న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వీడియోకాన్ ఇండస్ట్రీస్ ఖాతా పుస్తకాల ఆడిట్ సమీక్షలో కొన్ని పద్దులు, లావాదేవీల నమోదుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రమోటర్ ధూత్ కుటుంబం నిర్వహణలో ఉన్నప్పుడు వీటి నమోదు జరిగి ఉండవచ్చని ఆడిట్ సమీక్ష పేర్కొంది. కంపెనీపై దివాలా చట్ట చర్యలు ప్రారంభించకముందు ఈ సందేహాస్పద లావాదేవీలు నమోదైనట్లు ఆడిట్ అభిప్రాయపడింది.
కాగా.. వీడియోకాన్ రుణపరిష్కార నిపుణులు ఇప్పటికే జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ)కు ఇలాంటి లావాదేవీలను రద్దు చేయడం, ప్రక్కన పెట్టడంపై దరఖాస్తు చేశారు. ఈ ఆడిట్ సమీక్ష వివరాలను గత నాలుగు త్రైమాసికాల ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న సందర్భంగా కంపెనీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు తెలియజేసింది.
దివాలా చట్ట నిబంధనల ప్రకారం ప్రిఫరెన్షియల్, విలువ తక్కువగా మదింపు, అక్రమ లావాదేవీల గుర్తింపునకు రుణ పరిష్కార నిపుణులు చేపట్టిన స్వతంత్ర లావాదేవీ ఆడిట్ సమీక్ష అనంతరం ఈ అంశాలు బయటపడినట్లు వివరించింది. రుణ పరిష్కార నిపుణులు 2021 జూన్(క్యూ1), సెప్టెంబర్(క్యూ2), డిసెంబర్(క్యూ3), 2022 మార్చి(క్యూ4)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను క్రోడీకరించి పూర్తిఏడాది(2021–22) పనితీరును ప్రకటించారు. వెరసి వీడియోకాన్ ఇండస్ట్రీస్ స్టాండెలోన్ ఆదాయం రూ. 756 కోట్లకు చేరగా.. రూ. 6,111 కోట్లకుపైగా నికర నష్టం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment