జోరుమీదున్న లాజిస్టిక్స్‌! | India's logistics industry to be worth $215 bn by 2020-21 | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 20 2019 5:43 AM | Last Updated on Thu, Jun 20 2019 5:43 AM

India's logistics industry to be worth $215 bn by 2020-21 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్‌ హౌజ్‌ విభాగం ఫుల్‌ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్‌ విభాగంలో డిమాండ్‌ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్‌ అండ్‌ వేర్‌ హౌజ్‌ స్థలం అందుబాటులోకి వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్‌లాంగ్‌ లాసెల్లె (జేఎల్‌ఎల్‌) నివేదిక తెలియజేసింది.


215 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ..
ఏటా దేశీయ లాజిస్టిక్‌ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది. ‘‘2018లో 3.2 కోట్ల చదరపుటడుగుల స్థలం లీజుకు తీసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిస్టిక్‌ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయి’’ అని జేఎల్‌ఎల్‌ ఇండియా కంట్రీ హెడ్‌ అండ్‌ సీఈఓ రమేష్‌ నాయర్‌ చెప్పారు. లాజిస్టిక్‌ సప్లయి చైన్‌లో జీఎస్‌టీ రాకతో సవాళ్లు తొలిగాయని, ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని చెప్పారాయన. అందుకే ఈ రంగంలో డిమాండ్‌ పెరిగిందన్నారు.

హైదరాబాద్‌లో ఈ–కామర్స్‌దే హవా
హైదరాబాద్‌లో గిడ్డంగులకు ప్రధానంగా ఈ–కామర్స్‌ రంగం నుంచే డిమాండ్‌ వస్తోంది. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్‌ హౌజ్‌ లావాదేవీలు జరగగా.. 2018 నాటికి ఇది వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్‌ విభాగం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. ఇందులోనూ 70 శాతం లావాదేవీలు జీడిమెట్ల – మేడ్చల్‌– కొంపల్లి క్లస్టర్‌లోనే జరిగాయని పేర్కొంది. శంషాబాద్, పటాన్‌చెరు క్లస్టర్స్‌ కూడా ముఖ్యమైనవేనని తెలిపింది.



ఐదేళ్లలో రూ. 47,385 కోట్లు
 గిడ్డంగుల రంగంలో ఇన్వెస్ట్‌మెంట్స్‌ జోరు

నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: గిడ్డంగుల రంగంలో గత కొన్నేళ్లలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్, నైట్‌ ఫ్రాంక్‌ తాజా నివేదిక పేర్కొంది 2014 నుంచి చూస్తే, ఇప్పటివరకూ మొత్తం 47,385 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. జీఎస్‌టీ అమలు తర్వాత తయారీదారులు, ఈ–కామర్స్‌ సంస్థల నుంచి లాజిస్టిక్‌ స్పేస్‌కు డిమాండ్‌ పెరుగుతోందని, అందుకే ఈ స్థాయి ఇన్వెస్ట్‌మెంట్స్‌ వస్తున్నాయని పేర్కొంది. 

ముఖ్యాంశాలు...  
► గత ఏడాది  వేర్‌ హౌజింగ్‌ స్పేస్‌ 77 శాతం వృద్ధితో 46.2 మిలియన్‌ చదరపుటడుగులకు పెరిగింది.
► 2014 నుంచి గిడ్డంగుల రంగంలో వచ్చిన రూ.47,385 కోట్ల పెట్టుబడుల్లో ప్రైవేట్‌ ఈక్విటీ(పీఈ) సంస్థల వాటా 49 శాతంగా ఉంది. సావరిన్‌ ఫండ్స్‌ పెన్షన్‌ ఫండ్స్‌ పెట్టుబడులు 31 శాతం, డెవలపర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌ 20 శాతంగా ఉన్నాయి.  
► తయారీ రంగం నుంచి వేర్‌హౌసింగ్‌ స్పేస్‌ డిమాండ్‌ ప్రస్తుతం 74 కోట్ల చదరపుటడుగులుగా ఉంది. ఇది 5 శాతం చక్రగతి వృద్ధితో 2024 కల్లా 92 కోట్ల చదరపుటడుగులకు చేరుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement