టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య బిగుస్తున్న పీటముడి
విజయవాడ వెస్ట్‌లో భగ్గుమన్న విభేదాలు
బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరిని తెరపైకి తెచ్చిన చంద్రబాబు
ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధపడ్డ పోతిన మహేష్
అవనిగడ్డలోనూ తేలని పంచాయితీ
బుద్ధప్రసాద్‌కి టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ పొత్తుల కల్లోలం కుదిపేస్తోంది. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ వెస్ట్, అటు కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గాల్లో వర్గ విభేదాల తుపాను అతలాకుతలం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన పది రోజుల తరువాత కూడా ఇప్పటికీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ పార్టీలు పోటీ చేస్తాయి? ఆ పార్టీల తరఫున అభ్యర్థులు ఎవరన్నది స్పష్టం కాకపోవడంతో టీడీపీ కూటమి గందరగోళంలో పడింది. ఇదే అదనుగా ఆ మూడు పార్టీల నేతలు తమ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అల్టిమేటం జారీ చేస్తున్నారు.
బాబు స్కెచ్..
పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లుగా తొలుత చెప్పారు. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తానే అభ్యర్థినంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ ఆయనకు బీజేపీ షాక్ ఇచ్చింది. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తమకే కేటాయించాలని పట్టుబట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించడానికి సుముఖత చూపారు. మరోవైపు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తర్జన భర్జనలు సాగాయి. వైశ్య సామాజిక వర్గం నుంచి వక్కల గడ్డ భాస్కరరావు, బీసీ నగరాలు సామాజికవర్గం నుంచి అట్లూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాం టికెట్ల రేసులో ఉన్నామంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు.
ఇంతలో చంద్రబాబు మరోసారి తన పాచిక వేశారు. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలని పావులు కదిపారు. సుజనా చౌదరి పోటీ చేస్తే, టీడీపీలో పోటీ చేసినట్లుగానే భావించాల్సింటుంది. ఈ పరిణామాలపై మొదటి నుంచి బీజేపీలో కొనసాగుతున్న నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కమ్మ సామాజిక నేతలు సుజనా చౌదరి పోటీ చేస్తే ఓటమి ఖాయమని తేల్చి చెబుతున్నారు. బీజేపీలో టికెట్ల లొల్లి ఇలా కొనసాగుతుండగా, మరోవైపు జనసేన నేత పోతిన మహేష్ తనకు టికెట్ కేటాయించకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తేల్చి చెప్పడంతో విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో కూటమి పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.
అవనిగడ్డలో అయోమయం..
మరోవైపు కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూడా పొత్తుల పంచాయితీ తెగలేదు. అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించారు. అయితే ఆ పార్టీ తరఫున ఎవరు పోటీచేస్తారనే దానిపై స్పష్టత కొరవడింది. ఇటీవల జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి, జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, కాంట్రాక్టర్ వికృతి శ్రీను, టికెట్ కోసం పోటీ పడుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ పార్టీలో అయోమయం నెలకొంది.
మరోవైపు కొత్తగా పార్టీలో చేరబోయే నేతకు అవనిగడ్డ నియోజక వర్గాన్ని కేటాయిస్తారనే ప్రచారం ఊపందుకొంది. ఇదిలా ఉండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ తాజాగా పార్టీపై ధ్వజం ఎత్తారు. అవనిగడ్డ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తే సహించేది లేదని ఆయన వర్గీయులు స్పష్టం చేశారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారని కూడా తేల్చి చెప్పారు. ఈ పరిణామాలతో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన, టీడీపీల మధ్య పీటముడి మరింత బిగుసుకుంది. ఈ పరిణామాలతో ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి కుదేలు కావడం ఖాయమన్నది తేలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment