Bankruptcy laws
-
ఐబీసీ రికవరీలు తగ్గుతున్నాయి
ముంబై: దివాలా చట్టాన్ని (ఐబీసీ) ప్రవేశపెట్టిన తర్వాత రుణాల చెల్లింపు సంస్కృతి కొంత మెరుగుపడినప్పటికీ, గత కొన్నేళ్లుగా రికవరీలు క్రమంగా తగ్గుతున్నాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. పైగా పరిష్కారానికి పట్టే సమయం పెరిగిపోతోందని ఒక నివేదికలో పేర్కొంది. ఐబీసీ ప్రవేశపెట్టాక గత ఏడేళ్ల పరిస్థితి చూస్తే 2019 మార్చిలో 43 శాతంగా ఉన్న రికవరీల రేటు 2023 సెప్టెంబర్ నాటికి 32 శాతానికి పడిపోయిందని వివరించింది. అదే సమయంలో పరిష్కార ప్రక్రియకు పట్టే సమయం సగటున 324 రోజుల నుంచి 653 రోజులకు పెరిగిందని పేర్కొంది. న్యాయస్థానాల్లో సిబ్బంది కొరత, డిఫాల్ట్‌లను గుర్తించడంలో జాప్యం మొదలైన సమస్యలు ఇందుకు కారణంగా ఉంటున్నాయని వివరించింది. సాధారణంగా ఐబీసీ కేసులు 330 రోజుల్లో పరిష్కారం కావాలి. గత ఏడేళ్లలో 808 కేసుల్లో చిక్కుకుపోయిన రూ. 3.16 లక్షల కోట్ల మొండిబాకీల సమస్య పరిష్కారానికి ఐబీసీ సహాయపడిందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మోహిత్ మఖీజా తెలిపారు. ఐబీసీతో రుణ గ్రహీతల ప్రవర్తనలో గణనీయంగా మార్పు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలు చేజారిపోతాయేమోనన్న భయాల కారణంగా ఐబీసీ వద్దకు రావడానికి ముందే రూ. 9 లక్షల కోట్ల పైచిలుకు మొండిబాకీల కేసులు పరిష్కారమైనట్లు మఖీజా చెప్పారు. ఐబీసీ ద్వారా గత ఏడేళ్లలో పరిష్కారమైన వాటితో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని ఆయన పేర్కొన్నారు. గత చట్టాల కింద రుణాల రికవరీ రేటు సగటున 5–20 శాతంగానే ఉండేదని, వాటితో పోలిస్తే ఐబీసీ కింద పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. -
దివాలా చట్టంలో కీలక సవరణలకు కేంద్రం కసరత్తు..!
న్యూఢిల్లీ: దివాలా చట్టంలో లొసుగులు సవరించిన లక్ష్యంగా కేంద్రం ముందడుగు వేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని నిపుణులు, సంబంధిత వర్గాలను కోరింది. ఇందుకు వచ్చే ఏడాది జనవరి 13 వరకూ గడువు విధించింది. వేగవంతమైన అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియ, రిజల్యూషన్ ప్లాన్ల ఆమోదం నిమిత్తం కాల వ్యవధి, అక్రమ లావాదేవీలు, తప్పుడు వ్యాపారం నివారణ వంటి అంశాలకు సవరణలు చేయాలని ఇప్పటికే ఇన్సాల్వెన్సీ లా కమిటీ(ఐఎల్సీ) సిఫారసు చేసింది. అంతేకాకుండా, స్వచ్ఛంద లిక్విడేషన్ ప్రక్రియ, ఐబీసీ ఫండ్ మూసివేయడానికి సంబంధించి సవరణల సూచనలూ ఉన్నాయి. 2016లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చింది. రిజల్యూషన్ ప్రణాళిక అమల్లో కంపెనీ ఆఫ్ క్రెడిటార్స్(సీఓసీ)ది కీలకపాత్ర. అయితే రుణాల్లో కూరుకుపోయి దివాల పక్రియలో ఉన్న కంపెనీ అమ్మకాలకు సంబంధించి రిజల్యూషన్ ప్రక్రియలో క్రెడిటార్స్ కమిటీ 95 శాతం వరకూ రాయితీ (హెయిర్‌కట్స్) ఇస్తుండడంపై ఇటీవల తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. తమకు రావాల్సిన బకాయిలకు సంబంధించి క్రెడిటార్ల సంఘం భారీ మాఫీలు జరిపి, రిజల్యూషన్ ప్రణాళికలను ఆమోదించడం తగదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐబీసీ దివాలా ప్రక్రియలో కీలకమైన కమిటీ ఆఫ్ క్రెడిటార్స్ (సీఓసీ)కి ఒక నియమావళిని జారీ చేసే పనిలో కేంద్రం ఉన్నట్లు కనబడుతోంది. జీఎస్టీ చట్టంపై కూడా.. జీఎస్టీ చట్టం, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లలో మార్పుల దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు పార్లమెంటరీ స్థాయీ సంఘం (ఆర్థికశాఖ) చైర్మన్ జయంత్‌సిన్హా తెలిపారు. దీనివల్ల కంపెనీలు డేటాను వినియోగించుకోవడం ద్వారా మరింత బలోపేతం, విస్తరించడానికి వీలుంటుందన్నారు. (చదవండి: మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా అదుర్స్!) -
దివాలా కోడ్ అమలుతో...కార్పొరేట్ ‘రుణ’ ఫ్యూడలిజానికి ముగింపు!
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ) అమలుతో కార్పొరేట్ రుణ గ్రహీతల ఫ్యూడలిజం రోజులు ముగిసిపోయినట్లయ్యిందని ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్ర్‌ప్సీ కోడ్ (ఐబీసీ) అమల్లోకి వచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇండస్ట్రీ సంస్థ– సీఐఐ ‘ఐదేళ్ల ఐబీసీ, 2016 : తదుపరి ముందడుగు’ అన్న అంశంపై నిర్వహించిన ఒక సదస్సులో సుబ్రమణ్యం మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ఐబీసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒత్తిడిలో, దివాలాలో ఉన్న ఆస్తులకు సంబంధించి మార్కెట్ ఆధారితమైన అలాగే నిర్దిష్ట కాల వ్యవధితో కూడిన రిజల్యూషన్ పక్రియ ప్రారంభమైంది. ఐబీసీ కింద దివాలా లేదా స్ట్రెస్ కంపెనీ ముందుకు వచ్చినట్లయితే, క్రెడిటార్ల కమిటీ (సీఓసీ) రం గంలోకి వచ్చేస్తుంది. కంపెనీ వ్యవహారాల నిర్వహణ రిజల్యూషన్ ప్రొఫెషనల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. రిజల్యూషన్ విజయవంతం కాకపోతే, కంపెనీ లిక్విడేషన్ పక్రియకు చేరుకుంటుంది. చదవండి : 3 రోజుల్లో రూ.5.76 లక్షల కోట్ల సంపద సృష్టి ఐబీసీకి ముందు కార్పొరేట్ రుణ గ్రహీతలు తమ నిర్ణయాలే అంతిమమని భావించేవారు. అంతా తాము చెప్పినట్లే జరగాలని, జరుగక తప్పదన్నది వారి అభిప్రాయంగా ఉండేది. అలాంటి రోజులు ప్రస్తుతం పూర్తిగా పోయాయి. మళ్లీ అలాంటి ఫ్యూడలిజం రోజులు వెనక్కు కూడా రాబోవు. ఫ్యూడలిజం ధోరణి ఎంతమాత్రం సరికాదు. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఫ్యూడలిజం ధోరణి దారుణమన్నది నా భావన. ఏ వ్యవస్థలోనైనా ధర్మం అనే భావన ముఖ్యం. ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా ఇది ఇమిడి ఉంటుంది. ఈ దిశలో అడుగులను ఐబీసీ వేగవంతం చేసింది. కేసుల సత్వర పరిష్కారం: రాజేష్ వర్మ సమావేశంలో కార్పొరేట్ వ్యవహారాల కార్యదర్శి రాజేష్ వర్మ మాట్లాడుతూ, ఈ ఏడాది జూలై నాటికి దివాలా చట్టం కింద ‘అడ్మీషన్’ స్థాయికి ముందే 17,837 కేసులు పరిష్కారమయినట్లు తెలిపారు. ఈ కేసుల విలువ దాదాపు రూ.5.5 లక్షల కోట్లని వెల్లడించారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత దివాలా వ్యవహారాలపై నెలకొన్న సానుకూల పరిస్థితిని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఒక్క ఏడాది జూలై వరకూ చూస్తే, 4,570 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ కింద అడ్మిట్ అయ్యాయని, వీటిలో 657 కేసులు అప్పీల్, రివ్యూ ఇతర కారణాలతో ముగిసిపోయాయని తెలిపారు. 466 కేసుల ఉపసంహరణ జరిగిందని పేర్కొన్నారు. 404 కేసుల ద్వారా విలువకు సంబంధించి రూ.2.5 లక్షల కోట్ల మేర పరిష్కారమయ్యాయని తెలిపారు. ఐబీసీకి ఆరు సవరణల ద్వారా వివిధ లొసుగులను తొలగించి దీనిని మరింత పటిష్టంగా మార్చడం జరిగిందని పేర్కొన్నారు. -
మొండిబాకీలపై 23లోగా ఆర్బీఐ కొత్త సర్క్యులర్
న్యూఢిల్లీ, ముంబై: మొండిబాకీలకు సంబంధించి సవరించిన సర్క్యులర్‌ను రిజర్వ్ బ్యాంక్ మే 23 లోగానే విడుదల చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ తుది దశలో ఉందని, ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేదీకి ముందే సర్క్యులర్ విడుదల కావొచ్చని పేర్కొన్నాయి. రూ. 2,000 కోట్లకు మించిన మొండిబాకీలపై ఆర్బీఐ గతంలో విడుదల చేసిన ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ సవరించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి వస్తోంది. అయితే, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికలకు సంబంధించిన నైతిక నియమావళి అడ్డంకిగా ఉండొచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. కానీ ఆర్బీఐ సర్క్యులర్‌కు ఇది సమస్య కాబోదని, మే 23 (ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే తేది) లోగానే సవరించిన సర్క్యులర్‌ను ప్రకటించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘నైతిక నియమావళి నుంచి ఆర్బీఐ పరపతి విధానానికి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ గానీ సవరించిన సర్క్యులర్ విడుదల చేస్తే దానిపై నియమావళి ప్రభావం ఉండబోదు‘ అని వివరించాయి. పాత సర్క్యులర్‌ను పూర్తిగా తిరగరాయకుండా.. కొంత మేర సవరించే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. మొండిబాకీ వర్గీకరణకు 90 రోజుల వ్యవధిని యథాతథంగా ఉంచినప్పటికీ.. దివాలా ప్రక్రియ ప్రారంభించేందుకు అదనంగా మరో 30–60 రోజులు సమయం ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీనితో రుణాల చెల్లింపునకు కొంత అదనపు సమయం దొరికితే చిన్న, మధ్య తరహా సంస్థలకు కాస్త ఊరట లభించవచ్చన్న అభిప్రాయం నెలకొంది. ఈ నెల తొలినాళ్లలో సుప్రీం కోర్టు మొండిబాకీలపై సర్క్యులర్‌ను కొట్టివేసింది. ఫలితంగానే ఆర్బీఐ కొత్తగా సవరించిన నిబంధనలు ప్రకటించాల్సి వస్తోంది. బ్యాంకులతో పాటు విద్యుత్ రంగ సంస్థలు మొదలైన పరిశ్రమ వర్గాలన్నింటి అభిప్రాయాలను సేకరించి ఆర్బీఐ వీటిని రూపొందిస్తోంది. -
ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.489.77 కోట్లు చెల్లించకుండా ఎగవేసినందుకు ఎన్సీఎల్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఆర్పీ) హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజుల వెంకట నర్సింహారావును నియమించింది. ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియకు సంబంధించి వెంటనే పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆర్పీని ఎన్సీఎల్టీ ఆదేశించింది. అలాగే ట్రాన్స్ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది. ఈ నెల 10 నుంచి దివాలా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మరటోరియం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదంది. