కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి,న్యూఢిల్లీ: తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఉచితంగా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ఫోరెన్సిక్ నిపుణుల కొరతను తీర్చేలా.. జాతీయ ప్రాముఖ్యత దృష్ట్యా ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు నిర్వహించేందుకు ఈ యూనివర్సిటీ ఏర్పాటు ఎంతో అవసరమని సీఎం వివరించారు.
దేశంలో ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు, దేశ వ్యాప్తంగా క్రిమినల్ జస్టిస్ ఇన్‌స్టిట్యూట్‌లను బలోపేతం చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇందులో భాగంగా గుజరాత్‌లోని గాంధీనగర్ కేంద్రంగా ఇప్పటికే నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని తెలిపారు. దీంతోపాటు ఢిల్లీ, గోవా, త్రిపురలో కూడా క్యాంపస్‌లు స్థాపించిందని గుర్తు చేశారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండవ రోజు గురువారం ఉదయం ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు విన్నవించిన అంశాలు సహా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు విషయాల గురించి అమిత్ షాతో చర్చించారు.
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినప్పటికీ, విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో చాలా వరకు ఇప్పటికీ నెరవేర్చలేదని వివరించారు. రెండు రాష్ట్రాల మధ్య కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలు ఇప్పించండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం.. అమిత్‌షాను కోరారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అవశ్యకమని పునరుద్ఘాటించారు. పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ.6,886 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు.
కడపలో నిర్మించనున్న సీల్ ప్లాంటుకు సరిపడా ముడి ఖనిజాన్ని అందుబాటులో ఉంచడానికి ఏపీఎండీసీకి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో 76.9 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని, ఈ ప్రాజెక్టుకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఒప్పందాలను ఉల్లంఘిస్తున్న తెలంగాణ
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు సంబంధించిన పలు అంశాలను అమిత్ షాకు ముఖ్యమంత్రి వివరించారు.
కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు అన్ని ఆపరేషనల్ ప్రోటోకాల్స్‌ను, ఒప్పందాలను, ఆదేశాలను ఉల్లంఘిస్తోందని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం అనధికారకంగా, ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (3టీఎంసీలు), దిండి పథకాలను 800 అడుగుల వద్ద నిర్మిస్తున్న విషయం గురించి ఇదివరకే కేంద్రం దృష్టికి తెచ్చామని చెప్పారు.
ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సెక్యూరిటీ బిహేవియరల్ సైన్స్, క్రిమినాలజీ రంగాల్లో పరిశోధనలు మరింతగా ఊపందుకోవాలి. ఈ దిశగా గుజరాత్‌లో ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ వర్సిటీ.. ఢిల్లీ, గోవా, త్రిపురలో ఇప్పటికే క్యాంపస్‌లు ఏర్పాటయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఆ రంగాలు మరింత బలోపేతమవ్వడంతో పాటు ప్రజలకు సత్వర న్యాయం చేకూర్చే దిశగా మరిన్ని అడుగులు ముందుకు పడతాయి.
2014–15కు సంబంధించి రూ.18,330.45 కోట్ల బిల్లులు, 10వ వేతన సంఘం బకాయిలు, పెన్షన్లు మొదలైన వాటి రూపేణా మొత్తంగా రూ.32,625.25 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే విడుదల చేయాలి. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,937.92 కోట్ల సొంత నిధులు ఖర్చు చేసింది. ఈ డబ్బును రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదు. ఇప్పటికైనా ఇచ్చేలా వెంటనే చర్యలు తీసుకోగలరు.
– కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment