emmahendarreddi
-
‘చిట్టీలరాణి’ కేసు హుష్‌కాకి..!
వడ్డీ వ్యాపారులపై సీసీఎస్ ఉదాసీనత మరోపక్క పీడీ యాక్ట్ ప్రయోగిస్తామంటున్న కమిషనర్ సాక్షి, సిటీబ్యూరో: వడ్డీ వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఓ పక్క నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి హెచ్చరిస్తుంటే.... మరోపక్క సీసీఎస్ పోలీసులు మాత్రం వడ్డీ వ్యాపారులకు ఎర్రతివాచీ పరిచి దొడ్డి దారిన సాగనంపారు. వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు వసూలు చేసిన 28 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని చెప్పిన సీసీఎస్ అధికారులు ఆరు నెలలైనా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీవీ ఆర్టిస్టు విజయరాణి అరెస్టు సందర్భంగా ఏప్రిల్ 11న మీడియాతో డీసీపీ పాలరాజు ఏమన్నారంటే... ‘‘చిట్టీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తోటి ఆర్టిస్టులను నిలువునా దోచుకున్న టీవీ ఆర్టిస్టు విజయరాణి అలియాస్ చిట్టీలరాణి (46) రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. అయితే ఒక్కో గ్రూప్‌లో పూర్తిగా సభ్యులు చేరకపోయినా చిట్టీలు నిర్వహించడంతో ఆమెకు నష్టాలొచ్చాయి. వీటిని పూడ్చేందుకు తెలిసిన వారి వద్ద రూ.3 నుంచి రూ.20 వరకు వడ్డీకి అప్పు తీసుకుంది. ఈ వడ్డీలు చెల్లించేందుకు మరికొంత మంది దగ్గర లక్షలాది రూపాయలు అప్పు చేసింది. ఓ వ్యక్తి వద్ద ఆమె రూ.లక్ష అప్పు తీసుకుని కేవలం వడ్డీ రూపంలో ప్రతి రోజు అతనికి రూ.3,500 చెల్లించేది. ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన 28 మందిపై కేసులు నమోదు చేస్తాం’’ అన్నారు. ఆరు నెలలైనా ఇప్పటి వరకు ఒక్క వడ్డీ వ్యాపారిపై కూడా కేసు నమోదు చేయలేదు. ఆర్థికంగా నష్టపోయి బెంగళూరుకు పరార్... ఎర్రగడ్డకు చెందిన టీవీ ఆర్టిస్టు విజయరాణి నాలుగేళ్ల నుంచి ఇంట్లోనే ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటుగా రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు చిట్టీలు నిర్వహించేది. ఆర్ధికంగా పూర్తిగా దిగజారడంతో అప్పుల బాధ పెరిగిపోయింది. కొందరు అప్పుల వారు ఆమెను ఏకంగా బెదిరించడంతో పిల్లాపాపలతో కలిసి ఇల్లు ఖాళీ చేసి మార్చి నెలలో బెంగళూరుకు పారిపోయింది. దీంతో చిట్టీలు వేసి మోసపోయిన సుమారు 80 మంది బాధిత ఆరిస్టులు రూ.10 కోట్ల వరకు మోసపోయామని సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో అదే నెల 11న ఆమెతోపాటు మరో ఏడుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వడ్డీ రూపంలో రూ.1.95 కోట్లు చెల్లింపు... విజయరాణికి 54 మంది నుంచి సుమారు రూ.1.20 కోట్లు రావాల్సి ఉంది. వీరు కూడా ఆమె వద్ద చిట్టీలు వేశారు. ఇక ఆమె చిట్టీలు ఎత్తుకోని 78 మందికి సుమారు రూ.2.20 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆమె వడ్డీల రూపంలో రూ.1.95 కోట్లు చెల్లించిందని విచారణలో తేలింది. అరెస్టు సమయంలో ఆమె విక్రయించిన మూడు ఇళ్లు, కారు, మూడు బైక్‌లు, రూ.845 నగదు, కొన్ని బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని కోర్టు ద్వారా విక్రయించి బాధితులకు అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆమె వడ్డీలకే అధికంగా డబ్బులు కట్టడంతో నష్ట పోయిందని చెప్పిన అధికారులు ఆ వడ్డీ వ్యాపారుల విషయంలో మాత్రం చేతులెత్తేశారు. అలాగే ఆమె నుంచి అధిక వడ్డీలు వసూలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. అయితే వారి పేర్లు, వివరాలు సీసీఎస్పోలీసుల చేతికి అందినా నేటి వరకు కూడా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడైనా స్పందించి వడ్డీ వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని బాధితులు కోరుతున్నారు. -
కట్నం కేసుల్లో ఎస్ఓపీ పాటించండి
మహిళా ఠాణాల అధికారులతో కొత్వాల్ సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లోని అన్ని మహిళా పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్లు ఒకే పద్ధతిని అవలంభించాలని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కట్న వేధింపుల కేసుల్లో అధికారులు, సిబ్బంది బాధితులు, నిందితులతో ఎలా నడవాలనే విషయంపై ‘స్టాండర్డ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్ఓపీ)లోని నిబంధనలు, సూచనలను పాటించాలని కమిషనర్ ఆదేశించా రు. మహిళా ఠాణాల ఇన్స్పెక్టర్లు, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ పాలరాజుతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మహిళల కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, చట్టాన్ని ఉల్లంఘించి తమ ఇష్టం వచ్చినట్లు నడవడం వల్ల ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పోతుందని ఆయన హెచ్చరించారు. అయితే, కట్న వేధింపులు, గృహహింస తదితర కేసుల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఎస్ఓపీలో సూచించిన పద్ధతులు, విధివిధానాల ప్రకారం నడుచుకోవాలన్నారు. మహిళా కేసుల్లో అనవసరంగా ఎవరిని వేధించవద్దని, బాధితులు ఒత్తిడి తెచ్చినంత మాత్రాన అతిగా వ్యవహరించవద్దని అధికారులకు సూచించారు. సమావేశంలో మహిళా ఠాణాల ఇన్స్పెక్టర్లు బి.ధనలక్ష్మి, జి.రజిత, వి.శ్రీనివాస్‌రెడ్డి, టి.జ్యోత్స్న పాల్గొన్నారు. వరకట్నం కేసుల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇన్స్పెక్టర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరంలోని మహిళా ఠాణాలివే.. నార్త్‌జోన్ పరిధిలోని బాధితులందరూబేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాలి. అక్కడ ఇన్స్పెక్టర్ బి.ధనలక్ష్మి ఉంటారు. అలాగే సౌత్‌జోన్ (పాతబస్తీ) వారు హైకోర్టు ఎదురుగా ఉన్న ఘాన్సీబజార్‌లోని సౌత్‌జోన్ మహిళా ఠాణాలో ఇన్స్పెక్టర్ జి.రజితను, ఈస్ట్, సెంట్రల్, వెస్ట్‌జోన్‌లకు సంబంధించి నాంపల్లిలోని సీసీఎస్ భవనంలో ఉన్న మహిళా పోలీసు స్టేషన్ (సీసీఎస్)ను ఆశ్రయించాలి. ఈస్ట్, సెంట్రల్ జోన్లకు సంబంధించి ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, వెస్ట్‌జోన్‌కు సంబంధించి ఇన్స్పెక్టర్ టి.జోత్స్న కేసులను దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్, బేగంపేట ఠాణాలలో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు, కౌన్సెలర్లు ఉన్నారు. సౌత్‌జోన్ మహిళా ఠాణాలో త్వరలోనే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎస్ఓపీ ముఖ్య ఉద్దేశాలు...... వరకట్నం కేసుల్లో అధికారులు ఎలా వ్యవహరించాలి, ప్రామాణిక కార్యాచరణ విధానం వంటివి అంశాలతో ఎస్ఓపీ రూపొందించారు. పోలీసు అధికారుల వ్యక్తిగత నిర్ణయాలు తగ్గించడం. తద్వారా కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నివారించడం. ఏ కేసు వచ్చినా చట్టపరిధిలోనే పని చేయడం. ఎస్‌ఓపీలోని సూచనలు... సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన సూచనలను పాటించాలి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేయకూడదు బాధితులు, నిందితుల (భార్య, భర్త)ను స్టేషన్‌కు పిలిపించాలి ఇరువురి వివరణ శ్రద్ధగా వినాలి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లో కౌన్సెలింగ్ ఇప్పించాలి ఇలా మూడు సార్లు కౌన్సెలింగ్స్ ఇప్పించాలి పరిస్థితి మారకుంటే కౌన్సెలర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయకూడదు కేసు నమోదైనట్లు ముందుగా నోటీసులు జారీ చేయాలి వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే వారం రోజులు గడువు ఇచ్చి మరో నోటీసు జారీ చేయాలి ఇలా మూడు నోటీసులు జారీ చేసినా వారు స్టేషన్‌కు రాకుంటే అరెస్టు చేయాలి అరెస్టు సమయంలో వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించాలి బాధితులు ఒత్తిడి చేస్తున్నారని, వారిని సంతృప్తి పర్చడానికి చట్టాన్ని అతిక్రమించకూడదు. మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నిష్పక్షపాతంగా విచారణ చేపడతాం. అందుకు కావాల్సిన ఎస్ఓపీ విధానాన్ని తయారు చేశాం. వరకట్న కేసుల్లో దంపతులిద్దరి వాదనలు వింటాం. తమ సూచనలతో ఇద్దరూ సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టు తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. - మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ -
పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం
‘జపాన్’ విధానం అమలుకు నగర సీపీ కసరత్తు తొలివిడతగా అధికారులకు ప్రత్యేక శిక్షణ బాధితుల పట్ల మర్యాదగా ఉండాలని సీపీ మహేందర్‌రెడ్డి సూచన సాక్షి, సిటీబ్యూరో: పోలీసు స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు, పోలీసు అధికారి కార్యాలయానికి ఎవరు వచ్చినా మర్యాదగా వ్యవహరించాలని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇక్కడ ‘జపాన్ కైజన్ టెక్నిక్’ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా సిబ్బందితోపాటు అధికారుల్లో క్రమశిక్షణ అలవరుతుందని, కార్యాలయాల పనితీరులో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రతి అధికారికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు తొలివిడతగా శుక్రవారం జీడిమెట్లలోని ‘ఉషా శ్రీరామ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’లో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు అవసరమైన సహాయం చేయడం పోలీసు విధిగా భావించాలని, బాధితుడికి ఊర ట కలిగించేందుకు సిబ్బంది పనితీరులో మార్పులు రావాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. స్టేషన్‌కు వచ్చే వారిని మర్యాదగా పలుకరించేందుకు రిసెప్షన్ వ్యవస్థను మరిత పటిష్టపరచనున్నారు. బాధితుడు కేసు పెట్టిన తరువాత ఆ కేసు పురోగతి కోసం స్టేషన్‌కు వస్తే వివరాలు అందుబాటులో ఉండేలా ఠాణాలను తీర్చిదిద్దాలన్నారు. స్టేషన్లో రికవరీ వాహనాలు, ఇతర సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా క్రమపద్ధతిలో పెట్టాలని సూచించారు. లాకప్, రైటర్, రిసెప్షన్, ఎస్హెచ్ఓ, ఎస్ఐల గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, కేసు రిజిస్టర్ చేయడం, పెండింగ్ వారెంట్లు, చార్జిషీట్ దాఖలు, పాత నేరస్తుల పట్టిక, రౌడీషీటర్ల జాబితా తదితర ఫైళ్లను క్రమపద్ధతిలో భద్రపరచాలన్నారు. స్టేషన్ నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తుందని, ఈ డబ్బు సరిపోనందున కనీసం నెలకు రూ.75 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నియమించిన పోలీసు టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు. తాను సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో అక్కడ ప్రవేశపెట్టిన కల్చర్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆశించిన విజయాలు సాధించినట్టు చెప్పారు. కమిషనర్ ‘5-ఎస్’ సూత్రం.. ఎస్- సార్టింగ్ (కేసుల విభజన) ఎస్- సిస్టమైజేషన్ (పకడ్బందీగా విధానాల అమలు) ఎస్- షైనింగ్ (ముఖ్యమైన కేసుల తక్షణ గుర్తింపు) ఎస్- స్టాండడైజేషన్ (అత్యున్నత ప్రమాణాలు, పద్ధతులు పాటించడం) ఎస్- సెల్ఫ్ డిసిప్లేన్ (వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం)