న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్‌లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.
ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్‌ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్‌ఇన్‌లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే.
పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్‌గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్‌లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment