‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్‌లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్‌లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది.
‘ఫర్‌గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే...
చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్‌గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది.
‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్‌గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా.
రెడ్‌లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా చీనా కపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్.
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
Published Thu, Nov 18 2021 12:37 AM | Last Updated on Thu, Nov 18 2021 3:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment