జూన్ నెల.. జేబు విలవిల
ప్రత్తిపాడుకు చెందిన సాయిరాం ఓ ప్రైవేట్ కంపెనీలో టెక్నికల్ అసిస్టెంటుగా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. నెల జీతం రూ.11 వేలు. ప్రతి నెలా కుటుంబ ఖర్చులుపోనూ వెయ్యో, పదిహేను వందలో మిగులుతాయి. ఇప్పుడు జూన్ గండమొచ్చింది. స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, నోట్ బుక్స్, టెక్స్ట్‌బుక్స్.. ఇలా అనేక ఖర్చులు అదనంగా వచ్చి కూర్చున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడం.. పొదుపునకు సరిపడా ఆదాయం రాకపోవడంతో వడ్డీ వ్యాపారుల తలుపుతట్టాడు.
* ఈ నెలలో ఇంటి బడ్జెట్ తారుమారు
* సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అప్పులపాలు
* పిల్లల చదువులతో ఆర్థిక భారం
* ముందస్తు ప్రణాళిక అవసరమంటున్న ఆర్థిక నిపుణులు
ప్రత్తిపాడు : జూన్ వచ్చిందంటే స్కూలుకు వెళ్లే పిల్లలున్న ఇంట ఒక్కటే టెన్షన్.. ఇంటి బడ్జెట్ లెక్కలన్నీ తారుమారవుతాయి. సామాన్య, మధ్య తరగతిపై ‘జూన్ భారం’ పెనుభారమవుతుంది. ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేస్తుంది. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ధరలు, కూరల ధరలు పెరిగి సగటు జీవి మనుగడ ఆందోళనకరంగా మారింది.
ఈ నేపథ్యంలో విద్య కోసం వెచ్చించాల్సి మొత్తం రెట్టింపై కూర్చుంది. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడడం లేదు. ఇదే అదనుగా తీసుకుని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు జేబులు గుల్ల చేస్తున్నారు. పల్లెల్లో పక్క ఇంటి వారితో పోటీపడుతూ ఉంటారు. వారి పిల్లలు కాన్వెంట్‌లో చదువుతున్నారంటే..తమ పిల్లలను అలానే చదివించాలనే తలంపుతో ఉంటారు. దీని కోసం ఎంత అప్పు చేయడానికైనా వెనుకాడరు. అయితే ఆర్థిక ప్రణాళికతో ఇలాంటి గండాలను అధికమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి ఏటా పెరుగుతున్న ఫీజులు..
ప్రతి ఏటా చదువులకు సంబంధించి ఖర్చులు పెరిగిపోతున్నాయి. నర్సరీ నుంచే వేలకు వేలు ఫీజులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఒక్కో తరగతి పెరిగే కొద్దీ పది నుంచి ఇరవై శాతం వరకు ఫీజులను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం పాఠశాల స్థాయిని బట్టి ఫీజులు నిర్ణయిస్తున్నారు. ఎల్‌కేజీకే ఐదు వేల నుంచి ఫీజులు ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్‌లో అయితే ఎల్‌కేజీకి రూ.8 వేల నుంచి రూ.పది వేల వరకూ వసూలు చేస్తున్నారు. ప్రైమరీ తరగతులకు రూ. 15 వేల నుంచి రూ.20 వేలు వెచ్చించాల్సి వస్తోంది.
ఖర్చులు భారంగా మారాయి
జూన్‌లో ఖర్చులు ఒకేసారి రావటంతో భారంగా మారాయి. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయం, పొలాలకు పెట్టుబడులు సమయం ఒకేసారి వచ్చాయి. ఒక పక్క పెరిగిన ఫీజలు, పుస్తకాల ధరలు, మరో పక్క పెరిగిన కౌలు ధరలు, విత్తనాల రేట్లతో అల్లాడిపోతున్నాం .దీంతో కూడబెట్టుకున్న డబ్బులు సరిపోక అప్పులు తీసుకురావల్సి వస్తుంది.
- కంచర్ల సింగారావు
జూన్ వస్తే దడే
జూన్ వస్తే చాలు ఇబ్బం దులు తప్పడం లేదు. నా నెల సంపాదనలో అగ్రభాగాన్ని పిల్లల చదువులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రతి నెలా ఏదో రకంగా ఖర్చులకు మా సంపాదన సరిపోతుంది. కానీ ఈ నెల మాత్రం ఆర్థిక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. అన్ని రకాల విద్యా సామగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
- టీ రవి