అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య
చక్రవర్తులపల్లె(చాగలమర్రి):
అప్పులబాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చక్రవర్తులపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి (45), తిరుపాలమ్మ దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి సంతానం లేదు. గ్రామంలోని తన నాలుగు ఎకరాల పొలంలో పంటలు సాగు చేస్తూ జీవిస్తున్నారు. ఈ ఏడాది మూడు ఎకరాల్లో మినుము, ఎకరాలో వరి పంటను సాగు చేశాడు. సుమారు రూ. 1.50 లక్షలు అప్పు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో తెగుళ్లు సోకడంతో మందులు, ఎరువులకు పెట్టుబడి లేక భార్యాభర్తలు రెండు రోజులుగా తీవ్ర ఆందోళన చెందారు. గత ఏడాది తీసుకొన్న అప్పులు తీరక, కొత్త అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురైన రామకృష్ణారెడ్డి గురువారం తెల్లవారు జామున పొలాని వెళ్లి అక్కడే పురుగు మందు సేవించి అపస్మారక స్థితిలో పడి పోయాడు. పక్క పొలాల్లో కూలీలు గమనించడంతో హుటా హుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా మారడంతో కర్నూలుకు తరలించారు. కోలుకోలేక కొద్దిసేపటికి మృతి చెందాడు. రామకృష్ణారెడ్డి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. చాగలమర్రి పోలీసులు కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.