అభ్యర్థులు చురుకుగా ఉండాలి.. టోక్యో చరిత్రపై అవగాహన కలిగి ఉండాలి .. నగరం నలుమూలలు తెలిసుండాలి..ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తాం.. శారీరక దారుఢ్యం తప్పనిసరి!ఇది గైడ్ కొలువుకు అప్లికేషన్ అని అర్థమవుతోంది. కాని చివరి రిక్వైర్‌మెంట్ ఏంటీ?
నిజమే అది గైడ్ ఉద్యోగమే! దానితోపాటు రిక్షా పుల్లర్ జాబ్ కూడా! ఆశ్చర్యం వద్దు, అది నిజం! టోక్యో అనే పేరుంది కాబట్టి ఎక్కడో తెలిసిపోయే ఉంటుంది.. ఎస్ జపాన్‌లో! అయితే ఈ కొలువుకు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటున్నారట! టూరిస్ట్‌లు కూడా లేడీ రిక్షా పుల్లర్స్‌నే కోరుకుంటున్నారట. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఓపిగ్గా ఉండటం, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా వాళ్లే బేషుగ్గా ఉండటం, చిరునవ్వును చెరగనీయకపోవడం, భద్రంగా తిప్పటం వంటి కారణాల వల్ల లేడీ రిక్షా పుల్లర్స్‌కే డిమాండ్ ఉందట టోక్యోలో!
టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్‌కి మారుపేరైన జపాన్‌లో రిక్షాలు.. అదీ మనిషి లాగే రిక్షాలు?! అలాంటి రిక్షాలను మన దేశంలో ఎప్పుడో బ్యాన్ చేశాం. కానీ జపాన్‌లో ఇంకా ఉనికిలో ఉండటమే కాక.. వాటిని లాగే ఉద్యోగం పట్ల క్రేజ్ కూడా ఉండటం విస్మయమే!
రిక్షా పుల్లర్ ఉద్యోగానికి కరోనా తర్వాత డిమాండ్ పెరిగింది. కరోనా వచ్చి కొలువులకు చెక్ పెట్టడంతో ఇలాంటి జాబ్స్‌కి మళ్లారు చాలామంది. మన దగ్గర ఆటోలను అద్దెకిస్తున్నట్టు.. టోక్యోలో రిక్షా పుల్లర్ కొలువులను ఇచ్చే సంస్థలున్నాయి. దాని కోసం శిక్షణ కూడా ఇచ్చి, మరీ అపాయింట్ చేసుకుంటున్నాయి. అభ్యర్థి లర్నింగ్ స్కిల్స్‌ని బట్టి ఈ ట్రైనింగ్ రెండు నెలల నుంచి నాలుగు నెలల వరకు ఉంటుంది.
అమ్మాయిలెలా వచ్చారు?
ఇందాక చెప్పుకున్న కారణమే.. కరోనా! పాండమిక్‌కి ముందు ఈ రంగంలో మహిళలు పెద్దగా లేరు. కరోనా తర్వాత ఈ రిక్షా సంస్థలు తమ వ్యాపారం పెంచుకోవడానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావించారు. రిక్షా లాగుతున్న అమ్మాయిల వీడియోలూ పెట్టడంతో, టోక్యోలోని నిరుద్యోగ వనితలు చాలామంది ఈ ఉద్యోగంలో చేరారు. అయితే ఆ అమ్మాయిలకు తమ కుటుంబ సభ్యుల నుంచి చాలానే వ్యతిరేకత వచ్చింది. ఆడపిల్లలకు అలాంటి ఉద్యోగం ఇస్తున్న రిక్షా సంస్థలకూ స్త్రీవాదుల నుంచి నిరసన, వ్యతిరేకత తప్పట్లేదు. ‘వారానికి అయిదారైనా ఇలాంటి నిరసన, వ్యతిరేక ఫోన్ కాల్స్ వస్తుంటాయి’ అని చెప్తాడు రిక్షా సంస్థల్లో ఒకటైన ‘టోక్యో రిక్షా సంస్థ’ మేనేజర్. లేడీ రిక్షా పుల్లర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కూడా ఈ సంస్థలోనే!
లేడీ రిక్షా పుల్లర్స్ రోజుకు దాదాపు 250 కేజీల బరువుతో, 20 కిలోమీటర్ల వరకు రిక్షాలను లాగుతారు. డిమాండ్‌లో ఉన్న రిక్షా పుల్లర్స్ నెలకు పదిలక్షల యెన్‌లను సంపాదిస్తున్నారట. అంటే మన కరెన్సీలో ఇంచుమించు అయిదు లక్షల 48 వేల రూపాయలన్నమాట. లేడీ రిక్షా పుల్లర్స్ టోక్యోలోని అసకుస అనే టూరిస్ట్ ఏరియాలోనే ఎక్కువగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు దీన్నొక డిఫరెంట్ జాబ్‌గా భావించి, జాయిన్ అవుతున్నారట!
Comments
Please login to add a commentAdd a comment