సాక్షి, న్యూఢిల్లీ : అది రంజాన్ మాసం రోజులు. పాత ఢిల్లీలోని ఓ రోడ్డు మీద ఇల్లూ వాకిలి లేని ఓ యాభై ఏళ్ల అనాథ పడుకొని ఉన్నాడు. వేగంగా దూసుకొచ్చిన ఓ ట్రక్కు అతని మీదుగా దూసుకెళ్లి పల్టీ కొట్టింది. అల్లంత దూరాన ఎగిరిపడ్డ ఆ అనాథ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు గుర్తు తెలియని వ్యకిగా పేర్కొంటూ శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి పంపించారు. పోస్టు మార్టమ్ అనంతరం 15 రోజులు అయినాగానీ ఆయన శవం మార్చురీలోనే ఉండిపోయింది. గుర్తు తెలియని వ్యక్తి మరణించినప్పుడు స్థానిక పత్రికల్లో ఆయన ఫొటోగానీ, వార్తగానీ రావాలట. అప్పటి వరకు శవాన్ని శ్మశానికి పంపించమని పోలీసులు తెలిపారు.
రోడ్డు పక్కనో, రోడ్డు డివైడర్ మీద గూడులేని పేదలు, అనాథలు పడుకుంటూనే ఉంటారు. నిర్లక్ష్యంగానో, తాగిన మైకంలోనో ట్రక్కులనో, బస్సులనో నడుపుకుంటూ రావడం, అవి రోడ్డు డివైడర్‌కో, ఫుట్‌పాత్‌లనో ఢీకొనడం, అనాథలు, అభాగ్యులు మరణించడం సర్వసాధారణం. అలాంటప్పుడు ‘రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి’ అనే శీర్షికన వార్త రావాలంటే కష్టమే. గుర్తు తెలిసిన వ్యక్తుల మరణిస్తేనే స్థలాభావం వల్ల వార్త రాదు. ఇక గుర్తు తెలియని వ్యక్తి గురించి ఎవరు పట్టించుకుంటారు? అలాంటి వారు ఎక్కడి నుంచి వచ్చారో! ఎలా బతికారో ఎవరికి ఎరుక! వారికి దహన సంస్కారాలుగానీ, నివాళులుగానీ ఉండవు. అసలు అలాంటి వారికి జీవించిన దాఖలాలు కూడా ఉండవు.
ఆ రోజు ఆ రోడ్డు డివైడర్ మీద పడుకొని దుర్మరణం చెందిన వ్యక్తి మాత్రం గుర్తు తెలియని వ్యక్తి కాదు. ఆయన పేరు మొహమ్మద్ అబ్దుల్ కాసిం అలీ షేక్. రిక్షా కార్మికుడు. పశ్చిమ బెంగాల్ నుంచి ఎనిమిదవ ఏట బతుకు తెరువు కోసం ఢిల్లీకి వచ్చాడు. బెంగాల్ నుంచి అయినవాళ్లెవరో బలవంతంగా పంపిస్తే ఢిల్లీకి వచ్చినట్లు ఆయనకు గుర్తు. పంపించిన వారు ఎవరో, ఏమిటో కూడా ఆయనకు గుర్తు లేదు. అప్పటి నుంచి చిన్న చితకా పనులు చేస్తూ దానితో దొరికిన కాడికి తింటూ రోడ్లపై పడుకుంటూ పెరిగాడు.
లైంగిక వేధింపులు
కాస్త యుక్త వయస్సు రాగానే షేక్‌కు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో పని ఇప్పిస్తానంటూ, భోజనం పెట్టిస్తానంటూ మగవాళ్లే ఆ కుర్రవాణ్ని తీసుకెళ్లి వారి లైంగిక వాంఛలు తీర్చుకునేవారట. పూర్తి యవ్వనంలోకి అడుగుపెట్టాక అలాంటి వారిని దూరం పెట్టేందుకు నెలలకొద్ది స్నానం చేసేవాడు కాదట షేక్. అలా వారి పీడను వదిలించుకున్న అలీ షేక్, తాను కూడ బెట్టుకున్న డబ్బులతో సొంతంగా రిక్షా కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఆమన్ బిరాదరిలో తనలాంటి నిరాశ్రీయులు నడుపుతున్న అనాథాశ్రయంలో చేరాడు. ఓ రోజు ఆరోగ్యం బాగా లేక వైద్యుడిని దగ్గరికెళ్లి పరీక్షలు చేయించుకుంటే ‘ఎయిడ్స్’ వ్యాధి ముదిరిందని తెల్సింది.
ఆయనపై డాక్యుమెంటరీ చిత్రం
ఈ మధ్యన ‘కారవాన్ ఏ మొహమ్మద్’ అనే బృందం ఆయనకు తారసపడింది. సామాజిక సమస్యలపై పోరాడే ఆ బృందం అలీ షేక్ మీద చిన్న డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది. అందులో ఆయన తన ఆత్మకథను చెబుతూ వలసవచ్చిన వారు ఎప్పుడూ నిరాశ్రీయులేనని, కష్టపడి డబ్బు సంపాదించి సొంతంగా ఇల్లు కట్లుకున్నాక కూడా ఈ నేల నీది కాదంటూ తరిమేస్తారంటూ ఓ బెంగాలీ కవితను ఉదహరిస్తాడు. అలీ షేక్ చనిపోయిన రోజున అనాథాశ్రమంలో దోమల బెడద తట్టుకోలేక రోడ్డు డివైడర్ మీదకు వచ్చి పడుకున్నాడు. ఆయన లాగా ఎంతోమంది అనాథలు.
అభాగ్యులు ప్రాణాలను పణంగా పెట్టి డివైడర్లమీదనో, ఫుట్‌పాత్‌లపైనే పడుకోవడానికి అసలు కారణం దోమలేనట. వాహనాలు తిరేగే చోట వాహన కాలుష్యానికి దోమలు అస్సలు ఉండవట. రోడ్లపై వీచే గాలిలో వాహనాల శబ్దాలను తట్టుకొని నాలుగైదు గంటలు పడుకునేందుకు వారు అంతటి సాహసం చేస్తారు. రోజు చస్తూ బతికే జీవితాల్లో అదే అత్యంత సుఖం కాబోలు. పోలీసుల సహకారంలో ఆస్పత్రి మార్చురీ నుంచి అలీ షేక్ శవాన్ని స్వాధీనం చేసుకున్న ‘కారవాన్ ఏ మొహమ్మద్’ బృందం సభ్యులు ఆయనకు దహన సంస్కారాలు చేసి ఘనంగా నివాళులర్పించింది.
Comments
Please login to add a commentAdd a comment