సాక్షి, అమరావతి : దిశ వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం నేర పరిశోధనను బలోపేతం చేస్తోంది. ఇందులో కీలకమైన ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలనూ పటిష్టపరుస్తోంది. 2014లో రాష్ట్ర విభజనతో ఫోరెన్సిక్ మౌలిక వసతుల వ్యవస్థ అంతా హైదరాబాద్‌లోనే ఉండిపోయింది. 2019 వరకు రాష్ట్రంలో ఏ నేరం జరిగినా.. ఫోరెన్సిక్ నివేదికల కోసం హైదరాబాద్‌పై ఆధారపడాల్సి వచ్చేది.
దీంతో నేర పరిశోధన ఆలస్యమై దోషులను గుర్తించడం, నేరాన్ని నిరూపించడంలో జాప్యం జరిగేది. దీనికి విరుగుడుగా రాష్ట్రంలోనే ఫోరెన్సిక్ సైన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునిక ల్యాబొరేటరీలతో మౌలిక వసతులను కల్పిస్తూనే.. మరోవైపు పూర్తిస్థాయిలో నిపుణుల నియామకం ద్వారా ఈ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కార్యాచరణ చేపట్టింది.
ఏడుచోట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు
రాష్ట్రంలో ఏడు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లతోపాటు పెద్దఎత్తున నిపుణుల నియామక ప్రక్రియను సర్కారు చేపట్టింది. అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, గుంటూరు, విజయవాడలలో దిశ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీల ఏర్పాటుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను ఆమోదించింది. డీఎన్‌ఏ పరిశోధన సామర్థ్యాన్ని మూడింతలు.. సైబర్ నేర పరిశోధన మౌలిక వసతుల సామర్థ్యాన్ని ఐదింతలు పెంచింది. దాంతోపాటు ఫోరెన్సిక్ నిపుణుల సంఖ్యను ఐదింతలు పెంచాలని నిర్ణయించింది. అందుకోసం పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.
58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్ల నియామకం
రాష్ట్రంలో ఇటీవలే 58 మంది సైంటిఫిక్ అసిస్టెంట్లను ప్రభుత్వం నియమించింది. మొత్తం 58 మంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా 8,127 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. వారిలో 3,481 మంది అర్హత సాధించగా 58 మందిని ఎంపికచేసింది. సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) పోస్టులకు 18 మందిని, సైంటిఫిక్ అసిస్టెంట్ (బయాలజీ/సెరోలజీ) ఖాళీల్లో 22 మందిని నియమించి వారికి శిక్షణనిస్తోంది.
కాంట్రాక్టు పద్ధతిలో 46 మంది ల్యాబ్ టెక్నీషియన్లు
ఇక ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో మరో 46 మంది నిపుణులను కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వం తాజాగా నియమించింది. ఎంప్లాయ్‌మెంట్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి అర్హుల జాబితాను తెప్పించుకుని అర్హులైన వారికి రాత పరీక్ష నిర్వహించింది. తద్వారా సైంటిఫిక్ అసిస్టెంట్లు 16 మంది, ల్యాబ్ అసిస్టెంట్లు 15 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు 15 మందిని నియమించింది. త్వరలో 15 మంది సైంటిఫిక్ ఆఫీసర్ల పోస్టులను కూడా భర్తీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment