వైఎస్ జగన్ కారు ఆపుతున్న డీఎస్పీ.. పోలీసులతో వాగ్వాదం.. కారు దిగి ఆస్పత్రి వైపు నడిచి వెళుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు
బాధితులను పరామర్శించకుండా కుట్రలు
ఆస్పత్రికి వచ్చే దారిలో ట్రాక్టర్లు, లారీలు అడ్డు నిలిపిన వైనం
ట్రాఫిక్ క్లియర్ చేయకపోవటంతో కారు దిగి నడుచుకుంటూ..
కిలోమీటర్ తర్వాత ఓ కారులో ఎక్కి ఆస్పత్రికి చేరుకున్న జగన్
లోపలికి వెళ్లకుండా అడ్డగింత.. అరగంట నిరీక్షణ
క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. భద్రత ఏర్పాట్లు కూడా సరిగా చేయలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌ల పరామర్శ ముగిసినప్పటికీ.. వైఎస్ జగన్‌ను ఆస్పత్రి వద్దకు వెళ్లకుండా కావాలనే అడ్డుకున్నారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన స్విమ్స్‌కు బయలుదేరారు.
అంతలో కూటమి ప్రభుత్వ పెద్దలు క్షతగాత్రులను మరో ఆస్పత్రికి తరలించాలని కుట్ర పన్నారు. ఇందులో భాగంగా జగన్ ఆలస్యంగా చేరేలా కాన్వాయ్‌ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటగానే ఇసుక ట్రాక్టర్లు, లారీలను రోడ్డుపై ఆపేశారు. వెంటనే డీఎస్పీ శ్రీనివాసరావు వైఎస్ జగన్ వద్దకు వచ్చి.. ఇటుగా వెళ్లటానికి అనుమతి లేదు.. తొక్కిసలాట జరిగిన బైరాగిపట్టెడకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి తాను వచ్చానని, వారి వద్దకు వెళ్తానని తేల్చి చెప్పారు.
అందుకు డీఎస్పీ ససేమిరా అన్నారు. దీంతో తాను నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్తానని జగన్ వాహనంలోంచి కిందకు దిగారు. నడచుకుంటూ తిరుపతి వైపు పయనమయ్యారు. వైఎస్ జగన్ వెంట రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ మంత్రి ఆర్‌కే రోజ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు విజయానందరెడ్డి, భూమన అభినయరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, నూకతోటి రాజేష్‌లు బయలు దేరారు. జగన్ వచ్చారని తెలిసి స్థానికులు పెద్దఎత్తున తరలి వచ్చారు. కిలోమీటర్ దూరం నడిచాక.. తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారులో వైఎస్ జగన్ ఎక్కి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
ఆసుపత్రి వద్ద హై డ్రామా..
వైఎస్ జగన్ స్విమ్స్‌కు చేరుకునేలోపే ఎనిమిది మందిని తరలించారని సిబ్బంది చర్చించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటలకు వైఎస్ జగన్ ఆస్పత్రి వద్దకు వచ్చినప్పుడు పోలీసుల భద్రత కల్పించలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే ఉండటంతో జగన్‌ను ఆస్పత్రి లోనికి అనుమతించకుండా అరగంట పాటు ఆపేశారు. ఆ సమయంలో వైద్య విద్యార్థులు, ప్రజలు భారీగా చుట్టుముట్టారు. జగన్ పర్యటన మొత్తం మీద అడుగడుగునా పోలీసుల నిర్లక్ష్యం కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment