కేసుల నమోదులో ఏసీబీ డీలా! | DA Case Was Not Registered During The Year | Sakshi
Sakshi News home page

కేసుల నమోదులో ఏసీబీ డీలా!

Published Fri, Oct 15 2021 4:14 AM | Last Updated on Fri, Oct 15 2021 4:16 AM

DA Case Was Not Registered During The Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన ఏసీబీ వెనక్కి తగ్గిందా? కేవలం లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన పెద్ద చేపలను ఊచల్లోకి నెట్టాల్సిన అవినీతి నిరోధక శాఖ ఎందుకు సైలెంట్‌ అయ్యింది? ఏడాదిలో కనీసం ఒక్క అవినీతి అధికారిపై కూడా డీఏ (డిస్‌ప్రొపార్సినేట్‌ అస్సెట్స్‌) కేసు నమోదు చేయకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? నిజంగానే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులు లేరని ఏసీబీ భావిస్తోందా? లేక అలాంటి అధికారులపై ఫిర్యాదు రాకపోవడం వల్ల కేసులు నమోదు చేయడం లేదా? ఈ ప్రశ్నలు, అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  

గతంలో ఉన్న ఊపేది... 
తెలంగాణ ఏర్పడిన కొత్తలో పలు సంచలనాత్మక కేసులను డీల్‌ చేసిన అవినీతి నిరోధక శాఖ నెమ్మదించినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో ఏసీబీ విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఈఎస్‌ఐ స్కాంలో వందల కోట్లు నొక్కేసిన వ్యవహారంలో ఉద్యోగులతో పాటు పలు ప్రైవేట్‌ వ్యక్తులను అరెస్ట్‌చేసి కటకటాల్లోకి నెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న వ్యవహారంలో రాష్ట్ర స్థాయి హోదా ఉన్న అధికారులను ఊచలు లెక్కబెట్టేలా దూకుడుతో వ్యవహరించింది.

అంతటి ఏసీబీ ఇప్పుడు పెద్దగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు కేవలం ట్రాప్‌ కేసులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఏసీబీ, ఒక్క ఆదాయానికి మించిన కేసు గానీ, నిధుల దుర్వినియోగంతో సొమ్ము చేసుకున్న కేసులు గానీ నమోదు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 63 ట్రాప్‌ కేసులు మాత్రమే ఏసీబీ నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రెవెన్యూ, పోలీస్‌ శాఖలే ప్రధానంగా ఉన్నాయి. గతేడాది పది వరకు డీఏ కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనేక ఆరోపణలకు తావిస్తోంది.  

కీసర నాగరాజు వ్యవహారమే కారణమా? 
గతేడాది ఆగస్టులో రాంపల్లి భూముల వ్యవహారంలో కీసర ఎమ్మార్వో రూ. కోటి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజుతో పాటు సర్పంచ్‌ అంజిరెడ్డి, వరంగల్‌కు చెందిన రియల్టర్‌ శ్రీనాథ్‌ యాదవ్, వీఆర్‌ఓ సాయిరాజులను అరెస్ట్‌ చేసింది. అదే ఎమ్మార్వోపై రోజుల వ్యవధిలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు పీసీ యాక్ట్‌ కింద మరో కేసు నమోదు చేశారు.

బెయిల్‌ కోసం ప్రయత్నిస్తుండగానే అక్టోబర్‌ 14న ఎమ్మార్వో నాగరాజు చంచల్‌గూడ జైళ్లో కిటికీ గ్రిల్స్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసు మరింత హీటెక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ధర్మారెడ్డి అనే వ్యక్తి నవంబర్‌ 8న కుషాయిగూడలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం దుమారానికి తెరదీసింది. ఒక్క కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో నిందితుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో ఏసీబీ కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నుంచి సైతం ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి అవినీతి తిమింగళాల వేటకు ఏసీబీ స్పీడ్‌ బ్రేకర్‌ వేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. 

ప్రాసిక్యూషన్‌ అనుమతి కూడా కారణమేనా? 
ఏసీబీ కేసుల్లో నిందితుల విచారణకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్‌ అనుమతి రాకపోవడం కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేయకపోవడానికి ప్రధాన కారణమని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన వేలాది కేసుల్లో కనీసం పదుల సంఖ్యలో కూడా నిందితుల విచారణ కోసం ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్‌ అనుమతి రాలేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement