రాష్ట్రంలో కేటగిరీలవారీగా ప్రైవేటు స్కూళ్ల విభజనకు అవకాశం
స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం?.. తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫార్సు మేరకే ఫీజులు!
ఇకపై ఎంఈవో స్థాయి అధికారి ద్వారా ప్రైవేటు స్కూళ్ల తనిఖీ
త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్న విద్యా కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలకు ముకుతాడు వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ ప్రభుత్వానికి కీలక సూచనలు, సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. ప్రైవేటు స్కూళ్లను వర్గీకరించడంతోపాటు ఆయా స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని నివేదిక సమర్పించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా స్కూళ్లపై విద్యాశాఖకు పూర్తి అధికారం ఇవ్వాలని.. ప్రైవేటు స్కూళ్లను ఎంఈవో స్థాయి అధికారి తనిఖీ చేయాలనే సిఫార్సు చేయనుంది.
అలాగే మౌలిక వసతుల కల్పన, అనుభవజు్ఞలైన టీచర్లు, ఇతర సిబ్బందికి అయ్యే ఖర్చును ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. అన్ని స్కూళ్లను ఆడిట్ పరిధిలోకి తేవడాన్ని సరైన విధానంగా భావిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల విషయంలో మరికొన్ని షరతులు విధించాలనే యోచనలో ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ సిఫా ర్సు మేరకే ఫీజులు ఉండాలనే ప్రభుత్వానికి సూచించాలని భావిస్తోంది.
రూ. లక్షల్లో ఫీజులు: ప్రైవేటు స్కూళ్లు భారీగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతు న్నాయి. అలాగే పుస్తకాలు, దుస్తులు, ఇతర అవసరాల పేరుతో అదనంగా వసూళ్లు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక కార్పొరేట్ స్కూళ్లు అయితే రూ. 5 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు వార్షిక ఫీజులు దండుకుంటున్నాయని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా స్కూళ్లను కట్టడి చేసేందుకు సిఫార్సులు చేయాలని విద్యా కమిషన్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కమిషన్ నివేదిక అనంతరం వచ్చే ఏడాది నుంచి ఫీజుల కట్టడికి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ప్రైవేటు స్కూళ్ల వాదన ఇలా..
⇒ రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేసే స్కూళ్లను.. రూ. 50 వేలలోపు ఫీజులు తీసుకొనే స్కూళ్లను ఒకే గాటన కట్టకూడదు. ∙ఏటా 15 శాతం ఫీజు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలి.
కార్పొరేట్ స్కూళ్ల డిమాండ్ ఇదీ..
⇒ మారిన విద్యా విధానంలో కంప్యూటర్ విద్యకు ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. సబ్జెక్టు టీచర్ల వేతన భారం పెరిగింది.
⇒ ఏటా ఫీజులు పెంచుకొనే అవకాశం ఇవ్వాలి.
అందరికీ ఆమోద యోగ్యంగా నివేదిక..
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల విధానం ఎలా ఉండాలనే అంశంపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. విద్యా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్కూళ్ల యాజమాన్యాలతో విస్తృత సంప్రదింపులు జరిపాం. అందరికీ ఆమోదయోగ్యమైన అంశాలతోనే నివేదిక రూపొందిస్తున్నాం. ఫీజుల నియంత్రణ వల్ల పేద వర్గాలకు ఊరట ఉంటుందని ఆశిస్తున్నాం. – ఆకునూరి మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment