కొత్తజంటకు సీఎం వినూత్న కానుక!
పెద్దనోట్ల రద్దు ప్రభావం పెళ్లిళ్లపైనా పడుతోంది. తగినంత నగదు అందుబాటులో లేకపోవడంతో నూతన వధూవరులకు కానుకలు ఇవ్వాలనుకున్నవారు కొన్ని సందర్భాల్లో నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ కొత్త జంటకు వినూత్న కానుక ఇచ్చారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లయింది. ఈ పెళ్లికి హాజరైన రఘుబర్ దాస్ నూతన వధూవరులకు క్యాష్ ప్రిపెయిడ్ కార్డును కానుకగా ఇచ్చారు.
నోట్ల రద్దు నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం ప్రతి జిల్లాలోని ఒక బ్లాక్‌ను ఈ నెల ముగిసేలోగా నగదు రహిత లావాదేవీల దిశగా మళ్లించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాల్సిందిగా ప్రజలకు సందేశం ఇస్తూ సీఎం పెళ్లివేడుకలో ఈ కొత్తరకం కానుకను ఇచ్చారు. గిరిజన జనాభా అధికంగా గల జార్ఖండ్‌లో నోట్ల రద్దు ప్రభావాన్ని తప్పించుకొనేందుకు నగదురహిత లావాదేవీలను వేగవంతం చేయాల్సిందిగా ప్రభుత్వం భావిస్తోంది.