
వడ్డీ వ్యాపారులకు ముకుతాడు!
- అప్పుల వసూలుకు వేధిస్తే జైలు.. ఆస్తుల జప్తు
- వడ్డీలపైనా నియంత్రణ
- అన్నదాతలను ఆదుకునేందుకు కొత్త చట్టానికి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్ల కారణంగానే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు నిర్ధారణ జరిగితే.. ఆ వ్యాపారి ఆస్తులను జప్తు చేసేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రుణాల రికవరీ కోసం రైతులను వేధించే వడ్డీ వ్యాపారులకు గతంలో ఉన్న చట్టాల ప్రకారం.. ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించేలా నిబంధనలున్నాయి.
అవసరమైతే ఈ శిక్ష కాలాన్ని మరింత పొడిగించాలని భావిస్తోంది. వరుసగా జరుగుతున్న రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు కొత్తగా తెలంగాణ వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాన్ని (మనీలాండరింగ్ యాక్ట్) తీసుకురావాలని నిర్ణయించింది. అందుకు సంబంధించి గతంలో ఉన్న చట్టాలకు పదును పెడుతోంది. రైతులను అప్పుల ఒత్తిడి నుంచి గట్టెక్కించేలా ఈ కొత్త చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ‘ఉమ్మడి రాష్ట్రంలో తెచ్చిన వడ్డీ వ్యాపారుల నియంత్రణ చట్టానికి కాలం చెల్లింది. మళ్లీ ఆ చట్టాన్ని తెస్తాం. రైతులను ఆదుకుంటాం...’ అని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
అందుకు సంబంధించిన కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు గతంలో ఉన్న చట్టాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వడ్డీ వ్యాపార నియంత్రణ చట్టాలను పరిశీలిస్తున్నారు. మన ప్రాంతంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు చేసి కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నారు. చట్టం నిబంధనలు తయారు చేసిన తర్వాత న్యాయశాఖ, హోంశాఖ పరిశీలనకు పంపుతారు. ఆ శాఖల ఆమోదం తర్వాత చట్టానికి తుది రూపునిస్తారు.
కట్టుదిట్టమైన నిబంధనలు..
గతంలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ ఏరియా) మనీ లాండరింగ్ యాక్ట్-1939 ఫస్లీ, ఆంధ్రప్రదేశ్ పాన్ బ్రోకర్స్ యాక్ట్-2002 చట్టాలతో పాటు వైఎస్సార్ హయాంలో ఏపీ మైక్రో ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూషన్ష్( మనీ లెండింగ్) చట్టం అమల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణలో మైక్రో ఫైనాన్స్ సంస్థల బెడద లేదు. అందుకే మిగతా రెండు చట్టాల్లో ఉన్న నిబంధనలను ఆర్థిక శాఖ పరిగణనలోకి తీసుకుంటోంది. వీటిలో రైతులకు ఉపయుక్తంగా ఉండే నిబంధనలను పరిశీలిస్తోంది.
గతంలో ఉన్న తరహాలోనే సెక్యూరిటీ పెట్టి తీసుకున్న రుణాలకు ఏడాదికి 6 శాతం, సెక్యూరిటీ లేకుండా ఇచ్చే రుణాలకు 12 శాతం మించకుండా వడ్డీని నియంత్రించే అవకాశముంది. వడ్డీ వ్యాపారులు బలవంతంగా రుణాల వసూలు చేయవద్దని, వేధించవద్దని చట్టంలో ఉంది. వేధింపులకు పాల్పడితే ఆరు నెలల పాటు జైలుశిక్ష లేదా జరిమానా విధించే నిబంధనలున్నాయి.
రుణాలకు బదులుగా ఆస్తులు జప్తు చేయటాన్ని నియంత్రిస్తుంది. 2012లో కేరళలో వరుసగా జరిగిన రైతుల ఆత్మహత్యలకు నిలువరించేందుకు అక్కడి ప్రభుత్వం వడ్డీ నియంత్రణ చట్టాన్ని తెచ్చింది. రుణాల రికవరీకి ఒత్తిడి చేసిన వడ్డీ వ్యాపారులపై ఏకంగా మూడేళ్ల పాటు జైలుశిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించేలా కట్టుదిట్టమైన నిబంధనలు విధించింది. ఈ చట్టం అమలు చేయటంతో కేరళలో రైతుల ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందనే విశ్లేషణలున్నాయి. దౌర్జన్యాలు, వేధింపులకు పాల్పడే వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపేలా చట్టం కఠినంగా ఉంటే రైతులను అప్పుల ఒత్తిడి నుంచి విముక్తి చేసినట్లవుతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.