
ఏసీబీ కోర్టుకు రేవంత్
సండ్ర, రేవంత్‌ల వాయిస్ శాంపిళ్లను ఫోరెన్సిక్‌కు పంపేందుకు కోర్టు అనుమతి
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతోపాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సింహ కూడా హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్ కోర్టు పరిశీలనలో ఉందని, త్వరలో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ పేర్కొన్న నేపథ్యంలో.... ఆ రెండు చార్జిషీట్లను పరిశీలించిన తరువాత నిందితులకు సమన్లు జారీచేస్తామని న్యాయమూర్తి లక్ష్మీపతి స్పష్టం చేశారు.
సమన్లు అందిన తరువాత విచారణకు రావాలని ఆదేశించారు. కాగా అసెంబ్లీ అధికారులు సమర్పించిన రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యల వాయిస్ శాంపిళ్లను విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. అరెస్టు సమయంలో ఏసీబీ అధికారులు తమ వాహనాలను సీజ్ చేశారని, వాటిని ఇప్పించాలని కోరుతూ సెబాస్టియన్, ఉదయ్‌సింహ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... వాటిపై విచారణను న్యాయమూర్తి సోమవారానికి వాయిదా వేశారు.
కేసీఆర్‌ను గద్దె దించుతా : రేవంత్
కేసీఆర్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా వ్యవహరించిందని, కేసీఆర్‌ను సీఎం పదవి నుంచి గద్దె దించేందుకు ప్రజలను సమీకరిస్తానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో మీడియాతో మాట్లాడారు. చివరి వరకు తాను టీడీపీలోనే కొనసాగుతానన్నారు. కోర్టు షర తు మేరకు నియోజకవర్గంలోనే ఉండటంతో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం లభించిందని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారం టీఆర్‌ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.