
రంగంలోకి మోడీ జట్టు...కార్పొరేట్లు ఖుషీఖుషీ
న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం .. రాజకీయ నేతలతో పాటు పారిశ్రామిక దిగ్గజాలతో కళకళ్లాడింది. కార్పొరేట్ ప్రపంచ ప్రముఖుల్లో చాలా మంది ఇందులో పాల్గొన్నారు. అంబానీ సోదరులు, హిందుజా, అదానీ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మోడీని ఈ సందర్భంగా సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి అభివర్ణించారు. ఆయన సారథ్యంలో దేశ ఎకానమీ మళ్లీ కోలుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య భారత దేశంలో అద్భుత ఘట్టమని అంబుజా న్యోతియా గ్రూప్ చైర్మన్ హర్ష్ న్యోతియా పేర్కొన్నారు.
వృద్ధి, అభివృద్ధి అవసరాన్ని మోడీ గట్టిగా చెప్పగలిగారని, దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో ఆయనపై భారీ అంచనాలు ఉన్నాయని హర్ష్ తెలిపారు. దేశానికి మంచి రోజులు రానున్నాయని నిక్కో గ్రూప్ చైర్మన్ రాజీవ్ కౌల్ వ్యాఖ్యానించారు. వృద్ధిని సాధిస్తూ, ఉపాధి కల్పిస్తూ, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ.. దేశాన్ని సంస్కరణల పథంలో నడిపించే దార్శనికత గల ప్రభుత్వం కోసం ప్రజలంతా ఎదురుచూశారని కౌల్ పేర్కొన్నారు. మోడీ ప్రధాని కావడం దేశానికి మేలు చేయగలదని, ఆయన ఇచ్చిన హామీల్లో కనీసం యాభై శాతం నెరవేర్చినా.. ఎంతో మేలు జరగగలదని ఆండ్రూ యూల్ సీఎండీ కల్లోల్ దత్తా అభిప్రాయపడ్డారు.
హాజరైన ప్రముఖులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా..కుమారులు, ఆయన సోదరుడు..అడాగ్ అధినేత అనిల్ అంబానీ, ఆయన కుటుంబం, తల్లి కోకిలాబెన్ అంబానీ హాజరయ్యారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన సతీమణి వచ్చారు. అటు, హిందుజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (ఇండియా) చైర్మన్ అశోక్ హిందుజా, ఎస్సార్ అధినేత శశి రుయా, భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ .. ఆయన సోదరులు, హీరో గ్రూప్ ఎండీ పవన్ ముంజల్ తదితరులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
ఏవియేషన్ రంగానికి సంబంధించి జెట్ ఎయిర్‌వేస్ చైర్మన్ నరేశ్ గోయల్, ఎయిర్‌ఏషియా ఇండియా సీఈవో మిట్టు చాండిల్య.. ఫైనాన్షియల్ రంగం నుంచి యస్ బ్యాంక్ చీఫ్ రాణా కపూర్, ఐటీ రంగం తరఫున నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్.. హాజరైన వారిలో ఉన్నారు. కాగా, కొందరు దిగ్గజాలు విదేశీ పర్యటనల్లో ఉన్నందువల్ల హాజరుకాలేదు. ఇందులో టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఎంఅండ్‌ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యూబీ గ్రూప్ చీఫ్ విజయ్ మాల్యా తదితరులు ఉన్నారు.