ఆధ్యాత్మికథ
కేరళలోని కొట్టాయం పట్టణం. పేరెన్నిక గన్న ఆడిటర్ అతడు. డబ్బుకేమీ లోటు లేని అతన్ని పిల్లలు లేరన్న చింత ఒక్కటే పీడిస్తోంది. దాంతో ఏడుకొండల వాడిని ప్రార్థించాడు. మగ పిల్లవాడు పుడితే తన చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అతడి మొర స్వామికి వినిపించింది కాబోలు... ఏడాదికే మగ పిల్లవాడు పుట్టాడు. ఎంతో సంతోషించాడు ఆ ఆడిటర్. తిరుమల కొండకు వెళ్ళి మొక్కుబడి చెల్లించాలన్న విషయం జ్ఞప్తికి వచ్చింది. అయితే, ‘ఈ వారం పోదాము, వచ్చే వారం పోదాము’ అని సంవత్సరాల పాటు వాయిదాలు వేస్తూ వచ్చాడు.
ఇంట్లో వాళ్ళు గట్టిగా పట్టు పట్టేసరికి కొడుకు ఐదో పుట్టినరోజు నాడు కొండకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బయలుదేరే సమయంలో తన మొక్కుబడి గుర్తుకొచ్చింది. చేతి వేలికున్న బంగారు ఉంగరాన్ని చూసుకున్నాడు. మిలమిలా మెరుస్తున్న ఆ ఉంగరాన్ని హుండీలో వేయాలనిపించలేదు.
ఇంతలో అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయిదేళ్ళ క్రితం ఈ ఉంగరం ఖరీదు పది హేనువేలు, ఇప్పుడు దీని ఖరీదు ఇరవై వేలు. ఈ ఉంగరం ఉంచేసుకుని స్వామి వారి హుండీలో పదిహేను వేలు వేద్దామనుకున్నాడు.
కొడుకును తీసుకుని తిరుమల కొండ చేరాడు. ఆరోజు శుక్రవారం. నిజపాద దర్శన సేవ టికెట్ దొరికింది అతడికి. అభిషేకానంతరం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ, ఎలాంటి తొడుగు లేని నిజపాదాలతో దర్శనమిస్తున్నారు స్వామి. ఆపాదమస్తకం కన్నులారా తిలకించి ‘‘ధన్యుడిని స్వామీ...’’ అని నమస్కరించాడు. తర్వాత మొక్కుబడి చెల్లించుకోవడానికి కొడుకును తీసుకుని హుండీ దగ్గరకు వెళ్ళాడు. తను అనుకున్నట్లే పదిహేనువేల నూట పదహార్లు హుండీలో వేసి ‘‘మొక్కు చెల్లించేశాను స్వామీ... బాకీ మొత్తం వడ్డీతో సహా చెల్లించేశాను. రుణ విముక్తుడినైనాను’’ అని హుండీకి దండం పెట్టుకుని అక్కడినుంచి కదిలాడు.
తండ్రీ కొడుకులిద్దరూ ఉచిత ప్రసాదం క్యూలో నిలుచున్నారు. చిన్నచిన్న లడ్డూలు అందరికీ ఇస్తున్నారు. అందరికి లాగే తనకి ఒక లడ్డు, కొడుక్కి ఒక లడ్డు ఇచ్చారు. తియ్య తియ్యగా ఉన్న లడ్డును ఆ అయిదేళ్ళ పిల్లవాడు గబగబా తినేశాడు. ‘‘అడిగితే ఇంకో లడ్డు ఇస్తారా నాన్నా వీళ్ళు?’’ అని ఆశగా అడిగాడు. ‘ఒక్కరికి ఒక్కటే బాబూ... కావాల్సి ఉంటే నా లడ్డు తీసుకో!’’ అని కొడుకు చేతికి ఇచ్చాడు.
తండ్రి చేతిని చూస్తూ కొడుకు ఆశ్చర్యంగా ‘‘నీ ఉంగరం ఏది నాన్నా?’’ అని అడిగాడు.
అప్పుడు చూసుకున్నాడు ఆ చార్టెడ్ అకౌంటెంట్ తన బోసిపోయిన ఉంగరపు వేలును. ‘ఏమి జరిగిందా...’ అని లిప్తపాటు కళ్ళు మూసుకుని ఆలోచించాడు.
ఆరు నెలల క్రితం వేలి ఉంగరం వదులుగా ఉంటే దానికి దారం చుట్టడం లీలగా గుర్తుకొచ్చింది. అలాగే వైకుంఠం షెడ్డుల్లో కూర్చున్నప్పుడు ఉంగరం బిగుతుగా అనిపించి దారాన్ని తీసివేయడం కూడా స్ఫురణకు వచ్చింది.
‘అంటే... హుండీలో డబ్బులు వేసేటప్పుడు డబ్బుతో పాటు ఉంగరం కూడా హుండీలో పడిపోయిందన్న మాట.
నిద్ర లేచింది మొదలు, రాత్రుల్లో నిద్ర పోయేంత వరకు డబ్బు లెక్కలతో ఆటలాడే నా దగ్గర వడ్డీకి వడ్డీ వసూలు చేశాడన్నమాట ఆ వడ్డీ కాసులవాడు... ఎంత తప్పు చేశాను... స్వామీ నన్ను క్షమించు!!’’ అని తలెత్తి ధ్వజ స్తంభానికి భక్తితో నమస్కరించి లెంపలేసుకున్నాడు.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment