
పోలీస్ శాఖ ప్రక్షాళనకు శ్రీకారం
పోలీసు స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు.
- ‘జపాన్’ విధానం అమలుకు నగర సీపీ కసరత్తు
- తొలివిడతగా అధికారులకు ప్రత్యేక శిక్షణ
- బాధితుల పట్ల మర్యాదగా ఉండాలని సీపీ మహేందర్‌రెడ్డి సూచన
సాక్షి, సిటీబ్యూరో: పోలీసు స్టేషన్ల నిర్వహణ, సిబ్బంది పనితీరులో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నగర పోలీసు కమిషనర్ కసరత్తు చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు, పోలీసు అధికారి కార్యాలయానికి ఎవరు వచ్చినా మర్యాదగా వ్యవహరించాలని, అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచాలని కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇక్కడ ‘జపాన్ కైజన్ టెక్నిక్’ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.
ఈ విధానం ద్వారా సిబ్బందితోపాటు అధికారుల్లో క్రమశిక్షణ అలవరుతుందని, కార్యాలయాల పనితీరులో మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం ప్రతి అధికారికి శిక్షణ ఇవ్వాలని కమిషనర్ నిర్ణయించారు. ఈ మేరకు తొలివిడతగా శుక్రవారం జీడిమెట్లలోని ‘ఉషా శ్రీరామ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్’లో అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో అదనపు పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితులకు అవసరమైన సహాయం చేయడం పోలీసు విధిగా భావించాలని, బాధితుడికి ఊర ట కలిగించేందుకు సిబ్బంది పనితీరులో మార్పులు రావాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి సూచించారు. స్టేషన్‌కు వచ్చే వారిని మర్యాదగా పలుకరించేందుకు రిసెప్షన్ వ్యవస్థను మరిత పటిష్టపరచనున్నారు. బాధితుడు కేసు పెట్టిన తరువాత ఆ కేసు పురోగతి కోసం స్టేషన్‌కు వస్తే వివరాలు అందుబాటులో ఉండేలా ఠాణాలను తీర్చిదిద్దాలన్నారు. స్టేషన్‌లో రికవరీ వాహనాలు, ఇతర సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వేయకుండా క్రమపద్ధతిలో పెట్టాలని సూచించారు.
లాకప్, రైటర్, రిసెప్షన్, ఎస్‌హెచ్‌ఓ, ఎస్‌ఐల గదులను శుభ్రంగా ఉంచుకోవాలని, కేసు రిజిస్టర్ చేయడం, పెండింగ్ వారెంట్లు, చార్జిషీట్ దాఖలు, పాత నేరస్తుల పట్టిక, రౌడీషీటర్ల జాబితా తదితర ఫైళ్లను క్రమపద్ధతిలో భద్రపరచాలన్నారు. స్టేషన్ నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున ఇస్తుందని, ఈ డబ్బు సరిపోనందున కనీసం నెలకు రూ.75 వేల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నియమించిన పోలీసు టాస్క్‌ఫోర్స్ కమిటీ అభిప్రాయపడిందని ఆయన గుర్తుచేశారు. తాను సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో అక్కడ ప్రవేశపెట్టిన కల్చర్ చేంజ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆశించిన విజయాలు సాధించినట్టు చెప్పారు.
కమిషనర్ ‘5-ఎస్’ సూత్రం..
ఎస్- సార్టింగ్ (కేసుల విభజన)
ఎస్- సిస్టమైజేషన్
(పకడ్బందీగా విధానాల అమలు)
ఎస్- షైనింగ్
(ముఖ్యమైన కేసుల తక్షణ గుర్తింపు)
ఎస్- స్టాండడైజేషన్ (అత్యున్నత
ప్రమాణాలు, పద్ధతులు పాటించడం)
ఎస్- సెల్ఫ్ డిసిప్లేన్
(వ్యక్తిగత క్రమశిక్షణ పాటించడం)