
‘ఫోరెన్సిక్’కు విభజన కష్టాలు
- గవర్నర్ వద్ద ప్రస్తావనకు రాని సైన్స్ ల్యాబ్ అంశం
- తెలంగాణ, ఏపీ మంత్రుల ఎజెండాలోనే లేని వైనం
సాక్షి, హైదరాబాద్: వివిధ కేసుల్లో పోలీసు, ఎక్సైజ్‌శాఖలకు శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించి నివేదికలందించే కీలకమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) విభజన కష్టాలు ఎదుర్కొంటోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో పొందుపరిచిన సంస్థలు, విభాగాల విభజన జాబితాలో ఎఫ్‌ఎస్‌ఎల్ కూడా ఉన్నా తెలుగు రాష్ట్రాలు ఈ సంస్థను పట్టించుకోలేదు. పదో షెడ్యూల్‌లోని సంస్థలు, విభాగాల విభజనపై మూడు రోజుల క్రితం గవర్నర్ నరసింహన్ వద్ద జరిగిన చర్చలో ఇరు రాష్ట్రాల మంత్రులు ఎఫ్‌ఎస్‌ఎల్ విభజన అంశాన్ని వారి ఎజెండాలోనే చేర్చకపోవడంతో ఆ విభాగం అధికారుల్లో ఆందోళన నెలకొంది. సిబ్బంది కొరత కారణంగా ఇప్పటికే రెండు లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు వివిధ శాస్త్రీయ పరీక్షలకు వాడే యంత్ర పరికరాల విభజనపైనా ఇరు రాష్ట్రాల డీజీపీలు ఇంకా ఓ అంగీకారానికి రాలేదని తెలిసింది. ఇంతటి ప్రాధాన్యతగల సంస్థను రెండు రాష్ట్రాల ప్రభుత్వా లు పట్టించుకోకపోవడంతో అయోమయం నెలకొంది.
ఖాళీగా 89 పోస్టులు...
ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ పదవీ విరమణ చేసి ఏడాది కావస్తుండగా ఇన్‌చార్జి డైరెక్టర్‌తోనే కాలం నెట్టుకొస్తున్నా రు. మొత్తం 202 మంజూరు పోస్టుల్లో 113 మంది పనిచేస్తుండగా, మిగతా 89 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎఫ్‌ఎస్‌ఎల్‌లోని కీలకమైన విభాగాలను పర్యవేక్షించాల్సిన నాలుగు జాయింట్ డైరెక్టర్ పోస్టుల్లో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.