దివాలా బిల్లుకు లోక్ సభ ఓకే
కాలం చెల్లిన డజను చట్టాల స్థానంలో పటిష్ట వ్యవస్థ
♦ దివాలా దరఖాస్తుకు 3 నెలలు;క్లెయిమ్‌కు 21 రోజులే సమయం
♦ దివాలా సమస్యల పరిష్కారానికి పట్టే సమయం ఇక ఏడాది
♦ ఉద్యోగుల తరవాతే కంపెనీ ఆస్తుల్లో మిగతా వారికి స్థానం
♦ విదేశాలతో ఒప్పందాల ద్వారా ఎగవేత దారుల ఆస్తుల స్వాధీనం
♦ పర్యవేక్షణకు ‘దివాలా బోర్డు’
న్యూఢిల్లీ: వందేళ్లకు పైగా మార్పులకు నోచుకోకుండా అమల్లో ఉన్న దివాలా చట్టాలు కనుమరుగు కానున్నాయి. వీటన్నిటి స్థానంలో అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తున్న ‘దివాలా కోడ్-2016’కు గురువారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రాజ్యసభ కూడా ఆమోదిస్తే... ఇది చట్టరూపం దాలుస్తుంది. ప్రస్తుత బిల్లు ముఖ్యాంశాలివీ...
♦ప్రతిపాదిత చట్టం... వ్యక్తులు, కంపెనీలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్, పార్ట్‌నర్‌షిప్ సంస్థలకు వర్తిస్తుంది.
♦ ప్రమోటర్లు, రుణదాతల మధ్య సమస్య పరిష్కారానికి సంబంధించి సమతౌల్యం మెరుగుపడుతుంది. రుణ వసూళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుంది.
♦ బ్యాంకు రుణాల్ని ఉద్దేశపూర్వకంగా ఎగవేసిన వారికి విదేశాల్లో ఆస్తులుంటే... ఆయా దేశాలతో ఒప్పందాలు చేసుకోవటం ద్వారా వారి ఆస్తుల్ని జప్తు చేయటానికి ఈ చట్టం సహాయపడుతుంది. విజయ్‌మాల్యా వ్యవహారం నేపథ్యంలో సభ్యులు దీనికి సంబంధించి ప్రశ్నలడగ్గా... మంత్రి జయంత్ సిన్హా ఈ విషయం చెప్పారు.
♦ దివాలా అప్లికేషన్ దాఖలుకు గతంలో ఆరునెలల సమయం ఉంటే... ఇప్పుడు దీనిని మూడు నెలలకు కుదించారు. అటు తర్వాత క్లెయిమ్‌లకు 21రోజుల సమయం ఉంటుంది.
♦ దివాలా అంశాలను పరిశీలించడానికి, నష్టాల్లో ఉన్న కంపెనీలకు తగిన సలహాలు, సూచనలివ్వటానికి ఏర్పడే వ్యవస్థలు, ప్రత్యేక నిపుణుల నిర్వహణకు... ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏర్పడుతుంది. ఉద్దేశపూర్వక ఎగవేతలపై బోర్డ్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది.
♦ వ్యవస్థలో ఎటువంటి లొసుగులూ లేకుండా రుణ గ్రహీతల రుణాల వివరాలను ఎప్పటికప్పుడు రుణ దాతలకు చేరవేయడానికి ‘ఇన్ఫర్మేషన్ యుటిలిటీస్’ ఏర్పాటవుతాయి. బోర్డ్ పరిధిలో ఇవి పనిచేస్తాయి.
♦ బిల్లులో అసెట్ రికన్‌స్ట్రక్షన్ కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. డీఆర్‌టీ, బ్రాంక్రప్సీ బోర్డ్ నుంచి అవి ప్రత్యక్షంగా ఆస్తులను పొందొచ్చు.
దివాలా అంటే..
ఒక వ్యక్తి లేదా సంస్థ తాను తీసుకున్న అప్పులను తీర్చలేక చేతులెత్తేస్తే దివాలా తీయడంగా పేర్కొంటారు. ఆస్తులను మించి రుణ భారం పెరిగిపోయి... రుణదాతలకు బకాయిలు చెల్లించలేని పరిస్థితి వస్తే ఆ వ్యక్తి లేదా కంపెనీ ఈ సమస్యను చట్ట పరిధిలో పరిష్కరించుకోడానికి కోర్టులను ఆశ్రయించొచ్చు. ప్రస్తుతం ఈ సమస్యల పరిష్కారం వ్యయ ప్రయాసలు, కాలహరణ అంశాలుగా తయారయ్యింది. సకాలంలో బాధితులకు న్యాయం జరగని పరిస్థితి నెలకొంది.
అందుకే కేంద్రం తాజా బిల్లు తీసుకొచ్చింది. డిసెంబర్‌లో బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. అనంతరం దీనిని పార్లమెంటు సంయుక్త కమిటీకి నివేదించింది. బిల్లులో పలు సవరణలతో కమిటీ గతవారం దీనిని తిరిగి సభ ముందు ఉంచింది. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ‘క్రాస్‌బోర్డర్ ఇన్‌సాల్వెన్సీ’ సమస్యల పరిష్కారం, దివాలా అప్లికేషన్ దాఖలు నుంచి క్లెయిమ్స్ ఫైలింగ్ వరకూ-- అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్, కోర్టుల్లో అప్పీళ్ల వంటి ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియకు సంబంధించి ప్రతి అడుగులో నిర్దిష్ట కాల నిర్ణయం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. బిల్లుకు సంబంధించి సభలో ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా మాట్లాడారు.
కార్మికుల ప్రయోజనాలకూ పెద్దపీట
కార్మికుల ప్రయోజనాలకూ బిల్లు పెద్దపీట వేసింది. లిక్విడేషన్ ఎస్టేట్ అసెట్స్, ఎస్టేట్ ఆఫ్ ది బ్యాంక్రప్ట్ అంశాల నుంచి ఉద్యోగులు, కార్మికులకు చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ఫండ్, గ్రాట్యూటీ ఫండ్‌ను వేరు చేయాలని పార్లమెంటరీ సంయుక్త కమిటీ సూచించింది. కంపెనీ ఆస్తుల లిక్విడేషన్ సందర్భాల్లో... గడచిన 24 నెలల్లో కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.
పారిశ్రామిక వర్గాల హర్షం..: దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం పట్ల పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశంలో వ్యాపార నిర్వహణ, రుణ బకాయిల సమస్య పరిష్కారం దిశలో ఇది కీలకమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ అన్నారు. వ్యాపార ఇబ్బందుల పరిష్కారం దిశలో ఒక విప్లవాత్మక మార్పుగా దీనిని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభివర్ణించారు.