సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ దివాలా ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్ అనుమతినిచ్చింది. కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ.489.77 కోట్లు చెల్లించకుండా ఎగవేసినందుకు ఎన్‌సీఎల్‌టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా తాత్కాలిక దివాలా పరిష్కార నిపుణుడిగా (ఆర్‌పీ) హైదరాబాద్‌కు చెందిన గోవిందరాజుల వెంకట నర్సింహారావును నియమించింది. ట్రాన్స్‌ట్రాయ్ దివాలా ప్రక్రియకు సంబంధించి వెంటనే పత్రికా ప్రకటన జారీ చేయాలని ఆర్‌పీని ఎన్‌సీఎల్‌టీ ఆదేశించింది. అలాగే ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ ఆస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం (మారటోరియం) విధించింది. ఈ నెల 10 నుంచి దివాలా ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ మరటోరియం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ ఆస్తులపై న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేయడం, కోర్టు తీర్పులను అమలు చేయడం తదితరాలను చేయరాదంది. అంతేకాక ఆస్తులను విక్రయించడానికి గానీ, తాకట్టు పెట్టడానికి వీల్లేదని ట్రాన్స్‌ట్రాయ్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ సభ్యులు రాతకొండ మురళీ మంగళవారం తీర్పునిచ్చారు. కెనరా బ్యాంకు నుంచి రూ.725 కోట్ల రుణం తీసుకున్న ట్రాన్స్‌ట్రాయ్ ఇండి యా లిమిటెడ్ రూ.489.77 కోట్లు బకాయి పడింది. ఈ బకాయి వసూలు నిమిత్తం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ట్రాన్స్‌ట్రాయ్ దివాలా ప్రక్రియ కోసం కెనరా బ్యాంకు హైదరాబాద్ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎస్‌సీఎల్‌టీ సభ్యులు రాతకొండ మురళీ విచారణ జరిపారు.
బకాయిలు తీర్చే పరిస్థితిలో ట్రాన్స్‌ట్రాయ్ లేదు...
ఈ సందర్భంగా కెనరా బ్యాంకు తరఫు న్యాయవాది దీపక్ భట్టాచార్జీ వాదనలు వినిపిస్తూ, ట్రాన్స్‌ట్రాయ్ పలు బ్యాంకుల నుంచి రూ.3694.47 కోట్ల మేర రుణం తీసుకుందన్నారు. వివాదాలు పరిష్కారమైతే రూ.6803 కోట్ల కొత్త ప్రాజెక్టులు వస్తాయనడం ఎంత మాత్రం నమ్మశక్యం కాదన్నారు. అన్ని ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసినట్లు ట్రాన్స్‌ట్రాయ్ చెబుతోందని, అందులో నిజం ఉంటే, ఆ కంపెనీ లాభాలను ఆర్జించి ఉండేదని, అదే సమయంలో బకాయిలు కూడా తీర్చి ఉండేదని, అయితే అటువంటి పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రూ.489 కోట్ల బకాయిని ఆర్‌బీఐ నిరర్థక ఆస్తిగా గుర్తించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.755 కోట్ల బ్యాంకు గ్యారెంటీని ఉపయోగించుకుందని తెలిపారు.
అప్పుల కంటే ఆస్తులెక్కువున్నాయి...
తరువాత ట్రాన్స్‌ట్రాయ్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.రవి వాదనలు వినిపిస్తూ, ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.5788 కోట్ల పనుల్లో తమ కంపెనీ భాగస్వామిగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కింద 31.22 పనులను పూర్తి చేశామన్నారు. 2019 నాటికి రూ.3981 కోట్ల విలువైన పనులు పూర్తవుతాయని వివరించారు. అలాగే పలు ప్రాజెక్టుల్లో రూ.1530 కోట్ల మేర పెట్టుబడులు పెట్టామన్నారు. అప్పుల కంటే ఆస్తుల విలువ ఎక్కువన్నారు. అలాగే రష్యా, చైనా కంపెనీల భాగస్వామ్యంతో పలు ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రిబ్యునల్ సభ్యులు మురళీ ట్రాన్స్‌ట్రాయ్ వాదనలను తోసిపుచ్చారు. ఆ కంపెనీ దివాలా ప్రక్రియకు ఆదేశాలిచ్చారు.
ట్రాన్స్‌ట్రాయ్ దివాలా ప్రక్రియకు అనుమతి
Published Thu, Oct 11 2018 1:08 AM | Last Updated on Thu, Oct 11 2018 1:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment