత వహించవలసిందిగా కోరుతున్నాము.’ అని పేర్కొన్నాడు. ఇంతో ఎన్ఎన్ వర్మ .. లేఖను పూర్తిగా చదవకుండానే ‘బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవా’లని సిఫార్సు చేస్తూ ఆ లేఖను ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి పంపాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. దాంతో నాలుక్కరుచున్న వర్మ, తానసలు ఆ లేఖ పంపనే లేదు పొమ్మని బుకాయిస్తున్నాడు. సమాధాన్ దివస్‌లో వందలాది ఫిర్యాదులు వస్తుంటాయి గనుక బహుశా చదవకుండానే లేఖను ఫార్వర్డ్ చేసి చిక్కుల్లో పడ్డాడని అధికారులు అంటున్నారు. ఇంతకూ ఇంద్ర వరుణులపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలంటూ నెటిజన్లు హాస్యం పండిస్తున్నారు. -
చక్కర్లు!
* బదిలీల పర్వంలో కొత్త కోణం * మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు * సిఫార్సు లేఖల కోసం పైరవీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బదిలీల జాతరకు తెరలేవడంతో పైరవీలు ఊపందుకున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు ఆశావహులు ప్రజాప్రతినిధులు, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మాట’ వినని అధికారులను సాగనంపి.. వారి స్థానే విధేయులను నియమించుకోవాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. బదిలీల్లో ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలోనే బదిలీలపై భయం పట్టుకున్న అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటివరకు బదిలీలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, హాట్‌సీట్లు దక్కించుకునేందుకు తమదైన శైలిలో అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నంవబర్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు జరిగిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా హడావుడి చేస్తుండడంతో అధికారవర్గాల్లో బదిలీల ఫీవర్ మొద లైంది. ముఖ్యంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీల జాబితాలో ఉండడం.. ఎమ్మెల్యేలు కూడా తమనే టార్గెట్ చేయడంతో సీటును కాపాడుకునేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారు. నచ్చిన పోస్టింగ్‌ను దక్కించుకునేందుకు తమ పేర్లను సిఫార్సు చేయాలని కోరుతూ ‘రేటు’ మాట్లాడుకుంటున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒకే అధికారి కోసం ఇరువురు ప్రజాప్రతినిధులు పట్టుపట్టడం కూడా అధికారపార్టీలో వివాదంగా మారుతోంది. నగర శివార్లలో పోస్టింగ్ దక్కించుకునేందుకు ఎక్కువ మంది పోటీపడుతుండడం అధికారుల్లోనూ కొత్త జగడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణేతరులను సాగనంపాలనే వాదన తెరమీదకు తెచ్చారు. అదే సమయంలో సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీల పర్వాన్ని చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితమే స్థానచలనం కలిగించిన తహసీల్దార్లను మళ్లీ ఎలా మారుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీల ప్రక్రియ చేపడితే ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఛీ..చీ..! అధికారుల బదిలీలు మంత్రి మహేందర్‌రెడ్డికి చిరాకు కలిగిస్తున్నాయి. తన ఇంటిచుట్టూ ఎంపీడీఓలు చక్కర్లు కొట్టడంపై ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. బదిలీల జాబితాలో ఫలానా మండలానికి తమ పేరును సూచించాలని వేడుకునేందుకు సోమవారం ఉదయం పలువురు అధికారులు మహేందర్ నివాసానికి చేరుకున్నారు. ఒకవైపు ఆహారభద్రత, సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుండగా, దాన్ని వదిలేసి ఇక్కడకు రావడమేమిటని ఆయన రుసరుసలాడారు. ఇదిలావుండగా, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జీలను సంప్రదించి రూపొందించిన జాబితాను మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం పేషీకి పంపినట్లు తెలిసింది. ఈ జాబితాలో కూడా మళ్లీ సవరణలు కోరుతుండడం మంత్రి మహేందర్‌కు తలనొప్పిగా మారాయి. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆమోదముద్రతో నేడో, రేపో బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, స్వల్పకాలంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బదిలీల జాబితా కూడా పరిమిత స్థాయిలోనే ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. -
ఇక బది‘లీల’లు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు :అధికారుల్లో బదిలీ ఫీవర్ మొదలైంది. సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో తమకు కావల్సిన చోట పోస్టింగ్ కోసం అధికారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల వద్ద క్యూ కడుతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో తమకు అనుకూలంగా ఉండే అధికారుల కోసం సిఫార్సు లేఖలకు తెరదీశారు. ఇప్పటికే జిల్లా మంత్రి నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్ ఇప్పించుకునేందుకు లేఖలు ఇవ్వడం ప్రారంభించారు. జిల్లాలో అత్యున్నత అధికారి నుంచి కిందిస్థాయి వరకూ బదిలీలు జరిగే అవకాశం ఉంది. రెవెన్యూలో అన్ని కేడర్ల అధికారులను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ముగ్గురు ఆర్డీవోలను మార్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఒంగోలుకు ఒక మాజీ ప్రజాప్రతినిధి ఆశీస్సులతో వచ్చేందుకు ఒక అధికారి ప్రయత్నిస్తుండగా, కందుకూరు, మార్కాపురానికి ఒక ఉన్నత ప్రజాప్రతినిధి తమ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం కల్పించాలని ఇప్పటికే రెవెన్యూ మంత్రికి లేఖ రాసినట్లు సమాచారం. మిగిలిన విభాగాధిపతులు కూడా తమకు ప్రాధాన్యం ఉన్న పోస్టుల కోసం ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే ఇప్పుడు పనిచేస్తున్న వారికి ఇక్కడి నుంచి సాగనంపి వారి స్థానంలో వచ్చేందుకు అధికార పార్టీ ద్వారా పావులు కదుపుతున్నారు. పోలీసు విభాగంలో కూడా తమకు అనుకూలమైన ఎస్ఐలు, సీఐలను తెచ్చుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు కొరకరాని కొయ్యగా మారిన వారిని పంపించి వేయాలని ఉన్నతాధికారులపై వత్తిళ్లు తెస్తున్నారు. ఆయా శాఖలలో ప్రభుత్వం ద్వారా జరిగే పనులన్నింటినీ తమ అనుచరులకు, బినామీలకు ఇవ్వాలని పైరవీలు ప్రారంభమయ్యాయి. ఇవ్వని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. మాట వినకపోతే బదిలీ వేటు వేస్తామంటూ పరోక్ష హెచ్చరికలు కూడా చేస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయాల్లో తెలుగు తమ్ముళ్ల జోక్యం శృతి మించుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండా ఏ ఎన్ఓసీ, పట్టాదార్ పాసుపుస్తకం కూడా ఇవ్వకూడదని మండలస్థాయి నేతలు హుకుం జారీ చేస్తున్నారు. పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వాలంటే ముందు ఆ నేతకు ఐదు వేలు సమర్పించుకుంటేగానీ రాని పరిస్థితి కొన్ని మండలాల్లో ఉంది. దీంతో విసిగిపోయిన అధికారులు కూడా తమను ఎక్కడికి బదిలీ చేసినా వెళ్లిపోవడానికి సిద్ధం కాగా, మరికొందరు తమకు ఉపయోగపడే పోస్టింగ్‌ల కోసం లాబీయింగ్‌లు ప్రారంభించారు. బదిలీల కారణంగా ఆయా కార్యాలయాల్లో పనులు కుంటుపడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘మంత్రి గారూ.. ఈ లెటర్ పనిచేయదండీ’
ఈ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒకాయన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్తూ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సిఫార్సు లేఖ తీసుకెళ్లారట. వెళ్లేది తిరుమలకు. తీసుకువెళ్లేది దేవుడి మినిస్టర్ లెటర్. ఇంకేముంది. అలా స్వామి వారి దర్శనమైపోయి.. ఇలా బయటకు వచ్చేయొచ్చని ఎంతో సంబరపడిపోయారట. జేబులో మంత్రి సిఫార్సు లేఖ పెట్టుకుని గుండెల నిండా ధైర్యంతో తిరుమలకు వెళ్లిన ఆయనకు అక్కడి టీటీడీ అధికారులు చుక్కలు చూపించారు. ‘సారీ అండీ. ఈ లెటర్ పనిచేయదండీ’ అంటూ ఎంతో మర్యాదగానే మంత్రి గారి లేఖను తోసిపుచ్చారట. మంత్రి లెటర్ పట్టుకుని ఎంతో నమ్మకంతో పిల్లాపెద్దలతో చాలామంది తిరుమలకు వచ్చామని, ఈసారికి ఎలాగోలా దర్శనం టికెట్లు ఇమ్మని ఎన్నిసార్లు.. ఎన్నిరకాలుగా వేడుకున్నా సదరు అధికారులు మాత్రం కాసింతైనా కనికరించలేదట. ఇది ఆ ఒక్క భక్తుడి కష్టమే కాదు. ఇటీవల మంత్రి లెటర్లు తీసుకువెళ్లిన చాలా మందికి ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెబుతున్నారు. ఏకంగా దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సు లేఖలనే మొహమాటం లేకుం డా తిరస్కరించడం వెనుక చాలా ‘మాటలు’ ఉన్నాయట. టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారితో మంత్రి మాణిక్యాలరావుకు వచ్చిన మా ట పట్టింపు వల్లే ఆయన ఇచ్చే లెటర్లకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. మరోవైపు మంత్రి మాత్రం అసలు సిఫార్సు లేఖలను తాను ప్రోత్సహించ దలుచుకోలేదని, మొత్తంగా అందరి సిఫార్సు లేఖలు ఎత్తివేసేందుకు చర్యలు తీసుకుంటానని చెబుతున్నారు. అది ప్రాక్టికల్‌గా ఎంతవరకు సాధ్యమో పక్కన పెడితే దేవుళ్ల శాఖ మంత్రి నుంచి సామాన్య భక్తులు ఆశించేదేముంటుంది? ఎప్పుడో తిరుమలకో.. శ్రీశైలానికో లెటర్లు తీసుకోవడం తప్ప. ఈ విషయంలో టీడీటీ చైర్మన్ కనుమూరి బాపిరాజును కచ్చితంగా అభినందించాల్సిందే. ఈయన జిల్లా నుంచి, ప్రత్యేకించి తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నరసాపురం నుంచి వెళ్లిన భక్తులకు తృప్తిగా శ్రీవారి దర్శనం చేయించేవారని చెబుతుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా తిరుమలలో వ్యక్తిగతంగా ఓ ఉద్యోగిని కూడా పెట్టారని అంటుంటారు. ఈ సిఫార్సు లేఖల వ్యవస్థ సరైనదా లేదా అనే విషయాన్ని కదిలిస్తే కందిరీగల పుట్టను కదిలించినట్టే. మనం దాని జోలికి పోవొద్దు. కానీ మంత్రి గారూ.. మీరనుకున్న సిఫార్సు లేఖలు లేని ‘వ్యవస్థ’ వచ్చేవరకైనా గోదావరి జిల్లా వాసులను, సామాన్య భక్తుల అవస్థలను కాస్త కనిపెట్టుకోండి.