రాంచీ: అక్రమ మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తూ తనకు తానే మైనింగ్ లీజులను కేటాయించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్ రమేష్ బియాస్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్‌లో పంపిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తుది నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం రాంచీకి చేరుకున్న గవర్నర్ రమేష్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండు రోజులు ఉండి వచ్చానని, రాజ్‌భవన్‌కు వెళ్లి ఆ లేఖ చదివే వరకు తాను ఏమీ చెప్పలేదన్నారు. గవర్నర్ నుంచి నిర్ణయం రాకుండానే ప్రభుత్వంపై బీజేపీ దాడికి దిగింది. జేఎంఎం నైతికంగా అధికారంలో కొనసాగలేదని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు.
సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలే మీడియాలో చూశానే తప్ప అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న డిమాండ్లను జేఎంఎం నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్‌జేడీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ అన్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందని చెప్పారు.
2019లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. గనుల శాఖ వ్యవహారాలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సోరెన్ స్టోన్ చిప్ మైనింగ్ లీజుని తన కోసం తానే కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరిలో బీజేపీ నేత రఘుబర్‌దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 9ఏని హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని, ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల సీఈసీ దర్యాప్తు పూర్తి చేసింది.
అసలేమిటీ కేసు?
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నేళ్ల క్రితం రాంచీలో అంగారా బ్లాక్‌లో మైనింగ్ లీజ్ దక్కించుకున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్‌మెంట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 18న అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణం... రెండు శాఖలూ హేమంత్ పరిధిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ అనుమతుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హేమంత్ తన భార్య కల్పనకు ఓ పారిశ్రామిక కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు.
ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహాదారు ప్రసాద్ కూడా అక్రమంగా మైనింగ్ లీజులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పొరపాటు జరిగింది’ అని అడ్వొకేట్ జనరల్ స్వయంగా అంగీకరించారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హేమంత్‌కు కేటాయించిన మైనింగ్ లీజ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
అనర్హత వేటు వేస్తే?
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక జేఎంఎంలో వివాదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేసులో హేమంత్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ముందంజలో నిలువనున్నారు. కానీ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం లేవు. ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమంటూ కొందరు మంత్రులు, సీనియర్ జేఎంఎం నేతలు అప్పుడే గళం విప్పుతుండటం గమనార్హం. మరోవైపు హేమంత్ తన భార్య కల్పనను సీఎంగా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment