న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే తమ మద్దతు అని సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించడంపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. మిత్రపక్షం కాంగ్రెస్ యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించగా.. దానికి విరుద్ధంగా జేఎంఎం వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇటీవల జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లారు. ఆ సమయంలో సీఎం హేమంత్ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'కేంద్రం మద్దతు ఉంటే ఐదేళ్లతో జార్ఖండ్ పురోగతి సాధిస్తుంది. ఇది జార్ఖండ్ చరిత్రలో చారిత్రక రోజు. కేంద్రం, రాష్ట్రం మధ్య సహకారం ఉంటే అభివృద్ధి వేగంగా జరగడం సాధ్యమవుతుంది.' అని మోదీ వేదికపై ఉన్నప్పుడు సోరెన్ అన్నారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‍ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది. అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారని పేర్కొన్నారు.
ముర్ముకు ఘన స్వాగతం
రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జులై 4న జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా జులై 16న జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఆ రోజు జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది.
జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది. 2019లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. జేఎంఎం 30 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బీజేపీ 26 స్థానాలు కైవసం చేసుకుంది. మరో ఐదు చోట్ల ఇతరులు గెలుపొందారు.
చదవండి: జాతీయ పార్టీలపై కోవిడ్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన విరాళాలు
Comments
Please login to add a commentAdd a comment