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని ట్రాన్స్ట్రాయ్ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీఎల్టీ సభ్యులు రాతకొండ మురళీ మంగళవారం తీర్పునిచ్చారు. కెనరా బ్యాంకు నుంచి రూ.725 కోట్ల రుణం తీసుకున్న ట్రాన్స్ట్రాయ్ ఇండి యా లిమిటెడ్ రూ.489.77 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి వసూలు నిమిత్తం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ట్రాన్స్ట్రాయ్ దివాలా ప్రక్రియ కోసం కెనరా బ్యాంకు హైదరాబాద్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎస్‌సీఎల్‌టీ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపారు. బకాయిలు తీర్చే పరిస్థితిలో ట్రాన్స్ట్రాయ్ లేదు... ఈ సందర్భంగా కెనరా బ్యాంకు తరఫు న్యాయవాది దీపక్ భట్టాచార్జీ వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్ట్రాయ్ పలు బ్యాంకుల నుంచి రూ.3694.47 కోట్ల మేర రుణం తీసుకుందన్నారు. వివాదాలు పరిష్కారమైతే రూ.6803 కోట్ల కొత్త ప్రాజెక్టులు వస్తాయనడం ఎంత మాత్రం నమ్మశక్యం కాదన్నారు. అన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ట్రాన్స్ట్రాయ్ చెబుతోందని, అందులో నిజం ఉంటే, ఆ కంపెనీ లాభాలను ఆర్జించి ఉండేదని, అదే సమయంలో బకాయిలు కూడా తీర్చి ఉండేదని, అయితే అటువంటి పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.489 కోట్ల బకాయిని ఆర్బీఐ నిరర్థక ఆస్తిగా గుర్తించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.755 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఉపయోగించుకుందని తెలిపారు. అప్పుల కంటే ఆస్తులెక్కువున్నాయి... తరువాత ట్రాన్స్ట్రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.5788 కోట్ల పనుల్లో తమ కంపెనీ భాగస్వామిగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కింద 31.22 పనులను పూర్తి చేశామన్నారు. 2019 నాటికి రూ.3981 కోట్ల విలువైన పనులు పూర్తవుతాయని వివరించారు. అలాగే పలు ప్రాజెక్టుల్లో రూ.1530 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామన్నారు. అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువన్నారు. అలాగే రష్యా, చైనా కంపెనీల భాగస్వామ్యంతో పలు ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ట్రాన్స్ట్రాయ్ వాదనలను తోసిపుచ్చారు. ఆ కంపెనీ దివాలా ప్రక్రియకు ఆదేశాలిచ్చారు. -
దివాలా బిల్లుకు లోక్ సభ ఓకే
కాలం చెల్లిన డజను చట్టాల స్థానంలో పటిష్ట వ్యవస్థ ♦ దివాలా దరఖాస్తుకు 3 నెలలు;క్లెయిమ్‌కు 21 రోజులే సమయం ♦ దివాలా సమస్యల పరిష్కారానికి పట్టే సమయం ఇక ఏడాది ♦ ఉద్యోగుల తరవాతే కంపెనీ ఆస్తుల్లో మిగతా వారికి స్థానం ♦ విదేశాలతో ఒప్పందాల ద్వారా ఎగవేత దారుల ఆస్తుల స్వాధీనం ♦ పర్యవేక్షణకు ‘దివాలా బోర్డు’ న్యూఢిల్లీ: వందేళ్లకు పైగా మార్పులకు నోచుకోకుండా అమల్లో ఉన్న దివాలా చట్టాలు కనుమరుగు కానున్నాయి. వీటన్నిటి స్థానంలో అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న ‘దివాలా కోడ్-2016’కు గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే... ఇది చట్టరూపం దాలుస్తుంది. ప్రస్తుత బిల్లు ముఖ్యాంశాలివీ... ♦ప్రతిపాదిత చట్టం... వ్యక్తులు, కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్, పార్ట్నర్షిప్ సంస్థలకు వర్తిస్తుంది. ♦ ప్రమోటర్లు, రుణదాతల మధ్య సమస్య పరిష్కారానికి సంబంధించి సమతౌల్యం మెరుగుపడుతుంది. రుణ వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది. ♦ బ్యాంకు రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారికి విదేశాల్లో ఆస్తులుంటే... ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవటం ద్వారా వారి ఆస్తుల్ని జప్తు చేయటానికి ఈ చట్టం సహాయపడుతుంది. విజయ్‌మాల్యా వ్యవహారం నేపథ్యంలో సభ్యులు దీనికి సంబంధించి ప్రశ్నలడగ్గా... మంత్రి జయంత్ సిన్హా ఈ విషయం చెప్పారు. ♦ దివాలా అప్లికేషన్ దాఖలుకు గతంలో ఆరునెలల సమయం ఉంటే... ఇప్పుడు దీనిని మూడు నెలలకు కుదించారు. అటు తర్వాత క్లెయిమ్‌లకు 21రోజుల సమయం ఉంటుంది. ♦ దివాలా అంశాలను పరిశీలించడానికి, నష్టాల్లో ఉన్న కంపెనీలకు తగిన సలహాలు, సూచనలివ్వటానికి ఏర్పడే వ్యవస్థలు, ప్రత్యేక నిపుణుల నిర్వహణకు... ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఉద్దేశపూర్వక ఎగవేతలపై బోర్డ్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ♦ వ్యవస్థలో ఎటువంటి లొసుగులూ లేకుండా రుణ గ్రహీతల రుణాల వివరాలను ఎప్పటికప్పుడు రుణ దాతలకు చేరవేయడానికి ‘ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్’ ఏర్పాటవుతాయి. బోర్డ్ పరిధిలో ఇవి పనిచేస్తాయి. ♦ బిల్లులో అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. డీఆర్టీ, బ్రాంక్రప్సీ బోర్డ్ నుంచి అవి ప్రత్యక్షంగా ఆస్తులను పొందొచ్చు. దివాలా అంటే.. ఒక వ్యక్తి లేదా సంస్థ తాను తీసుకున్న అప్పులను తీర్చలేక చేతులెత్తేస్తే దివాలా తీయడంగా పేర్కొంటారు. ఆస్తులను మించి రుణ భారం పెరిగిపోయి... రుణదాతలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి వస్తే ఆ వ్యక్తి లేదా కంపెనీ ఈ సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించుకోడానికి కోర్టులను ఆశ్రయించొచ్చు. ప్రస్తుతం ఈ సమస్యల పరిష్కారం వ్యయ ప్రయాసలు, కాలహరణ అంశాలుగా తయారయ్యింది. సకాలంలో బాధితులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది. అందుకే కేంద్రం తాజా బిల్లు తీసుకొచ్చింది. డిసెంబర్లో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని పార్లమెంటు సంయుక్త కమిటీకి నివేదించింది. బిల్లులో పలు సవరణలతో కమిటీ గతవారం దీనిని తిరిగి సభ ముందు ఉంచింది. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ‘క్రాస్‌బోర్డర్ ఇన్సాల్వెన్సీ’ సమస్యల పరిష్కారం, దివాలా అప్లికేషన్ దాఖలు నుంచి క్లెయిమ్స్ ఫైలింగ్ వరకూ-- అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్, కోర్టుల్లో అప్పీళ్ల వంటి ఇన్సాల్వెన్సీ ప్రక్రియకు సంబంధించి ప్రతి అడుగులో నిర్దిష్ట కాల నిర్ణయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. బిల్లుకు సంబంధించి సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడారు. కార్మికుల ప్రయోజనాలకూ పెద్దపీట కార్మికుల ప్రయోజనాలకూ బిల్లు పెద్దపీట వేసింది. లిక్విడేషన్ ఎస్టేట్ అసెట్స్, ఎస్టేట్ ఆఫ్ ది బ్యాంక్రప్ట్ అంశాల నుంచి ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, గ్రాట్యూటీ ఫండ్‌ను వేరు చేయాలని పార్లమెంటరీ సంయుక్త కమిటీ సూచించింది. కంపెనీ ఆస్తుల లిక్విడేషన్ సందర్భాల్లో... గడచిన 24 నెలల్లో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. పారిశ్రామిక వర్గాల హర్షం..: దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశంలో వ్యాపార నిర్వహణ, రుణ బకాయిల సమస్య పరిష్కారం దిశలో ఇది కీలకమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. వ్యాపార ఇబ్బందుల పరిష్కారం దిశలో ఒక విప్లవాత్మక మార్పుగా దీనిని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభివర్ణించారు.