సాక్షి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారి బాలగౌని మురళీగౌడ్ సుమారు వంద కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఆస్తులపై మూడు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్, నంద్యాలల్లో రెండు భవనాలు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, తిరుపతిలోని మురళీగౌడ్ బంధువుల ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్ బావమరుదుల ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుతో బెంగళూరులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు.
మురళీగౌడ్ భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్ పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులు పొంది, తిరుపతిలో అసిస్టెంట్ సిటీప్లానర్‌గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్‌పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్‌ప్లానింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. నాటి ఫిర్యాదులతో ఈ సోదాలు జరిగాయి.
తిరుపతి ద్వారకానగర్‌లోని నివాసముంటున్న మురళీ గౌడ్ బంధువు ఇంట్లో 14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే తిరుపతి రూరల్ పేరూరులోని బిల్లు కలెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, లక్షా యాభైవేల రూపాయల నగదు లభించింది. మురళీగౌడ్‌తో కలిసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఇళ్లలోనూ సోదాలు చేశామని ఏసీబీ సీఐ ప్రసాద్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment