‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..! | police did not respond over vijayarani case | Sakshi
Sakshi News home page

‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..!

Published Mon, Oct 27 2014 11:32 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..! - Sakshi

‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..!

  • వడ్డీ వ్యాపారులపై సీసీఎస్ ఉదాసీనత
  • మరోపక్క పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్న కమిషనర్
  • సాక్షి, సిటీబ్యూరో: వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఓ పక్క నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి హెచ్చరిస్తుంటే.... మరోపక్క సీసీఎస్ పోలీసులు మాత్రం వడ్డీ వ్యాపారులకు ఎర్రతివాచీ పరిచి దొడ్డి దారిన సాగనంపారు. వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు వసూలు చేసిన 28 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన సీసీఎస్ అధికారులు ఆరు నెలలైనా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

    టీవీ ఆర్టిస్టు విజయరాణి అరెస్టు సందర్భంగా ఏప్రిల్ 11న  మీడియాతో డీసీపీ పాలరాజు ఏమన్నారంటే... ‘‘చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా దోచుకున్న టీవీ ఆర్టిస్టు విజయరాణి అలియాస్ చిట్టీలరాణి (46) రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకపోయినా చిట్టీలు నిర్వహించడంతో ఆమెకు నష్టాలొచ్చాయి. వీటిని పూడ్చేందుకు తెలిసిన వారి వద్ద రూ.3 నుంచి రూ.20 వరకు వడ్డీకి అప్పు తీసుకుంది. ఈ వడ్డీలు చెల్లించేందుకు మరికొంత మంది దగ్గర లక్షలాది రూపాయలు అప్పు చేసింది. ఓ వ్యక్తి వద్ద ఆమె రూ.లక్ష అప్పు తీసుకుని కేవలం వడ్డీ రూపంలో ప్రతి రోజు అతనికి రూ.3,500 చెల్లించేది. ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తాం’’ అన్నారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ఒక్క వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయలేదు.

    ఆర్థికంగా నష్టపోయి బెంగళూరుకు పరార్...

    ఎర్రగడ్డకు చెందిన టీవీ ఆర్టిస్టు విజయరాణి నాలుగేళ్ల నుంచి ఇంట్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది.  ఆర్ధికంగా పూర్తిగా దిగజారడంతో అప్పుల బాధ పెరిగిపోయింది. కొందరు అప్పుల వారు ఆమెను ఏకంగా బెదిరించడంతో పిల్లాపాపలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి మార్చి నెలలో బెంగళూరుకు పారిపోయింది. దీంతో చిట్టీలు వేసి మోసపోయిన సుమారు 80 మంది బాధిత ఆరిస్టులు రూ.10 కోట్ల వరకు మోసపోయామని  సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో అదే నెల 11న ఆమెతోపాటు మరో ఏడుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
     
    వడ్డీ రూపంలో రూ.1.95 కోట్లు చెల్లింపు...

    విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ.1.20 కోట్లు రావాల్సి ఉంది. వీరు కూడా ఆమె వద్ద చిట్టీలు వేశారు. ఇక ఆమె చిట్టీలు ఎత్తుకోని 78 మందికి సుమారు రూ.2.20  కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు చెల్లించిందని విచారణలో తేలింది. అరెస్టు సమయంలో ఆమె విక్రయించిన మూడు ఇళ్లు, కారు, మూడు బైక్‌లు, రూ.845 నగదు, కొన్ని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టు ద్వారా విక్రయించి బాధితులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు.
     
    ఆమె వడ్డీలకే అధికంగా డబ్బులు కట్టడంతో నష్ట పోయిందని చెప్పిన అధికారులు ఆ వడ్డీ వ్యాపారుల విషయంలో  మాత్రం చేతులెత్తేశారు. అలాగే ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే వారి పేర్లు, వివరాలు సీసీఎస్‌పోలీసుల చేతికి అందినా నేటి వరకు కూడా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడైనా స్పందించి వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని బాధితులు  కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement