Jharkhand CM
-
ఓటర్లకు జార్ఖండ్ సీఎం విజ్ఞప్తి
రాంచి (జార్ఖండ్): లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ వివిధ రాష్ట్రాల్లో చరుగ్గా సాగుతోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ సరైకేలా ఖర్సవాన్ జిల్లా జిలింగోరాలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిలింగ్‌గోరాలోని ఉత్క్రమిత్ మధ్య విద్యాలయలో 220 నంబర్ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన సీఎం చంపయి సోరెన్.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఏఎన్ఐతో అన్నారు.తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికల నాలుగో దశకు పోలింగ్ జరుగుతుండగా, ఉదయం 9 గంటల వరకు మొత్తం 10.35 ఓటింగ్ శాతం నమోదైంది. -
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
సోరెన్‌కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్‌ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
జార్ఖండ్ తదుపరి సీఎం ఆమె? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారని.. తదుపరి సీఎంగా ఆయన భార్య కల్పన బాధ్యతలు తీసుకుంటారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత సర్ఫరాజ్ అహ్మద్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో నిశికాంత్ దుబే వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సర్ఫరాజ్ వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాను పార్టీని, సంకీర్ణాన్ని, సీఎం హేమంత్ సోరెన్‌ను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ‘ఎమ్మెల్యేగా సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా కొత్త ఏడాదిలో సోరెన్ కుటుంబానికి బాధ కలిగిస్తుంది. త్వరలో హేమంత్ సోరెన్ కూడా సీఎం పదవికి రాజీనామా చేస్తారు.ఆయన భార్య కల్పన సీఎం పదవిని చేపడతారు’ అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే ‘ఎక్స్’ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర గవర్నర్.. న్యాయ సలహా తీసుకోవాలని బీజేపీ పేర్కొంది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ ప్రభుత్వం 2019లో కొలుదీరిన విషయం తెలిసిందే. झारखंड के गांडेय विधायक सरफराज अहमद ने विधानसभा से इस्तीफ़ा दिया,इस्तीफ़ा स्वीकार हुआ । हेमंत सोरेन जी मुख्यमंत्री पद से इस्तीफ़ा देंगे,झारखंड की अगली मुख्यमंत्री उनकी पत्नी कल्पना सोरेन जी होंगी । नया साल सोरेन परिवार के लिए कष्टदायक @itssuniltiwari pic.twitter.com/jl06AtXurh — Dr Nishikant Dubey (@nishikant_dubey) January 1, 2024 జేఎంఎం ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన సీటుకు జరిగే ఉప ఎన్నికలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని ఎంపీ నిశికాంత్ దుబే ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి కేసులో విచారించడానికి ఇప్పటివరకు ఈడీ.. సీఎం హేమంత్ సోరెన్‌కు ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లపై సీఎం హేమంత్ సోరెన్ జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆయన దాఖలు చేసిన పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. 2024 పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేంద్రం ప్రతిపక్షాల పైకి దర్యాప్తు సంస్థలను పంపి వాటిని వాడుకుంటోందని మండిపడ్డ విషయం తెలిసిందే. మరోవైపు అవినీతి కేసులో ఈడీ విచారణపై సీఎం హేమంత్ సోరెన్ ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అయితే సీఎం సోమంత్ సోరెన్ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, సీఎం పదవిని తన భర్య కల్పనకు అప్పగిస్తారనే చర్చ జోరందుకుంది. చదవండి: Lalan Singh: నేను హిందువునే.. వాళ్లలా కాదు.. -
కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు
రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్‌కు మద్దతిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు. కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్ చెప్పారు. ఆర్డినెన్స్‌పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. -
అక్రమ మైనింగ్ కేసు.. ఈడీ ఎదుట విచారణకు హాజరైన జార్ఖండ్ సీఎం
రాంచీ: అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనికి ముందు ఆయన జార్ఖండ్‌లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జేఎంఎం-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలం పార్టీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా కొనసాగకుండా అనర్హత వేటు వేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సోరెన్ స్పందించారు. తనను ఎమ్మెల్యేగా తొలగించాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసిందని, ఆయన ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. గవర్నర్ దేని కోసమో ఎదురుచూస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని సోరెన్ చెప్పారు. అలాగే బీజేపీ తనపై మోపిన ఆరోపణలు పూర్తిగా నిరాధారం అని సోరెన్ పేర్కొన్నారు. దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇతర పార్టీల నాయకులపైనా ఇలాంటి కేసులనే కేంద్రం పెడుతుందని జోస్యం చెప్పారు. రాజ్యాంగబద్దమైన సీఎం పదవిలో ఉన్న తనకు సమన్లు పంపిన తీరు, విచారణ జరగుతున్న విధానం చూస్తుంటే తాను ఏదో దేశం వీడి పారిపోతానేమో అన్నట్లుగా చేస్తున్నారని సోరెన్ మండిపడ్డారు. ఇప్పటివరకు బడా వ్యాపారవేత్తలు మాత్రమే దేశం విడిచిపారిపోయారని, ఒక్క రాజకీయనాయకుడు కూడా అలా చేయలేదని వివరించారు. తాను రెండేళ్ల కాలంలో రూ.1000కోట్ల మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారని, కానీ ఆ వ్యవధిలో మైనింగ్‌లో మొత్తం రూ.750కోట్ల వ్యాపారమే జరిగిందని సోరెన్ వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు కనీసం నిజానిజాలు తెలుసుకోవాలని కేంద్రంపై సెటైర్లు వేశారు. చదవండి: గుజరాత్ ఎన్నికల వేళ ఆప్ నేత ఓవరాక్షన్.. కేసు నమోదు! -
హేమంత్ కాకపోతే మరో ‘సోరెన్’.. సీఎం పదవిలోకి మరొకరికి నో ఛాన్స్?
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యత్వం రద్దుపై నెలకొన్న సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది. ఏ క్షణంలోనైనా గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హేమంత్ సోరెన్ శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు? అనే చర్చ మొదలైంది. అయితే.. మరో సోరెన్ ముఖ్యమంత్రి అవుతారనే వాదనలు వినిపిస్తున్నాయి. సోరెన్ కుటుంబం నుంచి సీఎం పీఠం మరొకరికి వెళ్లదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం పదవి చేపట్టే అర్హత కలిగిన మరో సోరెన్ ఎవరు? ఓసారి పరిశీలిద్దాం. సీఎం హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే.. ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఎవరికనే అంశం కీలకంగా మారింది. సోరెన్స్ కుటుంబం సైతం ఇతర ప్రాంతీయ పార్టీలకు అతీతం కాదు. రాజకీయ సంక్షోభం తెలత్తినప్పుడు అదే కుటుంబం నుంచి మరొకరు ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉంటారు. కుటుంబ నేపథ్యం.. బిహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటు కోసం జార్ఖండ్ ముక్తి మోర్చాను ఏర్పాటు చేశారు శిబు సోరెన్. ఆయన రెండో కుమారుడే హేమంత్ సోరెన్. సీనియర్ సోరెన్.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సీఎంకు రాజకీయ గురువుగా ముందుండి దారిచూపుతున్నారు. అయితే.. జేఎంఎం స్థాపించిన తర్వాత శిబు సోరెన్ పెద్ద కుమారుడు దుర్గా సోరెన్ ఆయన వారసుడిగా ఎదిగారు. మరోవైపు.. పార్టీ స్థాపించినప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న హేమంత్ సోరెన్ దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే.. 