
జార్ఖండ్ సీఎంగా రుఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం
రాంచీ : జార్ఖండ్ సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సాముండా ఫుట్బాల్ స్టేడియంలో ఆదివారం రఘువర్ దాస్ చేత రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రానికి చెందిన నేతలు, భారీగా బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది.
కానీ ఢిల్లీలో దట్టమైన మంచు ఆవరించి ఉంది. దాంతో విమాన ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రధాని మోదీ ప్రయాణం రద్దు అయింది. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఇటీవల అయిదు దశలుగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. దాంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అత్యధిక గిరిజనులు గల జార్ఖండ్ రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎంగా రఘువర్ దాస్ ప్రమాణ స్వీకారం చేశారు.