Auditor
-
వడ్డీ కాసులవాడా... గోవిందా..!
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు. ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు. కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట. నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
ఆడిటర్ వెంకటేశ్వర్లు కీలక పాత్ర...సంచలన నిజాలు బయటపెట్టిన ఏఏజీ పొన్నవోలు..!
-
అదానీ పోర్ట్స్ నుంచి నిష్క్రమణ యోచనలో డెలాయిట్
న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ యోచిస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డెలాయిట్ తప్పుకోవడానికి కారణమేంటనేది నిర్దిష్టంగా వెల్లడి కాలేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో ప్రస్తావించిన నిర్దిష్ట లావాదేవీలపై డెలాయిట్ కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022–23 ఆర్థిక ఫలితాల నివేదికలో మూడు సంస్థలతో లావాదేవీల గురించి డెలాయిట్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతర్గతంగా ఖాతాల మదింపు చేయడం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ విచారణ చేస్తుండటం వంటి అంశాల కారణంగా హిండెన్‌బర్గ్ ఆరోపణల విషయంలో బైటి ఆడిటర్‌తో పరీక్ష చేయించడం అవసరమని అదానీ గ్రూప్ భావించలేదని పేర్కొంది. బైటి ఏజెన్సీ ద్వారా మదింపు జరగకపోవడం, సెబీ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం వల్ల కంపెనీ అన్ని నిబంధనలనూ పాటిస్తోందా లేదా అనేది తాము ధృవీకరించే పరిస్థితి లేదని తెలిపింది. -
విశాఖ కిడ్నాప్ కథ సుఖాంతం.. పోలీసుల అదుపులో నలుగురు దుండగులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు సురక్షితంగా ఉన్నారు. కాగా ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావుతోపాటు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుని దుండగులు కిడ్నాప్ చేశారు. ముగ్గురిని అపహరించి రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. అయితే కిడ్నాప్ జరిగిన కొద్ది గంటల్లోనే కేసును పోలీసులు చేధించారు. నలుగురు దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్గా పోలీసులు గుర్తించారు. 17 బృందాలను ఏర్పాటు చేసి కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. కాగా గన్నమనేని గతంలో వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈస్ట్ గోదావరి జిల్లా గోపాలపురం వైఎస్సార్సీపీ పరిశీలకులుగా బధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగేఓ ఎంపీ వద్ద ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. -
అదానీ టోటల్ గ్యాస్‌కు ఆడిటర్ రాజీనామా.. కానీ..!
న్యూఢిల్లీ: అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ ఆడిటర్ సేవల నుంచి ‘షా దందారియా’ అనూహ్యంగా తప్పుకుంది. ఇతర బాధ్యతల కారణంగా స్టాట్యుటరీ ఆడిటర్ బాధ్యతలకు షా దందారియా అండ్ కో రాజీనామా సమర్పించినట్టు అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరి 24న నివేదిక విడుదల చేయగా, అందులో షా దందారియా పేరు కూడా ఉండడం గమనార్హం. అదానీ గ్రూపులో పెద్ద కంపెనీల ఖాతాలను, పెద్దగా అనుభవం లేని ఓ చిన్న ఆడిటింగ్ సంస్థ సేవలు అందించడాన్ని హిండెన్‌బర్గ్ సంస్థ ప్రశ్నించింది. హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. ఈ తరుణంలో అదానీ గ్రూపు కంపెనీకి ఆడిటర్‌గా షా దందారియా తప్పుకోవడం యాధృచ్చికం. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న చిన్న చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థయే షా దందారియా. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు సైతం ఈ సంస్థ ఆడిటింగ్ సేవలు అందిస్తోంది. అయితే, ఒక్క అదానీ టోటల్ గ్యాస్ ఆడిటింగ్ సేవలకే ప్రస్తుతం రాజీనామా సమర్పించింది. ముందుగా ఒప్పుకున్న ఇతర బాధ్యతలు మినహా, తమ రాజీనామాకు మరే ఇతర కారణం లేదని షా దందారియా స్పష్టం చేసింది. -
మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం
విజయవాడ: మార్గదర్శిలో అక్రమాలపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శిలో ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.మార్గదర్శి చిట్ ఫండ్ లో నిధుల మల్లింపు, అక్రమ డిపాజిట్ల సేకరణ నేపథ్యంలో ప్రత్యేక ఆడిటర్ నియామకం చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. మార్గదర్శి చిట్‌ఫండ్ 37 బ్రాంచ్‌లలో ఆడిటింగ్ నిర్వహించేందుకు సిద్ధమైన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ దానిలో భాగంగా ప్రత్యేక ఆడిటర్ నియమించింది. కాగా, మార్గదర్శి అక్రమాల కేసులో ఏపీ సీఐడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. సీఐడీ విచారణలో మార్గదర్శి అక్రమాలు బయటపడ్డాయి. మార్గదర్శిలో నిధుల మళ్లింపు, చట్ట వ్యతిరేక స్కీముల నిర్వహణ. సబ్స్క్రిప్షన్ నిధులు చెల్లించకపోవడాన్ని సీఐడీ గుర్తించింది. వడ్డీలిస్తామని డిపాజిట్లు సేకరించడం, అక్రమంగా నిధుల మళ్లింపులను బయట్టపెట్టింది. దీంతో, మార్గదర్శి అక్రమాలపై ఈడీకి సీఐడీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. -
పిళ్లైను మేం బెదిరించలేదు: ఈడీ
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేదీన తమ ముందు హాజరు కావాలని అందులో ఆదేశించింది ఈడీ. కవిత బినామీగా పేర్కొన్న అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిపి బుచ్చిబాబును విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో.. ఢిల్లీ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో సోమవారం ఈడీ ఇవాళ అరుణ్ రామచంద్ర పిళ్లైను హాజరుపర్చి.. కీలక వాదనలు వినిపించింది. తన వాంగ్మూలం ఉపసంహరించుకునేందుకు ఆయన స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. ‘‘చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయి. విచారణ సమయంలో పిళ్లైను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదు. టార్చర్ కూడా చేయలేదు’’ అని కోర్టును తెలిపింది ఈడీ. పిళ్లై 2022, సెప్టెంబరు 18వ తేదీన పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారు?. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారు?. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థమవుతోంది. ఒక బలమైన వ్యక్తిని మేము సమ్మన్ చేసినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారు’’ అని ఈడీ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో.. సాయంత్రం 4 గంటలకు తీర్పును వాయిదా వేసింది కోర్టు. అంతేకాదు.. బుచ్చిబాబుతో కలిపి పిళ్లైని మరోసారి విచారించాలని కోర్టుకు కోరుతూ.. మరో మూడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరుతోంది. ‘‘కస్టడీ మరో మూడు రోజులు పొడిగించండి. ఇతర నిందితులతో కలిపి విచారణ చేయాలి. మరి కొంతమందికి సమన్లు ఇవ్వాల్సి ఉంది. రామచంద్ర పిళ్లై కస్టడీ అవసరం’ అని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టుకు విన్నవించారు. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ అయిన గోరంట్ల బుచ్చిబాబును ఫిబ్రవరి 8వ తేదీన సీబీఐ అరెస్ట్ చేయగా.. మార్చి 6వ తేదీన బెయిల్ మీద బయటకు వచ్చారు. -
గోమెకానిక్ ఖాతాల్లో గోల్మాల్
న్యూఢిల్లీ: వాహనాల రిపేర్ సేవలు అందించే స్టార్టప్ సంస్థ గోమెకానిక్ ఆర్థిక అవకతవకల వివాదంలో చిక్కుకుంది. ఈ వ్యవహారాన్ని స్వయంగా అంగీకరించిన కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. సంస్థ ఖాతాలను ఫోరెన్సిక్ ఆడిట్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాన్ని కూడా పునర్వ్యవస్థీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా సుమారు 70 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపారు. గోమెకానిక్లో దాదాపు 1,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు కోల్పోగా మిగిలిన సిబ్బందిని జీతాలు లేకుండా మూడు నెలల పాటు పని చేయాలంటూ కంపెనీ కోరినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ గోమెకానిక్ను మరింత వృద్ధిలోకి తేవాలనే యావలో పడి వ్యవస్థాపకులు నియంత్రణ తప్పి వ్యవహరించారని, తప్పిదాలు చేశారని లింక్డ్ఇన్లో రాసిన పోస్టులో భాసిన్ పేర్కొన్నారు. దీనికి తాము తీవ్రంగా చింతిస్తున్నామని ఆయన తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితికి పూర్తి బాధ్యత మాదే. పెట్టుబడులను సమకూర్చుకునేలా పరిష్కార మార్గాలను అన్వేషించుకుంటూ వ్యాపారాన్ని పునర్వ్యవస్థీకరించాలని అంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నాం‘ అని భాసిన్ చెప్పారు. రూ. 120 కోట్ల పైగా రుణభారం ఉండగా, అందులో మూడో వంతు రుణాన్ని సత్వరం తిరిగి చెల్లించాల్సిన నేపథ్యంలో గోమెకానిక్ మనుగడ సాగించాలంటే నిధులను తప్పనిసరిగా సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, ఆదాయాలను అధికంగా చూపడమే కాకుండా వ్యవస్థాపకులు కావాలనే వాస్తవాలను దాచిపెట్టారని ప్రధాన ఇన్వెస్టర్లు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. ఈ అవకతవకలపై విచారణ జరిపేందుకు థర్డ్ పార్టీని ఎంపిక చేసినట్లు వివరించారు. కార్ల యజమానులను వారి ప్రాంతంలోని మెకానిక్ షాపులకు అనుసంధానించే స్టార్టప్‌గా గోమెకానిక్ 2016లో ప్రారంభమైంది. కుశాల్ కర్వా, నితిన్ రాణా, రిషభ్ కర్వా, భాసిన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. సెకోయా క్యాపిటల్, టైగర్ గ్లోబల్ వంటి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. గోమెకానిక్ 2021 జూన్‌లో 42 మిలియన్ డాలర్లు సమీకరించింది. -
శ్రేయీ గ్రూప్ లావాదేవీల మోసం
న్యూఢిల్లీ: మొత్తం రూ. 3,025 కోట్ల మోసపూరిత లావాదేవీలపై పాలనాధికారికి ట్రాన్సాక్షన్ ఆడిటర్ నుంచి నివేదిక అందినట్లు ప్రయివేట్ రంగ కంపెనీ శ్రేయీ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ తాజాగా పేర్కొంది. ఇది 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాలలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన నివేదికగా వెల్లడించింది. సంక్షోభంలో చిక్కుకున్న శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, శ్రేఈ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ బోర్డులను గతేడాది అక్టోబర్‌లో రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఆపై బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ సీజీఎం రజనీష్ శర్మను శ్రేయీ గ్రూప్ కంపెనీలకు పాలనాధికారిగా నియమించింది. తదుపరి పాలనాధికారికి సహకరించేందుకు ముగ్గురు సభ్యుల సలహాదారుల కమిటీని నియమించింది. శ్రేయీ గ్రూప్ కంపెనీలు ప్రస్తుతం కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
ఇంట్లో భోజనం చేస్తుండగా బైకుపై వచ్చి.. భార్య కళ్లముందే..
తిరువొత్తియూరు(చెన్నై): తంజై జిల్లాలో ఆడిటర్‌ను హత్య చేసిన నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తంజై కరంద చేరవై కారన్ వీధికి చెందిన మహేశ్వరన్ (55) ఆడిటర్. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకె 5వ వార్డు ప్రతినిధి రుక్మిణితో విరోధం ఉంది. ఈక్రమంలో మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో మహేశ్వరన్ ఇంట్లో భోజనం చేస్తున్న సమయంలో బైకులో వచ్చిన రుక్మిణి కుమారుడు కార్తీక్‌తో సహా నలుగురు కత్తులతో అతని భార్య కళ్లముందే దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో మహేశ్వరన్ అదే చోట మృతి చెందాడు. తంజై వెస్ట్ పోలీసులు మృతదేహాన్ని తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో.. శిశువును విక్రయించిన వృద్ధురాలి అరెస్టు తిరువొత్తియూరు: మదురై సమీపంలో చిన్నారిని విక్రయించిన వృద్ధురాలిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మదురై మేలూర్ కోటై నత్తం పట్టికి చెందిన ఓ వివాహితకు శివగంగై జిల్లా కల్లల్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె గర్భం దా ల్చింది. ఈమె భర్త విదేశాలలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు గత వారం క్రితం మగబిడ్డ జన్మించింది. ఈ బిడ్డను వృద్ధురాలికి ఇచ్చి పెంచమని చెప్పినట్లు తెలిసింది. కానీ వృద్ధురాలు ఆ బిడ్డను విక్రయించారు. ఈ సంగతి తెలుసుకున్న వివాహిత ఆ వృద్ధురాలి వద్దకు వెళ్లి బిడ్డ ఎక్కడని ప్రశ్నించింది. ఆమె సమాధానం చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వృద్ధురాలి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: ఆమెకు 20, అతడికి 17.. బాలుడిని ఇంటికి పిలిచి.. -
శ్రేయీ ఇన్‌ఫ్రాకి షాక్ ఇచ్చిన ఆర్బీఐ
ముంబై: ఊహించని విధం గా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దేశంలోనే పేరెన్నికగన్న చార్టర్డ్ అకౌం టెంట్ సంస్థలలో ఒకటైన హరిభక్తి అండ్ కో ఎల్ ఎల్పీపై రెండేళ్ల నిషేధాన్ని విధించింది. 2022 ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమల్లోకిరానుంది. దీంతో నియంత్రణ సంస్థల పరిధిలోకి వచ్చే ఏ కంపెనీ తరఫునా ఆడిట్ అసైన్మెంట్లను చేపట్టేందుకు వీలుండదు. అయితే ఈ ఆర్థిక సంవ త్సరానికి(2021–22) ఆడిట్ అసైన్మెంట్లను పూర్తి చేయడంలో కంపెనీపై ఎలాంటి ప్రభావమూ ఉండదని ఆర్బీఐ పేర్కొంది. శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్‌ఐఎఫ్‌ఎల్)కు హరిభక్తి అండ్ కో ఆడిటర్‌గా వ్యవహరిస్తోంది. గత వారం ఎస్‌ఐఎఫ్‌ఎల్ బోర్డును రద్దు చేయడంతోపాటు దివాలా చట్ట చర్యలకు ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా నిషేధాజ్ఞలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యవస్థాగతంగా ప్రాధాన్యత కలిగిన ఎన్‌బీఎఫ్‌సీల చట్టబద్ధ ఆడిట్ నిర్వహణలో ఆర్బీఐ నిబంధనలను పాటించకపోవడంతో నిషేధాన్ని విధించినట్లు కేంద్ర బ్యాంకు పేర్కొంది. ఇంతక్రితం 2019లో గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ ఈవై కు అనుబంధ సంస్థ ఎస్ఆర్ బట్లిబాయ్ అండ్ కోపై ఆర్బీఐ ఏడాది కాలపు నిషేధాన్ని విధించింది. కాగా.. శ్రేయీ గ్రూప్ కంపెనీలలో కొన్ని కేసులకు సంబంధించి మొండిబకాయిలు(ఎన్పీఏలు)గా మారిన ఖాతాలను ఓవైపు మూసివేస్తూ.. మరోపక్క మారుపేర్లతో సరికొత్తగా రుణాలు మంజూరు చేయడం వంటి అవకతవకలు నమోదైనట్లు తెలుస్తోంది. చదవండి :టెల్కోలకు బ్యాంక్ గ్యారంటీ నిబంధన ఎత్తివేత -
బేగంపేటలో కిడ్నాప్ కలకలం.. సొంత ఊరికి వచ్చాను!
∙సాక్షి, సనత్‌నగర్: బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టింంది. ఆడిటర్ కిడ్నాప్‌కు గురయ్యాడని పోలీసులకు అందిన ఫిర్యాదు వారిని హైరానా పెట్టింది. చివరకు క్షేమంగా ఉన్నట్లు వీడియో కాల్ ద్వారా తెలపడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండకు చెందిన సాంబశివరావు ఆడిటర్‌గా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ సికింద్రాబాద్, భరణీ కాంప్లెక్స్‌లోని తన కార్యాలయానికి వెళ్లేవాడు. ఆదివారం ఆఫీసుకు వెళ్లిన సాంబశివరావు రాత్రికి ఇంటికి రాలేదు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారిని ఆరా తీసినా ప్రయోజనం కనిపించ లేదు. అయితే బేగంపేట ప్రకాష్‌నగర్‌లోని సాంబశివరావు బంధువు ఇంటి వద్ద అతని కారు ఉన్నట్లు తెలిసింది. అతనికి భారీగా అప్పులు ఉన్న నేపథ్యంలో దగ్గరి బంధువులే కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానంతో అతడి భార్య సరిత బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాపు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అందుబాటులోకి వ్చన సాంబశివరావు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావుతో వీడియో కాల్లో మాట్లాడారు. తాను క్షేమంగా ఉన్నానని, బంధువులతో తన స్వస్థలమైన ఖమ్మం జిల్లా, సత్తుపల్లికి వచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావుకు ‘డయానా అవార్డు’ -
బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: బేగంపేట్‌లో కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆడిటర్ సాంబశివరావు కిడ్నాప్‌కు గురయ్యారు. కిడ్నాపర్లతో కలిసి బాధితుడి మేనమామ స్కెచ్ వేసినట్లు సమాచారం. బేగంపేట్ పీఎస్‌లో బాధితుడి భార్య ఫిర్యాదు చేశారు. సాంబశివరావు కిడ్నాప్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఆన్లైన్లో అశ్లీలం.. ‘మేమే నగ్నంగా తయారవుతున్నాం’ -
డివిజనల్ కో ఆపరేటివ్ అధికారిగా వెంకటకృష్ణ
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు డివిజనల్ కో ఆపరేటివ్ అధికారిగా ఎం.వెంకటకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పని చేస్తున్న డీఎస్సీఓ రమేష్‌పై ఆరోపణలు రావడంతో రెండు రోజుల క్రితం కలెక్టర్ కెవి.సత్యనారాయణ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కడపలోని జిల్లా కో అపరేటివ్ కార్యాలయంలో ఆడిటర్‌గా పని చేస్తున్న వెంకటకృష్ణకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ అధికారి
సికింద్రాబాద్: సికింద్రాబాద్ (సర్కిల్-18) జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆడిటర్(గణాంకాధికారి)గా పనిచేస్తున్న నిత్యానంద్ లంచం తీసుకుంటూ...శనివారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రెజిమెంటల్‌బజార్‌కు చెందిన ఉమాదేవి, పద్మావతి ఇరువురు అక్కాచెల్లెల్లు. వారసత్వంగా వారి తల్లిదండ్రుల గృహం ఇరువురు అక్కాచెల్లెల్లకు వచ్చింది. సదరు గృహాన్ని గిఫ్ట్ డీడ్ చేసుకున్న ఉమాదేవి, పద్మావతి గృహం పేరు మార్పిడి కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలోని పన్నుల విభాగంలో నిత్యానంద్‌ను సంప్రదించారు. పేరుమార్పిడి కోసం ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో ఉమాదేవి ఎసీబీ అధికారులను సంప్రదించింది. వారు ముందస్తు వ్యూహం మేరకు ఉమాదేవికి రూ. 2000 నగదును ఇచ్చి పంపించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిత్యానంద్ చాంబర్‌కు చేరుకున్న ఉమాదేవి వెంటతెచ్చుకున్న డబ్బును అప్పగించింది. అప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంలో మాటువేసి ఉన్న ఏసీబీ డీసీపీ అశోక్‌కుమార్ బృందం దాడి చేసి నిత్యానంద్ తీసుకున్న లంచం డబ్బును స్వాధీనం చేసుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. పలు ఫైళ్లను, ల్యాప్‌టాప్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వరకు కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదే కార్యాలయంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేసిన కృపాదానంను గత మే 11న ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రెండు నెలలలోపే ఇరువురు అధికారులు ఏసీబీ వలలో చిక్కడం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలకలం సృష్టించింది. -
నకి'లీలలు!
సహకార శాఖలో ఇంటి దొంగల గుట్టు రట్టయింది. ఓ ఆడిటర్ తన అధికారాన్ని చెలాయించి అక్రమంగా రుణాలు కాజేసిన బాగోతం బయటపడింది. ఇందుకు శాఖలోని మరి కొందరి ‘సహకారం’ కూడా తోడయింది. వెరసి,, తన పేరుతో పాటు కుటుంబసభ్యుల పేరున కూడా నకిలీ పట్టాపాస్‌పుస్తకాలు పెట్టి పెద్ద మొత్తం రుణాల పేరుతో కాజేసిన విషయం వెలుగుచూ సింది. ఇంత జరిగినా అతడిపై వేటు వేయాల్సిన ఉన్నతాధికారులు కేవలం బదిలీ చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. - దొంగ పట్టాలు... ఆపై రుణాలు.. - తనతోపాటు కుటుంబసభ్యుల పేరిటా లోన్లు - బినామీ పేర్లతో రూ. కోటి వరకు స్వాహా - సహకార శాఖ ఆడిటర్ అవినీతి బాగోతం - అక్రమాలు వాస్తవమేనంటున్న డీసీఓ నిజామాబాద్ అర్బన్ : జిల్లా సహకార శాఖలో అవినీతి పర్వం జోరుగా సాగుతోంది. సహకార శాఖలోని ఆడిటర్ బోగస్ పట్టాలతో లక్షలాది రూపాయల రుణాలు పొందారు. ప్రభుత్వ ఉద్యోగి అయిఉండి, అదే శాఖలో తనతో పాటు కుటుంబసభ్యుల పేర్లతోనూ నకిలీ పట్టాలు సృష్టించి లోన్ తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. కోటి వరకు లోన్ల రూపంలో కాజేశారనే ఆరోపణలున్నారుు. ఇలా జరిగింది... జిల్లా సహకార శాఖలో సుమారు పదేళ్లకు పైబడి ఆడిటర్‌గా అంబర్‌సింగ్ కొనసాగుతున్నాడు. ఇతను తన పేరున, మరో ముగ్గు రు కుటుంబసభ్యుల పేర్లపై నకిలీ పట్టాలు సమర్పించి లోన్ తీసుకున్నాడు. మాక్లూర్, కమ్మర్పల్లి మండలం కొనసముందర్ ప్రాథమిక సహకార సంఘాలలో అక్రమంగా రుణాలు పొందాడు. ఇతను ఆడిటర్‌గా ప్రాథమిక సహకార సంఘాల అకౌంట్ వ్యవహారాలను పరిశీలించేవారు. దీంతో అందులోని లొసుగులను బయటకు తీసి మాక్లూర్, కొనసముందర్ సహకార సంఘాల సెక్రటరీలను బెదిరించాడు. తనకు సహకార సంఘాలలో రుణ ం కావాలని, దీనికి సంబంధించిన దరఖాస్తులు, పాస్‌పుస్తకాలను అందిస్తానని చెప్పాడు. అదే శాఖలో ఉద్యోగి అరుునందన లోన్ ఇవ్వలేమని కార్యదర్శులు వ్యతిరేకించగా.. ‘ఆడిట్లో మీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చారుు’ అంటూ భయపెట్టడంతో వారు కూడా అతడికి సహకరించారు. కొనసముంద ర్ సొసైటీలో రూ.2.50 లక్షలు, మాక్లూర్ సహకార సంఘంలో రూ.4 లక్షలు, అమ్రాద్ సహకార సంఘంలో రూ.1.50 లక్షలు రుణ ం తీసుకున్నాడు. అతడికి ఏ మాత్రం భూమి లేకున్నా.. తన పేరున, కుటుంబసభ్యుల పేరున అక్రమ పట్టాలు సృష్టించాడు. వీఆర్వో, తహశీల్దార్, ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేశాడు. తనకు అనుకూలంగా ఉన్న సహకార సంఘాల్లో ఈ పత్రాలు పెట్టి రుణం తీసుకున్నాడు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో బినామీ పేర్లు, నకిలీ పట్టాలతో రూ.50 లక్షల వరకు వివిధ పేర్లపై రుణాలు పొందారు. నిజామాబాద్ మండలం మంచిప్ప సహకార సంఘంలో నకిలీ పట్టాలతో రుణ ం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కాలేదు. అలాగే వర్ని, రేంజల్, నందిపేట, నవీపేట, కమ్మర్పల్లి, మాక్లూర్, ఎడపల్లి మండలాల్లో నకిలీ పట్టాలతో బినామీ పేర్లమీద మరికొందరు రుణాలు తీసుకున్నారు. వెలుగులోకి వచ్చిందిలా.. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ సొసైటీ చెర్మైన్ నకిలీ పట్టాల వ్యవహారాన్ని గుర్తించారు. పట్టా పాస్‌పుస్తకాలు కొత్తగా ఉండటం, సంతకాల్లో తేడా ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆడిటర్‌కు సంబంధించిన రుణాల వివరాలను తనీఖీ చేశారు. అరుుతే ఇదంతా 20 రోజుల క్రితమే జరిగినప్పటికీ బయటకు రానీయకుండా ఆడిటర్ తీసుకున్న రూ.2.50 లక్షల రికవరీ చేరుుంచారు. మాక్లూర్ మండలం అమ్రాద్ సహకార సంఘంలో రుణాలు పొందిన లబ్దిదారుల పట్టాలను చైర్మన్ పరిశీలించగా నకిలీ పట్టాపాస్ పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రుణాలు పొందిన జాబితాను పూర్తిస్థాయిలో పరిశీలించగా సుమారు రూ.50 లక్షల వరకు నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు పొందినట్లు తేలింది. ఈ వ్యవహారంపై చైర్మన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. హుటాహుటిన బదిలీ..! నకిలీ పట్టాపాస్‌పుస్తకాలతో రుణాలు పొందిన ఆడిటర్‌ను జిల్లా సహకార శాఖ అధికారి శ్రీహరి రెండు రోజుల క్రితమే బదిలీ చేశారు. జిల్లా కేంద్ర సహకార శాఖ కార్యాలయంలో ఆడిటర్‌గా ఉన్న ఆయనను బోధన్ సహకార శాఖ పరిపాలన కార్యాలయానికి పంపించారు. కాగా, ఆడిటర్ అక్రమాలపై అధికారులకు ముందే తెలిసినా పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. ఉద్యోగి అయి ఉండి సొంత శాఖలోనే సెక్రటరీలను బెదిరించి నకిలీ పట్టాలతో రుణాలు పొందడంపై జిల్లాస్థాయి అధికారులు పెదవివిప్పడం లేదు. ఆడిటర్‌కు సంబంధిత యూనియన్ నేతలు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదని ఓ నాయకుడు చెప్పారు. ఈ వ్యవహారంపై అధికారులు సైతం గత ఏడాదిన్నర కాలంగా వ్యవహారంపై ఎందుకు స్పందించలేదనే అనుమానాలకు తావిస్తోంది.