2009లో దుర్గా సోరెన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు. ఆయన తర్వాత శిబు సోరెన్ వారసురాలిగా కుమార్తె అంజలీ పేరు తెరపైకి వచ్చినా ఆమె అంతగా ఆసక్తి చూపలేదు. ఒడిశాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుని వెళ్లిపోయారు. దీంతో హేమంత్ సోరెన్ కీలకంగా మారారు. ఆయనే.. పార్టీని చేపట్టారు. 38 ఏళ్లకే 2013లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ, ఏడాది కాలంలోనే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చారు సోరెన్. తాజాగా వచ్చిన ఆరోపణలతో మరోమారు చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం జేఎంఎం-కాంగ్రెస్ కూటమి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సోరెన్ కుటుంబంలోని కొన్ని పేర్లు పరిశీలిద్దాం. ఇదీ చదవండి: రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు..జార్ఖండ్ సీఎం అనర్హతపై అదే సస్పెన్స్ ► శిబు సోరెన్: 78 ఏళ్ల శిబు సోరెన్.. ప్రస్తుతం జేఎంఎం అధ్యక్షుడిగా, ఎంపీగా క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. ఆయనపై కోర్టుల్లో చాలా కేసులు ఉండటం సహా.. వయసు రీత్యా వచ్చే ఆరోగ్య సమస్యలు వేధిస్తుండటం వల్ల సీఎం పదవి చేపట్టేందుకు విముఖత చూపించే అవకాశాలు ఉన్నాయి. ► రూపి సోరెన్: పార్టీ అధినేత శిబు సోరెన్ భార్య రూపి సోరెన్. ఆమెకు రాజకీయాల్లో అంతగా అనుభవం లేనప్పటికీ ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తితే ఆమె పేరు తెరపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేశారు. ► కల్పనా సోరెన్: హేమంత్ సోరెన్ తన భార్య కల్పనా సోరెన్‌ను ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అనిశ్చితి నెలకొంటే ఆమెను తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే, ఆమె ఒడిశాకు చెందిన వ్యక్తి కావటం అడ్డంకిగా మారనుంది. ► సీతా సోరెన్: దుర్గా సోరెన్ మరణం తర్వాత శిబు సోరెన్.. తన కోడలు సీతా సోరెన్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. జామా నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే, ఆమె సైతం ఒడిశా నుంచి రావటం అడ్డంకిగానే మారనుంది. ► బసంత్ సోరెన్: శిబు సోరెన్ చిన్న కుమారుడు, హేమంత్ సోరెన్ తమ్ముడు, దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ పేరు వినిపిస్తోంది. అయితే.. ఆయన కూడా హేమంత్ లాగే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సంఘం వద్ద పెండింగ్‌లో ఉంది. అనర్హత వేటు ఎదుర్కునే అవకాశం ఉంది. ► అంజలీ సోరెన్: శిబు సోరెన్ కుమార్తె అంజలీ సోరెన్ వివాహం తర్వాత ఒడిశా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. దీంతో సీఎం పదవి రేసు నుంచి ఆమె లేనట్లే. మరోవైపు.. జేఎంఎం, హేమంత్ సోరెన్.. కుటుంబేతర వ్యక్తివైపు చూస్తే.. అప్పుడు పార్టీ సీనియర్ లీడర్, సెరైకేలా ఎమ్మెల్యే చంపాయ్ సోరెన్ ముందంజలో ఉంటారు. ఇంటిపేరు ఒకే విధంగా ఉండటమే కాకుండా.. పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇదీ చదవండి: చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్ -
చిక్కుల్లో జార్ఖండ్ సీఎం సోరెన్
రాంచీ: అక్రమ మైనింగ్ లీజ్ కేసులో జార్ఖండ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ ఎన్నికల చట్టాలను ఉల్లంఘిస్తూ తనకు తానే మైనింగ్ లీజులను కేటాయించుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు నిర్వహించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ గవర్నర్ రమేష్ బియాస్‌కు సిఫారసు చేసినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో పంపిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీనిపై తుది నిర్ణయం గవర్నర్ తీసుకోవాల్సి ఉంది. ఢిల్లీ నుంచి గురువారం రాంచీకి చేరుకున్న గవర్నర్ రమేష్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో రెండు రోజులు ఉండి వచ్చానని, రాజ్‌భవన్‌కు వెళ్లి ఆ లేఖ చదివే వరకు తాను ఏమీ చెప్పలేదన్నారు. గవర్నర్ నుంచి నిర్ణయం రాకుండానే ప్రభుత్వంపై బీజేపీ దాడికి దిగింది. జేఎంఎం నైతికంగా అధికారంలో కొనసాగలేదని, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. సీఈసీ కానీ, గవర్నర్ దగ్గర్నుంచి కానీ తనకు ఎలాంటి సమాచారం రాలేదని సీఎం అన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలే మీడియాలో చూశానే తప్ప అధికారికంగా తనకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. బీజేపీ చేస్తున్న డిమాండ్లను జేఎంఎం నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రంలో జేఎంఎం–కాంగ్రెస్–ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ అన్నారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా అసెంబ్లీలో తమకు మెజార్టీ ఉందని చెప్పారు. 2019లో ప్రజాస్వామ్యబద్ధంగా తాము అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య ఆరోపించారు. గనుల శాఖ వ్యవహారాలను కూడా చూస్తున్న ముఖ్యమంత్రి సోరెన్ స్టోన్ చిప్ మైనింగ్ లీజుని తన కోసం తానే కేటాయించుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఫిబ్రవరిలో బీజేపీ నేత రఘుబర్‌దాస్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 9ఏని హేమంత్ సోరెన్ ఉల్లంఘించారని, ఎమ్మెల్యేగా ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లగా ఇటీవల సీఈసీ దర్యాప్తు పూర్తి చేసింది. అసలేమిటీ కేసు? జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కొన్నేళ్ల క్రితం రాంచీలో అంగారా బ్లాక్‌లో మైనింగ్ లీజ్ దక్కించుకున్నారు. ఇందుకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల కోసం 2021 సెప్టెంబర్ 9న దరఖాస్తు చేసుకున్నారు. ‘స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ’ సరిగ్గా తొమ్మిది రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 18న అనుమతులు మంజూరు చేసింది. మైనింగ్, పర్యావరణం... రెండు శాఖలూ హేమంత్ పరిధిలోనే ఉండడం గమనార్హం. దీంతో ఈ అనుమతుల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా హేమంత్ తన భార్య కల్పనకు ఓ పారిశ్రామిక కారిడార్‌లో 11 ఎకరాల ప్లాట్ కేటాయించారు. ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మీడియా సలహాదారు ప్రసాద్ కూడా అక్రమంగా మైనింగ్ లీజులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటన్నింటిపై కొందరు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పొరపాటు జరిగింది’ అని అడ్వొకేట్ జనరల్ స్వయంగా అంగీకరించారు. హేమంత్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఎమ్మెల్యేగా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ డిమాండ్ చేశారు. జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బియాస్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో హేమంత్‌కు కేటాయించిన మైనింగ్ లీజ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అనర్హత వేటు వేస్తే? ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు పడితే అధికార సంకీర్ణ కూటమిలో అలజడి రేగే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక జేఎంఎంలో వివాదాలకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. సీఎం రేసులో హేమంత్ సోదరుడు, ఎమ్మెల్యే బసంత్ సోరెన్ ముందంజలో నిలువనున్నారు. కానీ, ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయ పరిపక్వత, పరిపాలనా అనుభవం లేవు. ముఖ్యమంత్రి పదవికి తామే అర్హులమంటూ కొందరు మంత్రులు, సీనియర్ జేఎంఎం నేతలు అప్పుడే గళం విప్పుతుండటం గమనార్హం. మరోవైపు హేమంత్ తన భార్య కల్పనను సీఎంగా చేసే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -
బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. మోదీతో క్లోజ్‌గా సీఎం.. షాక్‌లో కాంగ్రెస్!
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‌ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు. ముర్ముకు ఘన స్వాగతం రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు. చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు -
బొగ్గు స్కాంలో మధు కోడాకు మూడేళ్లు జైలు
-
మధుకోడాకు మూడేళ్ల జైలు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, రూ.25 లక్షల జరిమానా విధించింది. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసు, కోడా సన్నిహితుడు విజయ్ జోషిలకు మూడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. విసుల్ సంస్థకు రూ.50 లక్షలు, జోషికి రూ.25 లక్షలు; బసు, గుప్తాలకు రూ.లక్ష జరిమానావేసింది. జార్ఖండ్‌లోని రాజారా ఉత్తర బొగ్గు గనులను విసుల్ సంస్థకు కేటాయించడంలో వీరు అవినీతి, నేరపూరిత కుట్రలకు పాల్పడటంతో ఈ శిక్షలు వేశామని కోర్టు వ్యాఖ్యానించింది. ‘మామూలు నేరాల కంటే వైట్ కాలర్ నేరాలే సమాజానికి అత్యంత ప్రమాదకరం. వీటి వల్ల దేశం భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది’ అని సీబీఐ కోర్టు జడ్జి భరత్ పరాశర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మధుకోడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోనున్నారు. ఇదిలాఉండగా మొత్తం 30 బొగ్గు కుంభకోణం కేసుల్లో ఇప్పటివరకు నాలుగింటిలో 12 మంది వ్యక్తులకు, నాలుగు సంస్థలకు శిక్షలు పడ్డాయి. కాగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని మధుకోడా చెప్పారు. -
కొత్తజంటకు సీఎం వినూత్న కానుక!
పెద్దనోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లపైనా పడుతోంది. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో నూతన వధూవరులకు కానుకలు ఇవ్వాలనుకున్నవారు కొన్ని సందర్భాల్లో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కొత్త జంటకు వినూత్న కానుక ఇచ్చారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లయింది. ఈ పెళ్లికి హాజరైన రఘుబర్ దాస్ నూతన వధూవరులకు క్యాష్ ప్రిపెయిడ్ కార్డును కానుకగా ఇచ్చారు. నోట్ల రద్దు నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఒక బ్లాక్‌ను ఈ నెల ముగిసేలోగా నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాల్సిందిగా ప్రజలకు సందేశం ఇస్తూ సీఎం పెళ్లివేడుకలో ఈ కొత్తరకం కానుకను ఇచ్చారు. గిరిజన జనాభా అధికంగా గల జార్ఖండ్‌లో నోట్ల రద్దు ప్రభావాన్ని తప్పించుకొనేందుకు నగదురహిత లావాదేవీలను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం భావిస్తోంది. -
జార్ఖండ్ సీఎం సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా: గోహత్యలపై వివాదం నెలకొన్న ఈ తరుణంలో జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని స్వదేశంగా భావించే వారు గోవును తల్లిలా పూజించాలన్నారు. ఇటీవల జరుగుతున్న ఉదంతాల్లో పశువుల అక్రమ రవాణాదారుల హస్తం ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గోవధ, సంఖ్యపై కొంచెం సంఘ్ పరివార్‌లో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ గోరక్షణపై మాత్రం ఏకాభిప్రాయం నెలకొందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 6న అసాంఘిక శక్తులే గోవధలకు పాల్పడుతున్నాయన్నారు. గోవధకు పాల్పడే వారే గో సంరక్షకుల్లా మారువేషం వేసుకుని తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా ఈ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. తమను మోదీ అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై దాస్ మాట్లాడుతూ ఈ విషయంపై ప్రధాని తెలిపిన వ్యాఖ్యల్లో నిజముందని పేర్కొన్నారు. -
'యోగా చేసి అహంకారం తగ్గించుకోండి'
జంషెడ్ పూర్: బీహార్ సీఎం నితీశ్ కుమార్ అహంకారి, గర్విష్ఠి అని బీజేపీ నాయకుడు, జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ధ్వజమెత్తారు. తన పొగరు తగ్గించుకునేందుకు నితీశ్ నిత్యం యోగా చేయాలని సూచించారు. యోగా చేయడానికి సరిపోయే ఒళ్లేనా నీది, ప్రతి రోజూ శ్రద్ధగా ఇంట్లోనే యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కు నితీశ్ సలహాయిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పాట్నాలో ఈనెల 21న జరిగే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. ఆయనను ఉద్దేశించే నితీష్ ఈ విమర్శలు చేశారు. నితీశ్ వ్యాఖ్యలపై రఘువర్ ఘాటుగా విధంగా స్పందించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గుణపాఠం చెబుతారని అన్నారు. బీహార్ ఎన్నికల్లోనూ జార్ఖండ్ తరహా ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. -
జార్ఖండ్ సీఎంగా రుఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం
రాంచీ : జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ఆదివారం రఘువర్ దాస్ చేత రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రానికి చెందిన నేతలు, భారీగా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో దట్టమైన మంచు ఆవరించి ఉంది. దాంతో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణం రద్దు అయింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల అయిదు దశలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అత్యధిక గిరిజనులు గల జార్ఖండ్ రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. -
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
-
జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్!
రాంచీ : జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రుఘువర్ దాస్ పేరు దాదాపు ఖరారు అయ్యింది. బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో బీజేఎల్పీ నేతగా రఘువర్ దాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. బీజేపీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్ దాస్ (జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది. -
జార్ఖండ్ కు తొలి గిరిజనేతర సీఎం?
రాంచీ: జార్ఖండ్ లో తొలిసారిగా గిరిజనేతర నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించే అవకాశాలు కన్పిస్తున్నాయి. గిరిజనేతర నాయకుడితో సహా పలువురు పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలిస్తోంది. ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలవడంతో వెనుకబడ్డారు. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌దాస్(జంషెడ్పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే), పార్టీ సిద్ధాంతకర్త సరయూరాయ్(జంషెడ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యే), మాజీ స్పీకర్ సీపీ సింగ్(రాంచీ ఎమ్మెల్యే) పేర్లు తెరపైకి వచ్చాయి. సీఎం రేసులో ఉన్నవారెవరూ పెదవి విప్పడం లేదు. ఎమ్మెల్యేనే సీఎం అవుతారని, ఎంపీ లేదా ఓడిపోయిన అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోరని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీంతో అర్జున్ ముండాకు అవకాశం లేనట్టేనని అర్థమవుతోంది. అమిత్‌షాకు సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న రఘువర్‌దాస్ కే సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉంది. -
జార్ఖండ్ సీఎం పదవికి సిన్హా కరెక్ట్: అద్వానీ
హజారీబాగ్: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి యశ్వంత్ సిన్హా సరైన అభ్యర్థి అని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ అన్నారు. విద్యుత్ సంక్షోభానికి నిరసనగా జార్ఖండ్ లో జరుగుతున్న ఆందోళనకు బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత సిన్హా నాయకత్వం వహించాలని ఆయన ఆకాంక్షించారు. జార్ఖండ్ రాజకీయాల్లో సిన్హా కీలకభూమిక పోషించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హజారీబాగ్ జైలులో ఉన్న సిన్హాను అద్వానీ కలిశారు. హజారీబాగ్ విభాగం విద్యుత్ శాఖ జనరల్ మేనేజర్ ధనేష్ ఝాపై దాడి చేసినందుకు యశ్వంత్ సిన్హా ఈ నెల 2న అరెస్టయ్యారు. ఆయనకు కోర్టు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బెయిల్ తీసుకోవడానికి ఆయన నిరారించారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ సమస్యను బీజేపీ రాజకీయం చేస్తోందని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ విమర్శించారు.