విజయవాడ పశ్చిమంలో డబ్బులు వెదజల్లుతూ కూటమి అభ్యర్థుల పర్యటన
హారతి ఇస్తే రూ.వెయ్యి, కొబ్బరికాయలు కొడితే రూ. వెయ్యి
ప్రచారం తొలిరోజే తాయిలాలకు తెరతీసిన సుజనా చౌదరి, కేశినేని చిన్ని
గాందీనగర్ (విజయవాడసెంట్రల్): టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల తాయిలాలకు తెరతీశారు. ఇందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. హారతి పట్టు, వెయ్యి కొట్టు అన్న చందంగా తొలిరోజు వీరి ప్రచారం సాగింది. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానిపురంలోని 40, 41 డివిజన్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ పర్యటనలో మహిళలు హారతులు పట్టి, కొబ్బరికాయలు కొట్టారు.
హారతి పళ్లానికి రూ.వెయ్యి, టెంకాయ కొట్టినందుకు రూ. వెయ్యి చొప్పున సుజనా చౌదరి, కేశినేని చిన్ని మహిళలకు తాయిలాలు అందజేశారు. ప్రచారంలో మహిళలు వరుసగా నిలబడడం అభ్యర్థులకు హారతులు పట్టడం తంతుగా మారింది. హారతులు పట్టిస్తూ కొబ్బరి కాయలు కొట్టిస్తూ అభ్యర్థులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థుల ప్రచారం కాస్ట్‌లీగా మార్చేశారు. తొలిరోజే ఇలా ఉంటే ఎన్నికల వరకు ఇంకెంత విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తారో.. ఇంకెన్ని వినూత్న మార్గాలు ఎంచుకుని డబ్బులు పంచుతారో అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది.
ఒక సామాన్యుడిపై బీజేపీ తరపున ఎన్నికల బరిలో దిగిన సుజానా చౌదరి ప్రచారం ప్రారంభం రోజే డబ్బులు వెదజల్లడం చూసి ఈ ఎన్నికలు పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధమేనని పలువురు చర్చించుకుంటున్నారు. హారతి పట్టించుకుంటూ పళ్లంలో రూ. వెయ్యి చొప్పున వేస్తూ సుజనా చౌదరి కోడ్ ఉల్లంఘించారు.
అనర్హులుగా ప్రకటించాలి
పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసిన తెలుగుదేశం విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని), విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిలను పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్‌కుమార్ ఓ ప్రకటనలో ఎన్నికల సంఘాన్ని కోరారు.
భవానిపురం ప్రాంతంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు హారతుల పేరుతో డబ్బులు వేసి ఆశ చూపారన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment