న్యూఢిల్లీ: కుమార్తెలు తమ చదువులకయ్యే ఖర్చులను తల్లిదండ్రుల నుంచి పొందడం చట్టబద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆడబిడ్డలను చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంది. విద్యాభ్యాసానికి అయ్యే సొమ్మును పొందడం ఆడపిల్లల చట్టబద్ధమైన హక్కు అని తేల్చిచెప్పింది. పెద్దలు తమ స్థోమత మేరకు కుమార్తెలకు చదువులు చదివించాలని వెల్లడించింది.
విడిపోయిన దంపతుల కుమార్తెకు సంబంధించిన ఓ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. సదరు దంపతులు 26 ఏళ్ల క్రితం విడిపోయారు. వారికి ఒక కుమార్తె ఉంది. మనోవర్తి కింద భార్యకు రూ.73 లక్షలు ఇవ్వడానికి భర్త అంగీకరించాడు. ఇందులో కుమార్తె చదువులకు అయ్యే ఖర్చు రూ.43 లక్షలు కలిపే ఉంది. కుమార్తె ఐర్లాండ్‌లో చదువుతోంది.
తండ్రి ఇచ్చిన సొమ్ము తీసుకొనేందుకు నిరాకరించింది. తన సొంత డబ్బుతో చదువుకోగలనని, ఇంకొకరి సాయం అవసరం లేదని తేల్చిచెప్పింది. దీంతో ఆమె తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, కన్నబిడ్డను చదివించుకోగలనని, చదువుకయ్యే సొమ్మును తన కుమార్తె తీసుకొనేలా ఆదేశాలివ్వాలని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేశాడు. దీనిపై ధర్మాసనం ఈ నెల 2వ తేదీన విచారణ చేపట్టింది. చదవులకయ్యే ఖర్చును తల్లిదండ్రుల నుంచి పొందే హక్కు కుమార్తెకు ఉందని వెల్లడించింది. తండ్రి నుంచి ఆ డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే తల్లికి ఇవ్వాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment