కూలీల ఎన్‌కౌంటర్ బూటకమే
స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు డా. చంద్రశేఖరన్
⇒అదుపులోకి తీసుకుని, అత్యంత పాశవికంగా చంపారు
⇒చనిపోయాక కూడా కాల్చారు
⇒ఎక్కడో చంపి ఎన్‌కౌంటర్ ప్రాంతంలో శవాలను పడేశారు
⇒అక్కడ దొరికిన దుంగల తీరుపై కూడా అనుమానాలు
హైదరాబాద్: శేషాచలం కొండల్లో కూలీల ఎన్‌కౌంటర్‌పై అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చెబుతున్నవన్నీ కట్టుకథలేనని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన వారి మృతదేహాల ఫొటోలను విశ్లేషించినఆ నిపుణులు.. కూలీలను పాశవికంగా చంపారని చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనని ప్రఖ్యాత ఫోరెన్సిక్ నిపుణులు, తమిళనాడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మాజీ డెరైక్టర్ డాక్టర్ చంద్రశేఖరన్ తేల్చారు. ‘కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకుని.. చిత్రహింసలకు గురిచేసి, అత్యంత కిరాతకంగా చంపారు’ అని ఆయన చెప్పారు.
పోలీసులు ఏ ఒక్క స్మగ్లర్‌నూ ప్రాణాలతో పట్టుకోలేకపోవడం, సంఘటనా స్థలంలో స్మగ్లర్ల వద్ద ఆయుధాల ఆనవాళ్లు లేకపోవడం, స్మగ్లర్లు మోసుకెళ్తున్నారని చెబుతోన్న దుంగలపై తెల్ల రంగు మరకలు ఉండటాన్ని పరిశీలించాక శేషాచలం ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని ఆయన నిర్ధారణకు వచ్చారు. ఎన్‌కౌంటర్ బూటకమేనని ప్రఖ్యాత జాతీయ పత్రిక ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పరిశోధనాత్మక కథనాలు కూడా ప్రచురించింది.
పాశవిక దాడి గుర్తులు..
ఎన్‌కౌంటర్ ఆరు గంటల తర్వాత వివిధ కోణాల్లో సేకరించిన మృతదేహాల ఫోటోలు, సంఘటనా స్థలి ఫోటోలను ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ చంద్రశేఖరన్ పరిశీలించి, విశ్లేషించారు. ‘చనిపోయిన తర్వాత కూడా శరీరాలపై తుపాకులతో పాశవికంగా దాడి చేసిన గుర్తులు ఉన్నాయి’ అని ఆయన తేల్చారు. ఎన్‌కౌంటర్ జరిగిన చీకటీగల కోన, సచ్చినోడి బండ ప్రాంతాల్లో నేలపై ఎలాంటి రక్తం మరకలు లేకపోవడంపై చంద్రశేఖరన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కూలీలను మరోచోట చంపి అక్కడకు తీసుకువచ్చి పడేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల వద్ద ఉన్న ఎర్రచందనం దుంగలకు రంగులు వేసి ఉండటం, అవి అంతకుముందే స్వాధీనం చేసుకున్న దుంగల్లా ఉండటం అనుమానాలకు బలమిస్తోంది.
డీఐజీ ముందస్తు ప్రకటన ఉద్దేశమదేనా..
ఎన్‌కౌంటర్‌కు నాలుగు రోజుల ముందు రెడ్ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే స్మగ్లర్లపై కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆయన ముందస్తుగా చేసిన ప్రకటన ఉద్దేశాన్ని పరిశీలిస్తే.. శేషాచలం ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటరేనని స్పష్టమవుతోందని చంద్రశేఖరన్ అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలిస్తే అధికారుల చెప్పిన వివరాల్లో అసలు పొంతనే లేదన్నారు.
మరికొన్ని సాక్ష్యాలు..
- తలపై బండరాళ్లు, ఇనుపరాడ్లతో మోదడం వల్ల నలుగురు కూలీలు చనిపోయారు.
- పోలీసులు తీవ్రంగా హింసించడం వల్ల ఒకరి ప్యాంట్ చిరిగిపోతే దాన్ని దాచిపెట్టేందుకు ఆ కూలీకి ఆదరాబాదరాగా మరోప్యాంట్ తొడిగారు.
- ఒక కూలీ ఎడమ చేతిపై బండరాతితో గానీ.. ఇనుపరాడ్డుతోగానీ మోదినట్లు గుర్తులు ఉన్నాయి. పోలీసుల దాడి నుంచి ఆ కూలీ తప్పించుకునే యత్నం చేసినప్పుడు ఈ గాయం అయి ఉంటుంది.
- కొందరు కూలీల మొహాలు గుర్తుపట్టలేని రీతిలో చెక్కేసినట్లున్నాయి. ఎముకలు విరిగిపోవడం, చర్మం కమిలిపోవడాన్ని బట్టి చూస్తే.. వారిని అదుపులోకి తీసుకుని విచారించే సమయంలోనే చిత్ర హింసలకు గురిచేసినట్టు తెలుస్తోంది.