
కట్నం కేసుల్లో ఎస్‌ఓపీ పాటించండి
- మహిళా ఠాణాల అధికారులతో కొత్వాల్
సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్‌లోని అన్ని మహిళా పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్లు ఒకే పద్ధతిని అవలంభించాలని పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కట్న వేధింపుల కేసుల్లో అధికారులు, సిబ్బంది బాధితులు, నిందితులతో ఎలా నడవాలనే విషయంపై ‘స్టాండర్‌డ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ)లోని నిబంధనలు, సూచనలను పాటించాలని కమిషనర్ ఆదేశించా రు. మహిళా ఠాణాల ఇన్‌స్పెక్టర్లు, అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, సీసీఎస్ డీసీపీ పాలరాజుతో కలిసి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
నాలుగు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. మహిళల కేసుల్లో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, చట్టాన్ని ఉల్లంఘించి తమ ఇష్టం వచ్చినట్లు నడవడం వల్ల ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పోతుందని ఆయన హెచ్చరించారు. అయితే, కట్న వేధింపులు, గృహహింస తదితర కేసుల్లో అధికారులు ఏకపక్షంగా వ్యవహరించకుండా ఎస్‌ఓపీలో సూచించిన పద్ధతులు, విధివిధానాల ప్రకారం నడుచుకోవాలన్నారు.
మహిళా కేసుల్లో అనవసరంగా ఎవరిని వేధించవద్దని, బాధితులు ఒత్తిడి తెచ్చినంత మాత్రాన అతిగా వ్యవహరించవద్దని అధికారులకు సూచించారు. సమావేశంలో మహిళా ఠాణాల ఇన్‌స్పెక్టర్లు బి.ధనలక్ష్మి, జి.రజిత, వి.శ్రీనివాస్‌రెడ్డి, టి.జ్యోత్స్న పాల్గొన్నారు. వరకట్నం కేసుల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇన్‌స్పెక్టర్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
నగరంలోని మహిళా ఠాణాలివే..
నార్త్‌జోన్ పరిధిలోని బాధితులందరూబేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించాలి. అక్కడ ఇన్‌స్పెక్టర్ బి.ధనలక్ష్మి ఉంటారు. అలాగే సౌత్‌జోన్ (పాతబస్తీ) వారు హైకోర్టు ఎదురుగా ఉన్న ఘాన్సీబజార్‌లోని సౌత్‌జోన్ మహిళా ఠాణాలో ఇన్‌స్పెక్టర్ జి.రజితను, ఈస్ట్, సెంట్రల్, వెస్ట్‌జోన్‌లకు సంబంధించి నాంపల్లిలోని సీసీఎస్ భవనంలో ఉన్న మహిళా పోలీసు స్టేషన్ (సీసీఎస్)ను ఆశ్రయించాలి. ఈస్ట్, సెంట్రల్ జోన్‌లకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, వెస్ట్‌జోన్‌కు సంబంధించి ఇన్‌స్పెక్టర్ టి.జోత్స్న కేసులను దర్యాప్తు చేస్తున్నారు. సీసీఎస్, బేగంపేట ఠాణాలలో దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు, కౌన్సెలర్లు ఉన్నారు. సౌత్‌జోన్ మహిళా ఠాణాలో త్వరలోనే కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు.
ఎస్‌ఓపీ ముఖ్య ఉద్దేశాలు......
వరకట్నం కేసుల్లో అధికారులు ఎలా వ్యవహరించాలి, ప్రామాణిక కార్యాచరణ విధానం వంటివి అంశాలతో ఎస్‌ఓపీ రూపొందించారు.
పోలీసు అధికారుల వ్యక్తిగత నిర్ణయాలు తగ్గించడం.
తద్వారా కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నివారించడం.
ఏ కేసు వచ్చినా చట్టపరిధిలోనే పని చేయడం.
ఎస్‌ఓపీలోని సూచనలు...
సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన సూచనలను పాటించాలి
ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్‌ఐఆర్ చేయకూడదు
బాధితులు, నిందితుల (భార్య, భర్త)ను స్టేషన్‌కు పిలిపించాలి
ఇరువురి వివరణ శ్రద్ధగా వినాలి
వారికి ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇప్పించాలి
ఇలా మూడు సార్లు కౌన్సెలింగ్స్ ఇప్పించాలి
పరిస్థితి మారకుంటే కౌన్సెలర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే నిందితులను అరెస్టు చేయకూడదు
కేసు నమోదైనట్లు ముందుగా నోటీసులు జారీ చేయాలి
వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే వారం రోజులు గడువు ఇచ్చి మరో నోటీసు జారీ చేయాలి
ఇలా మూడు నోటీసులు జారీ చేసినా వారు స్టేషన్‌కు రాకుంటే అరెస్టు చేయాలి
అరెస్టు సమయంలో వారి ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకుని కోర్టుకు అప్పగించాలి
బాధితులు ఒత్తిడి చేస్తున్నారని, వారిని సంతృప్తి పర్చడానికి చట్టాన్ని అతిక్రమించకూడదు.
మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నిష్పక్షపాతంగా విచారణ చేపడతాం. అందుకు కావాల్సిన ఎస్‌ఓపీ విధానాన్ని తయారు చేశాం. వరకట్న కేసుల్లో దంపతులిద్దరి వాదనలు వింటాం. తమ సూచనలతో ఇద్దరూ సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టు తాజాగా నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటాం.
- మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్