'సామాన్యులకు భగవంతుడిని చేరువచేస్తా'
ఆలయాల్లో భగవంతుడి దర్శనాన్ని సామన్యులకు చేరువచేయటానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన హైద్రాబాద్ నుంచి విలేకరితో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు వీఐపీల సేవతో తరిస్తుంటే సామాన్యభక్తులు భగవంతుడిని దర్శిం చుకోవటానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు. ఆలయానికి వెళితే భగవంతుని కనులారా వీక్షించాం.. మనసారా ధ్యానించాం.. అనే భావన సంపూర్ణంగా కలిగేలా ఆలయాలను తీర్చిదిద్దుతానని తెలిపారు. దేవాలయాలు ధార్మిక సంస్థలుగా రూపుదిద్దుకుని భగవంతునికి, భక్తులకు సేవలందించేలా చూస్తానన్నారు.
దేవాదాయశాఖలో అవినీతిని రూపుమాపి, ఆలయాల ఆస్తుల కబ్జాలను నిరోధించటానికి అధిక ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఈ విషయాలకు సంబంధించి ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు, మీడియా నుంచి సలహాలు స్వీకరించి శాఖలోని అవలక్షణాలు, అవకతవకలు సరిచేయడానికిగాను కార్యాచరణ రూ పొందిస్తానని వివరించారు. ఇలాంటి విషయాల్లో నిర్మాణాత్మక సలహాలు ఎవరిచ్చినా స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఉండే అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఇతర విభాగాల సిబ్బంది సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేస్తానని చెప్పారు. భగవంతునికి విస్తృతంగా సేవచేసుకునే అవకాశం కలిగించే శాఖ తనకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బీజేపీ శాసనసభ్యులు ఇద్దరికీ వారి అభిరుచికి అనువైన శాఖలను టీడీపీ అధినేత చంద్రబాబు కేటాయించారని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.