vehicle repairs
-
గోమెకానిక్ ఖాతాల్లో గోల్మాల్
న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్ఇన్లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే. పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్‌గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్‌లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
ఇక ‘పిట్ స్టాప్’ ఉచిత మరమ్మతు సేవలు
బెంగళూరు: కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడికక్కడే ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో డెలివరీ సిబ్బంది, అగ్నిమాపక, పోలీస్, అంబులెన్స్, వైద్యులు, వైద్య సిబ్బంది వంటి అత్యవసర విభాగాల్లో పనిచేసే వ్యక్తులు ఉపయోగించే వాహనాలు మధ్యలో ఆగిపోతే వారికి ఉచిత మరమ్మతు సేవలందించేందుకు గాను పిట్ స్టాప్ అనే సంస్థ ముందుకొచ్చింది. పిట్ స్టాప్ ఉచిత మరమ్మతు సేవల్ని పొందేందుకు గాను 626262 1234 నంబర్‌కు ఫోన్ గానీ, లేదా www.getpitstop.comను గానీ సంప్రదించవచ్చు. సమాచారం అందుకున్న పిట్ స్టాప్ సిబ్బంది తమ సంచార వాహనంతో వచ్చి సదరు వాహనాన్ని రిపేరు చేసి వెళ్లిపోతుందని సంస్థ ప్రతినిధులు శనివారం మీడియాకు తెలిపారు. ఈ సేవలు బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణె, హైదరాబాద్, చెన్నై, నోయిడా, గుర్గావ్, ఫరీదాబాద్ లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ వివరించింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో పనిచేస్తున్న వారందరికీ పిట్ స్టాప్ సంస్థ తరఫున సీఈవో మిహిర్ మోహన్ సెల్యూట్ చేసి అభినందించారు. -
మరమ్మతుల పేరుతో దోపిడీ
కార్పొరేషన్లో వాహనాల బాగోతం కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై వాటాల పంపిణీ నెల్లూరు సిటీ: నెల్లూరు నగరపాలక సంస్థలో అడుగడుగునా దోపిడీ జరుగుతోంది. ప్రతి విభాగంలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారి వరకు కమీషన్ల రూపేణా దోచుకుంటున్నారు. చెత్తను తరలించే వాహనాల మరమ్మతుల పేరుతో ప్రతి నెలా రూ.లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేషన్ చెందిన సొంత వాహనాలు 83 ఉన్నాయి. వీటిలో 20 లారీలు, 54 ఆటోలు, 4 ట్రాక్టర్లు, 5 డంపర్లు ఉన్నాయి. వీటిలో కేవలం 60 వాహనాలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో చెత్తను సేకరించి దొంతాలి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తుంటారు. అయితే నిత్యం చెత్తవాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి. కేవలం మరమ్మతులకే ఏడాదికి రూ.50 లక్షలపైన ఖర్చు చేస్తుండటం గమనార్హం. పాత వాహనాలే వినియోగం నెల్లూరు మున్సిపాలిటీగా ఉన్న సమయం నుంచి వినియోగిస్తున్న వాహనాలనే ప్రస్తుతం అధికారులు నెట్టుకొస్తున్నారు. ఏ క్షణం ఎక్కడ వాహనం నిలిచిపోతుందో అర్థకాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వాహనాలకు బ్రేకులు పడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగిన ఘటనలూ ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం ఉన్న వాహనాలతోనే చెత్తను తరలిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనాల్లో 90 శాతం కాలం చెల్లినవే ఉన్నాయి. కార్పొరేషన్ వాహనాలు కావడంతో రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. దోపిడీ.. వాహనాలు నిత్యం మరమ్మతులకు గురికావడంతో కార్పొరేషన్ నిధుల నుంచి ప్రతి నెలా లక్షలను ఖర్చుచేయాల్సి వస్తోంది. వాహనాల రిపేర్లు, స్పేర్‌పార్ట్స్‌ను తీసుకొచ్చే పనులను కాంట్రాక్టర్ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో స్పేర్‌పార్ట్స్ ధర రూ.వెయ్యి కాగా రూ.రెండు వేలుగా ఎస్టిమేషన్ వేసి దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. రిపేర్లు చేస్తున్నట్లు రూ.వేల కార్పొరేషన్ నిధులను కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లు డీఈ, ఏఈ స్థాయిలో అధికారులకు పర్సంటేజీలను ప్రతి నెలా ఇస్తుండాలి. ఇవి రాకపోతే బిల్లులు మంజూరు చేయకుండా జాప్యం చేస్తుంటారు. కొత్త వాహనాల కొనుగోలుపై దృష్టేదీ..? ఏళ్ల నాటి వాహనాలను వినియోగిస్తున్న కార్పొరేషన్‌కు కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా పాలకవర్గం చోద్యం చూస్తోంది. ప్రస్తుతం ప్రతి నెలా ఖర్చు పెట్టే నిధుల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేస్తే కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుంది. అధికార పార్టీ చెందిన ఓ నాయకుడు మరమ్మతులు చేసే కాంట్రాక్టర్ వద్ద ప్రతి నెలా పర్సంటేజీలను తీసుకుంటున్నారని సమాచారం.