అంతా ఆయనే చేశారు..
ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారు..
టీడీపీ నేతపై ఏసీబీ అధికారుల వద్ద భీమిలి తహసీల్దార్ మొర
విచారణలో దేశం నాయకుడిపై ఆరోపణలు?
విశాఖపట్నం : అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో అరెస్టయిన తహసీల్దార్ బి.టి.వి.రామారావు ఏసీబీ విచారణలో భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఈనెల 22వ తేదీన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి భీమిలి తహసీల్దార్ రామారావు ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో అవినీతి, అక్రమార్జనకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో ఒక రోజంతా విచారించి 23న రిమాండ్‌కు పంపారు. ఏసీబీ అధికారుల విచారణలో రామారావు భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడిపై బలంగానే ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పాస్ పుస్తకాలు మంజూరు మొదలు... ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారని, బీచ్ ఒడ్డున ఆక్రమణలను క్రమబద్ధీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసేవారని రామారావు ఏసీబీ అధికారుల వద్ద ఏకరవుపెట్టినట్టు సమాచారం. రామారావుపై ఏసీబీ అధికారులకు అందిన 12 ఫిర్యాదుల్లో పది కేసులు సదరు టీడీపీ నేత సిఫార్సు చేసిన పైరవీలేనని తెలుస్తోంది. రామారావు ఏకరవు పెట్టిన విషయాలు, చేసిన ఆరోపణలను ఓ నివేదిక రూపంలో ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. కాగా, ఏసీబీకి అడ్డంగా దొరికిన తర్వాత టీడీపీ నాయకుడే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న రామారావు.. స్వతహాగా కూడా చేయి తడపందే పనులు చేసే బాపతు నియోజకవర్గ నాయకుడు ఏరికోరి ఇక్కడ తహశీల్దార్‌గా వేయించుకున్నట్టు స్పష్టమవుతోంది.
మంగమారిపేట టీడీపీ నేత ఎక్కడ?
ఇక భీమిలి తహసీల్దార్ రామారావు అండతో రెండేళ్లు హల్‌చల్ చేసిన మంగమారిపేట టీడీపీ నాయకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లడం చర్చాంశనీయమైంది. భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడికి ప్రధాన అనుచరుడైన మంగమారిపేట గ్రామ నేత తహసీల్దార్‌కు ప్రతి అక్రమ పనిలోనూ చేదోడువాడోదుగా ఉండేవాడన్న వాదనలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు దాడి చేసిన రోజు ఉదయం కూడా సదరు మంగమారిపేట నేత తహసీల్దార్‌కు రూ. 20 లక్షల నగదు ఇంటికి తీసుకువెళ్లి అందించినట్టు చెబుతున్నారు. మంగమారిపేటలో సర్వే నెంబర్ 293లో బీచ్ ఒడ్డున పది ఎకరాలకు పైగా స్థలాన్ని టీడీపీ నేత అనుచరులు ఆక్రమించి ఫెన్సింగ్ కూడా వేసేశారు. ఆ స్థలం జోలికి రాకుండా ఉండేందుకే టీడీపీ నేత తహసీల్దార్‌కు రూ.20 లక్షలు ముడుపులు అందించినట్టు చెబుతున్నారు. ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు కూడా అదేనని అంటున్నారు. మొత్తంగా రెండేళ్లుగా తహసీల్దార్‌తో ఎన్నో అక్రమాలు చేయించిన మంగమారిపేట టీడీపీ నేత రెండు రోజులుగా పత్తా లేకపోవడం చర్చాంశనీయమైంది.
ఆ కేసులు మా పరిధిలోవి కావు : ఏసీబీ డీఎస్పీ
తహసీల్దార్ రామారావు అవినీతి, అక్రమాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. మేం దాడులు నిర్వహించి అరెస్టు చేసిన దరిమిలా ఆయన బాధితులు పెద్దసంఖ్యలో ఏసీబీ ఆఫీసుకు వస్తున్నారు.. భూ వివాదాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి ఆ కేసులన్నీ మా పరిధిలోవి కావు.. ఆ ఫిర్యాదులను మేం ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు పంపిస్తాం.. అని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ఆదివారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏసీబీ విచారణలో రామారావు ఏం మాట్లాడారో తాము బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు.