గాయపడిన మహిళను పరామర్శిస్తున్న జగన్
క్షతగాత్రులకు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శ
ఆప్యాయంగా మాట్లాడుతూ ఘటనపై ఆరా
ఎవరూ పట్టించుకోలేదంటూ కన్నీరు పెట్టుకున్న మహిళలు
ప్రాధేయ పడుతున్నా వినిపించుకోలేదని మరికొందరి ఆవేదన
ఇలా ఎప్పుడూ జరగలేదని మండిపడిన బాధితులు
వారందరికీ ధైర్యం చెప్పిన జననేత
తిరుమల:‘తల్లీ ఏమైందమ్మా.. అధైర్య పడకండి.. నేనున్నాను’ అంటూ బాధితులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. క్షతగాత్రులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం సాయంత్రం తిరుపతికి వచ్చారు. శ్రీ పద్మావతి వైద్య కళాశాల ఆసుపత్రి (స్విమ్స్)లో చికిత్స పొందుతున్న బాధితులను పేరు పేరున పరామర్శించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు.
పడిపోయినా పట్టించుకోలేదు నాయనా?
‘అయ్యా.. తండ్రీ.. కొడుకా’ అంటూ హైదరాబాద్‌కు చెందిన సావిత్రమ్మ, విశాఖపట్నంకు చెందిన ఆదిలక్ష్మి అనే వృద్ద మహిళలు ఆప్యాయంగా జగన్ చేయి పట్టుకుని మాట్లాడారు. ఈ రోజు నీతో మాట్లాడుతామని అనుకోలేదు తండ్రీ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. తొక్కిసలాటలో కింద పడిపోయి సాయం చేయమని ప్రాధేయ పడుతున్నా ఎవరూ వచ్చి కాపాడలేదు తండ్రీ.. అంటూ విలపించారు. తమిళనాడుకు చెందిన ఆలగరాణి అనే మహిళ మాట్లాడుతూ.. టోకెన్ల కేంద్రం వద్ద ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని, తాను ఏం చెబుతున్నా అర్థం చేసుకునే వారు కనిపించలేదని కన్నీరు పెట్టుకున్నారు. తన పక్కన ఉన్న మహిళ తొక్కిస లాటలో తన కళ్ల ముందే చనిపోయిందంటూ బోరుమన్నారు. క్యూ లైన్ల వద్ద అధికారుల పర్యవేక్షణ సరిగా లేదని, ఏమి జరుగుతుందో చెప్పేవారు లేరని బాధితులు వైఎస్ జగన్‌కు విన్నవించారు. తాము ప్రతి ఏడాది వైకుంఠ ద్వార దర్శనానికి వస్తుంటామని, ఎన్నడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రద్దీ పెరుగుతున్నా పట్టించుకోలేదు
టోకెన్లు ఇచ్చే కేంద్రం వద్ద ఉదయం నుంచీ వేచి ఉన్నామని, ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ మహిళ బోరుమంది. గంట గంటకూ రద్దీ పెరుగుతున్నా అధికారులు గానీ, పోలీసులు గానీ క్యూలైన్‌లోకి భక్తులను వదిలి పెట్టలేదన్నారు. ఆ తర్వాత ఒక్కసారిగా వేలాది మందిని వదిలి పెట్టడంతో తోపులాట జరిగి వందలాది మంది కింద పడిపోయారని మరో మహిళ వివరించారు.
వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తల్లీ..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయి తల్లీ.. అంటూ ఆరా తీశారు. మరింత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ‘క్షతగాత్రులకు అండగా ఉంటాం. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నా సొంత మనిషి. మీకు మౌలిక సౌకర్యాలు కల్పిస్తారు. దారి ఖర్చులతోపాటు మందులు, దుస్తులు, వాహనాల ఏర్పాటు తదితర విషయాలన్నింటినీ చూసుకుంటారు’ అని వైఎస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనయుడు, వైఎస్సార్‌సీపీ చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి క్షతగాత్రులకు వసతులు కల్పించారు. వారికి ఆర్థిక సాయం కూడా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment