
సెలవుపై ‘సవాంగ్’
తిరిగి 28న రాక
ఇన్‌చార్జి సీపీగా సురేంద్రబాబు
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ దామోదర గౌతమ్ సవాంగ్ సెలవుపై వె ళ్లనున్నారు. గురువారం నుంచి ఈ నెల 27 వరకు ఆయన సెలవులో ఉంటారు. సవాంగ్ స్థానంలో ఆక్టోపస్ అదనపు డీజీపీ ఎన్‌వీ సురేంద్రబాబు ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీజీపీ జె.వి.రాముడు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఆగస్టులో పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సవాంగ్ అనతి కాలంలోనే సంచలన కేసులు చేపట్టారు. నగరం నుంచి గుట్కా మాఫియాను తరిమికొట్టడంతో పాటు కల్తీ నెయ్యి, కల్తీ మద్యం కేసులపై ప్రత్యేక దృష్టిసారించారు. కాల్‌మనీ ముసుగులో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఇందులో పలువురిపై కేసు నమోదుతో పాటు అధికార పార్టీ ప్రముఖుల పాత్రపై దృష్టిసారించారు. ఈ క్రమంలోనే హఠాత్తుగా ఆయన సెలవుపై వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో పెట్టుకున్న దరఖాస్తును 20 రోజుల కిందటే ఆమోదించినట్టు డీజీపీ చెపుతున్నారు. ఇదే సమయంలో సవాంగ్ కంటే సమర్థుడైన సురేంద్రబాబును సీపీగా నియమించామంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లోని మర్మం బదిలీ పర్యవసానమేననేది కమిషనరేట్ వర్గాల అభిప్రాయం. కమిషనర్ సవాంగ్ బదిలీ ఊహాగానాలకు తెరపడాలంటే ఈ నెల 27 వరకు ఆగాల్సిందే.
యాదృచ్ఛికమేనా...
కాల్‌మనీ ముసుగులో సెక్స్ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చి అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్న క్రమంలోనే ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా సురేంద్రబాబు రావడంపై పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. యాదృచ్ఛికంగానే ఆయనను ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌గా నియమించారా? లేక ఉద్దేశపూర్వకమా? అనే దానిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన సురేంద్రబాబు వడ్డీ వ్యాపారుల ఆటకట్టించేందుకు భారీ కసరత్తు చేశారు. అనేకమంది కాల్‌మనీ వ్యాపారులను అదుపులోకి తీసుకొని చెక్కులు, నోట్లు చించేశారు. పలువురు కాల్‌మనీ వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేశారు. దీంతో ఈ కేసులో ఆయన వ్యవహార శైలిపై పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.