కీలక బిల్లుపై చర్చలో పాల్గొనని ప్రధాన ప్రతిపక్షం
స్వాగతించిన ఎంఐఎం, సీపీఐ, బీజేపీ
రెవెన్యూ మంత్రిని అభినందించిన మంత్రులు, సభ్యులు
తన జన్మ ధన్యమైందన్న మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూ భారతి (రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) బిల్లు–2024కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈనెల 18వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై శుక్రవారం సభలో చర్చ జరిగిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
ఈ బిల్లుపై చర్చలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పాలు పంచుకోలేదు. ఈ–ఫార్ములా రేసింగ్ అంశాన్ని సభలో చర్చించాలని శుక్రవారం మొత్తం సభలో పట్టుపట్టిన బీఆర్‌ఎస్ కీలకమైన ఈ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొనలేదు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి బిల్లును ఇతర పక్షాలైన బీజేపీ, ఎంఐఎం, సీపీఐలు స్వాగతిస్తూనే కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. అయితే, ఈ సవరణలను పరిగణనలోకి తీసుకోకుండానే బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు.
ఆనంద భాష్పాలొస్తున్నాయి..
భూ భారతి బిల్లును అసెంబ్లీ ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు ప్రకటించారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జూపల్లి కృష్ణారావులతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలసి అభినందించారు. అంతకుముందు చర్చకు ముగింపుగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం నుంచి కీలకమైన ఆర్‌వోఆర్ చట్టం ప్రవేశపెట్టిన మూడో మంత్రిగా ఈ బిల్లు సభ ఆమోదం పొందినందుకు తన జన్మ ధన్యమైందని, ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు.
వాస్తవానికి, ఈ బిల్లును మంత్రి పొంగులేటి పట్టుపట్టి మరీ ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదింపజేశారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి స్పీకర్ అనుమతి మేరకు సభలో ప్రవేశపెట్టించిæ శీతాకాల సమావేశాల్లోనే కొత్త ఆర్‌వోఆర్ చట్టం తీసుకురావాలన్న తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆఫీసర్స్ గ్యాలరీలో ఉన్న రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, సీసీఎల్‌ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి. లచ్చిరెడ్డిలను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించారు.
స్పీకర్‌కు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేల ధన్యవాదాలు
అసెంబ్లీలో భూభారతి బిల్లుకు సభ ఆమోదం లభించిన అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు. స్పీకర్ చాంబర్‌లో ప్రసాద్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. రాష్ట్ర రైతాంగం, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా దీనిని ప్రత్యేక శ్రద్ధతో రూపొందించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment