ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు గిరాకీ!! | Demand for forensic audit | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు గిరాకీ!!

Published Fri, Jan 26 2018 12:43 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM

Demand for forensic audit - Sakshi

న్యూఢిల్లీ: ఆడిట్‌ సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు ఏజెన్సీలకు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ రూపంలో ఇప్పుడు భారీ అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం ఇటీవలే ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌లో (ఐబీసీ) చేసిన సవరణలు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచాయి. ఈ చట్టం కింద కంపెనీలు తమ ఖాతాల్లోని మొండి బకాయిలను (ఎన్‌పీఏలు) పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ అంచనా ప్రకారం ఐబీసీ చట్టం కింద ఫోరెన్సిక్‌ ఆడిట్‌ వ్యాపారం గత మూడు నెలల్లోనే రెట్టింపయింది. ఇదింకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో భాగంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన, భారీగా బకాయిలున్న కంపెనీల ప్రమోటర్ల వ్యవహారాల పరిశీలన, ఆస్తుల సోదాలు, వాటికి రుణాలు అందజేసిన సంస్థల వివరాల ధ్రువీకరణ, నగదు ప్రవాహాలను శాస్త్రీయంగా పరిశీలించడం జరుగుతుంది. దివాలా కేసులకు సంబంధించి ఇప్పటికే పరిష్కార నిపుణులుగా సేవలందిస్తున్న పెద్ద ఆడిటింగ్‌ సంస్థలకు ఇప్పుడు ఐబీసీ చట్టం రూపంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి.

ప్రమోటర్ల గురించి ఆరా..
ప్రమోటర్లకు సంబంధించి వ్యక్తిగత వివరాల పరిశీలన, ఇతర వివరాల కోసం ఆరా తీయడం ఐబీసీ చట్టంలో సవరణల తర్వాత పెరిగిపోయింది. ప్రమోటర్లకు సంబంధించిన వ్యక్తులు కంపెనీలను తక్కువ విలువకు సొంతం చేసుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.

బిడ్డింగ్‌ వేసే వారు విదేశీ సంస్థలయినా లేదా సంబంధం లేని పరిశ్రమ నుంచి బిడ్డింగ్‌ వచ్చినా ఈ విధమైన ఆందోళనలు నిజం కావచ్చన్న వాదన ఉంది. ‘‘అధిక శాతం కేసుల్లో బిడ్లర్ల గత చరిత్ర, వారికి ఎవరితో సంబంధాలున్నాయో తనిఖీ చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు’’ అని క్రోల్‌ సంస్థ దక్షిణాసియా విభాగం హెడ్‌ రేష్మి ఖురానా తెలిపారు. బిడ్లర్ల నేపథ్యం, వారి ఉద్దేశం, వారికున్న వనరుల మూలాలు, గత చరిత్ర అన్నవి బిడ్డర్ల ఎంపికలో బ్యాంకులు చూసే కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు.


ఇలా అయితే కష్టం...
కొన్ని భారతీయ కంపెనీలు ఎన్నో సబ్సిడరీలు, అసోసియేట్‌ కంపెనీల ద్వారా ఒకదానిలో ఒకటి వాటాలతో క్లిష్టమైన నిర్మాణంతో పనిచేస్తున్నాయి. అలాగే, కొన్ని కంపెనీలు సంబంధిత పార్టీలు ఎవరన్నది వెల్లడించడం లేదు. వార్షిక నివేదికల్లో సైతం ఈ వివరాలు ఉండడం లేదు. దీంతో సంబంధిత పార్టీలు ఎవరన్నది గుర్తించడం కష్టం’’ అని ఈవై ఇండియాకు చెందిన ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్, డిస్ప్యూట్‌ సర్వీసెస్‌ పార్ట్‌నర్‌ విక్రం బబ్బర్‌ తెలిపారు.

కంపెనీలు, ప్రమోటర్ల నేపథ్యం గురించి తనిఖీలు జరిగిన గత సందర్భాల్లో భారీ మొత్తాల్లో షెల్‌ కంపెనీల ద్వారా నిధులు మాయం చేసిన ఘటనలు వెలుగు చూశాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో ఉత్తుత్తి కస్టమర్లు, అమ్మకందారులను సైతం ఫోరెన్సిక్‌ నిపుణులు గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘‘బ్యాంకులు, దివాలా పరిష్కార నిపుణులు కంపెనీల లావాదేవీలతో సంబంధం ఉన్న సంస్థల వివరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల ఆస్తుల స్వాధీనం, వాటి మళ్లింపు లేదా తస్కరించేందుకు ఆయా సంస్థలను ఉపయోగించితే తెలుస్తుంది‘‘ అని కేపీఎంజీ ఇండియా పార్ట్‌నర్‌ సువీర్‌ ఖన్నా వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement