న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ 17 నాటికి నికరంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 11.18 శాతం పెరిగి రూ. 3.80 లక్షల కోట్లకు చేరాయి. అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు పెరగడం ఇందుకు దోహదపడినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. జూన్ 17 నాటికి ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ వసూళ్లు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 13.70%పెరిగి రూ. 1,16,776 కోట్లకు చేరాయి. నికరంగా వసూలైన రూ. 3,79,760 కోట్ల ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేషన్ పన్నులు రూ. 1,56,949 కోట్లు, వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 2,22,196 కోట్లు ఉన్నాయి. జూన్ 17 నాటికి రీఫండ్‌లు 30% పెరిగి రూ. 39,578 కోట్లుగా నమోదయ్యాయి.
జీఎస్‌టీ రిటర్నులకు అదనపు ధ్రువీకరణలు!
కాగా పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్‌లకు అడ్డుకట్ట వేసేలా జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్ విధానంలో మరిన్ని ధ్రువీకరణలను అమలు చేయాలన్న సీబీఐసీ ప్రతిపాదనను జూలై 11న జరిగే సమావేశంలో జీఎస్‌టీ కౌన్సిల్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయం తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ అలాగే రిటర్ను దాఖలు చేసేటప్పుడు కూడా అదనంగా ధ్రువీకరణ నిబంధనలను ప్రవేశపెట్టాలని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు నిర్ణయించినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment