Warehouse building
-
గ్రామస్థాయిలో ఎరువుల గోదాములు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో ఎరువుల పంపిణీని మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో సాగువేళ రైతులు పడిన ఇబ్బందులకు చెక్‌పెడుతూ వారి ముంగిటకే కావాల్సిన ఎరువులను అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఎరువుల నిల్వకోసం గ్రామస్థాయిలో గోదాములు నిర్మించాలని సంకల్పించింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల పంపిణీకి శ్రీకారం చుట్టిన తర్వాత రైతుల ఇబ్బందులకు తెరపడింది. గతంలో ఎరువుల కోసం గంటల తరబడి సహకార సంఘాలు, వ్యాపారుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చేది. కానీ నేడు ఎరువులు రైతులు కోరిన వెంటనే లభిస్తున్నాయి. 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన ఎరువుల పంపిణీతో రైతులకు భరోసా లభించింది. గత రెండేళ్లలో ఆర్బీకేల ద్వారా 6.9 లక్షలమంది రైతులకు 3.25 లక్షల టన్నుల ఎరువులను సరఫరా చేశారు. నకిలీ ఎరువులకు చెక్ పేరున్న కంపెనీల ఎరువులన్నింటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచడమేకాదు.. సీజన్లో రాష్ట్రానికి కేటాయించిన ప్రతి ఎరువును ముందుగా సమగ్ర పరీక్ష కేంద్రంలో పరీక్షించిన తర్వాతే రైతులకు సరఫరా చేస్తుండడంతో నకిలీలకు చెక్ పడింది. శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన మోతాదు మేరకు ఎంపిక చేసుకున్న ఎరువులను ఎమ్మార్పీకి పొందే వెసులుబాటు లభించింది. గతంలో మాదిరిగా అవసరంలేని ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన ఇబ్బందులు పోయాయి. దూరాభారం తగ్గింది. సమయం ఆదా అవుతోంది. రవాణా, ఇతర ఖర్చుల భారం లేకుండా తమ ముంగిటే కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. కృత్రిమ కొరత, అక్రమ నిల్వలతో రైతులను దోచుకునే ప్రైవేటు డీలర్ల ఆగడాలకు అడ్డుకట్టపడింది. ఆర్బీకేల ద్వారా ఎరువుల లభ్యత, ఎమ్మార్పీ పట్టిక అమలుతో మార్కెట్లో ఎరువుల ధరల స్థిరీకరణ సాధ్యమవుతోంది. ఆర్బీకేలకే లైసెన్సు ఎరువుల లభ్యతను మరింత సులభతరం చేసేందుకు ఆర్బీకేల పేరిట ఎరువుల లైసెన్సు జారీచేస్తున్నారు. వివిధ పంటలు సాగవుతున్న 10,698 ఆర్బీకేల పరిధిలో ఎరువులు అవసరమని గుర్తించారు. ఇప్పటివరకు రిటైల్ ఫెర్టిలైజర్ లైసెన్సుల కోసం 10,592 ఆర్బీకేలు దరఖాస్తు చేశాయి. వీటిలో 10,454 ఆర్బీకేలకు లైసెన్సు జారీచేశారు. 138 ఆర్బీకేలకు లైసెన్సు ఇవ్వాల్సి ఉంది. మరో 106 ఆర్బీకేలు ఇంకా దరఖాస్తు చేయాల్సి ఉంది. జాప్యం నివారణ కోసం హబ్‌ల నుంచి ఆర్బీకేలకు ఎరువుల సరఫరాలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఆర్బీకేలకు అనుబంధంగా ప్రత్యేకంగా గోదాములు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 20 మెట్రిక్ టన్నుల (ఎంటీల) ఎరువులు నిల్వచేసేందుకు వీలుగా 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలకు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమోదముద్ర వేశారు.ఉపాధిహామీ పథకం కింద వీటిని నిరి్మంచేందుకు అంచనాలు రూపొందించాలని గ్రామీణాభివృద్ధి శాఖను ఆదేశించారు. కరువు తీరా ఎరువులు గత రబీ సీజన్లో 23.47లక్షల ఎంటీల ఎరువులు వినియోగం కాగా ఈ ఏడాది 23,44,780 టన్నులు అవసరమని అంచనా వేశారు. ఖరీఫ్‌లో వాడగా మిగిలిన 6,96,938 ఎంటీల నిల్వలుండగా, కేంద్రం నుంచి గత మూడు నెలల్లో 7,51,706 ఎంటీల ఎరువులు రాష్ట్రానికి కేటాయించారు. ఇప్పటివరకు 8,32,011 ఎంటీల విక్రయాలు జరిగాయి. ప్రస్తుతం 6,16,632 ఎంటీల ఎరువులు (యూరియా 2,53,953 ఎంటీలు, డీఏపీ 27,420, ఎంఒపీ 21,581, ఎస్ఎస్పీ 50,681, కాంప్లెక్స్ 2,58,521, ఇతర ఎరువులు 4,476 ఎంటీలు) అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలకు మరో 3,59,774 ఎంటీల ఎరువులను కేంద్రం కేటాయించింది. ఎరువులకు బెంగలేదు 4 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నా. గతంలో ఎరువులు కావాలంటే ఉయ్యూరు వెళ్లి ప్రైవేట్ డీలర్ వద్ద కొని ఆటోలో తెచ్చుకునేవాడిని. పైగా అడిగిన ఎరువులుండేవి కావు. వారు ఇచ్చినవి తెచ్చుకోవాల్సి వచ్చేది. నాణ్యత తెలిసేది కాదు. కానీ నేడు మా గ్రామంలో ఆర్బీకే పెట్టిన తర్వాత ఎరువుల విషయంలో బెంగలేదు. మాకు కావాల్సిన ఎరువులు ముందుగానే టెస్ట్ చేసినవి ఎమ్మార్పీకే దొరుకుతున్నాయి. ఆటో ఖర్చులు మిగిలుతున్నాయి. – బసివిరెడ్డి, చిన్న ఓగిరాల, కృష్ణా జిల్లా బస్తాకు రూ.30 ఖర్చయ్యేది నేను నంబూరులో 3 ఎకరాల్లో వరి, పెసర సాగుచేస్తున్నా. సీజన్లో ఎరువులు కావాలంటే గతంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రానికి వెళ్లే వాళ్లం. రవాణా కోసం బస్తాకు రూ.30 ఖర్చయ్యేది. మా నంబూరులో ఏర్పాటు చేసిన ఆర్బీకే ద్వారా నాణ్యమైన ఎరువులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. రవాణా ఖర్చులు తగ్గడమే కాదు.. సమయం కూడా ఆదా అవుతోంది. ఎరువుల దొరకవనే ఆందోళన లేదు. – నంబూరి రాంబాబు, నంబూరు, గుంటూరు జిల్లా -
40 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సర్కారు నిర్ణయించింది. ప్రాజెక్టులు పూర్తవుతుండటం, సాగు విస్తీర్ణం పెరగడంతో ప్రభుత్వం గోదాముల నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ 40 లక్షల మెట్రిక్ సామర్థ్యం కలిగిన గోదాములను అన్ని జిల్లాల్లో నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. త్వరలో డీపీఆర్‌ను ముఖ్యమంత్రికి అందజేసే అవకాశం ఉంది. దానిపై తుది నిర్ణయం తీసుకున్నాక నిర్మాణానికి అవసరమైన రుణం తీసుకుంటారు. ఈ గోదాముల నిర్మాణానికి సుమారు రూ.2,500 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత సామర్థ్యం 24.75 లక్షల మెట్రిక్ టన్నులు... పంటలకు గిట్టుబాటు ధర వచ్చేదాకా రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు, ధాన్యం నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణం చేపట్టింది. తెలంగాణ వచ్చే నాటికి కేవలం 4.17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములుంటే, ఆ తర్వాత వాటి సామర్థ్యాన్ని 24.75 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరించింది. ప్రస్తుతం 1,250 గోదాములు ఉన్నాయి. అయితే సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతుండటం, ప్రధానంగా కాళేశ్వరం జలాలు పంట పొలాలకు చేరుతుండటంతో రాష్ట్రంలో వరిసాగు విపరీతంగా పెరుగుతోంది. ఇతర పంటలూ గణనీయంగా సాగవుతున్నాయి. మంచి వర్షాలు కురవడంతో గత ఖరీఫ్‌లో సాధారణానికి మించి సాగైంది. మున్ముందు పంటల దిగుబడి మరింత పెరగనుంది. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పండుతున్న వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడం, నిల్వ చేయడం, వాటిని అమ్మడం క్లిష్టంగా మారింది. అంతా సజావుగా సాగాలంటే గోదాముల్లో నిల్వ సామర్థ్యం పెరగాల్సిందేనని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. సామర్థ్యం సరిపోక పోవడంతో... ప్రస్తుతం ప్రభుత్వం గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సహా ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. అయితే అంత మొత్తంలో ధాన్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న కాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని సర్కారు భావించింది. అందుకే గోదాముల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. సాగు పెరిగితే ఎరువులు, విత్తనాలు కూడా పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. వీటి నిల్వకు కూడా గోదాముల కొరత వేధిస్తోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లో తగినంత గోదాముల సామర్థ్యం లేదు. దీంతో విత్తనాలు, ఎరువులు కూడా నిల్వ చేసుకునేలా గోదాముల నిర్మాణం చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ప్రైవేటు గోదాముల్లో నిల్వచేసి, అవి నిండిన తరువాతే ప్రభుత్వ గోదాములను నింపేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ గోదాములు నిండిన తర్వాతనే ధాన్యాన్ని ప్రైవేటు గోదాముల్లో నింపుతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ గోదాములు నూటికి నూరు శాతం నిండిపోతున్నాయి. -
జోరుమీదున్న లాజిస్టిక్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో లాజిస్టిక్, వేర్ హౌజ్ విభాగం ఫుల్ జోష్‌లో ఉంది. మౌలిక రంగ హోదా, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిర్మాణాత్మక సంస్కరణల అమలు వల్ల దేశీయ లాజిస్టిక్ విభాగంలో డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ముగిసే నాటికి దేశంలో 3.8 కోట్ల చదరపు అడుగుల లాజిస్టిక్ అండ్ వేర్ హౌజ్ స్థలం అందుబాటులోకి వస్తుందని కన్సల్టెన్సీ సంస్థ జోన్స్‌లాంగ్ లాసెల్లె (జేఎల్ఎల్) నివేదిక తెలియజేసింది. 215 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. ఏటా దేశీయ లాజిస్టిక్ విభాగం 33.81 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. 2020 నాటికి ఈ పరిశ్రమ 215 బిలియన్ డాలర్లకు చేరుతుందని జేఎల్ఎల్ అంచనా వేసింది. ‘‘2018లో 3.2 కోట్ల చదరపుటడుగుల స్థలం లీజుకు తీసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి కాలంలో 84 లక్షల చ.అ. స్థలాన్ని తీసుకున్నారు. ఇంజనీరింగ్, ఆటో మరియు అనుబంధ సంస్థలు, ఈ–కామర్స్, ఎఫ్ఎంసీజీ, రిటైల్, టెలికం విభాగాలు లాజిస్టిక్ వృద్ధి చోదకాలుగా నిలుస్తున్నాయి’’ అని జేఎల్ఎల్ ఇండియా కంట్రీ హెడ్ అండ్ సీఈఓ రమేష్ నాయర్ చెప్పారు. లాజిస్టిక్ సప్లయి చైన్‌లో జీఎస్టీ రాకతో సవాళ్లు తొలిగాయని, ఒకే రకం పన్ను విధానం అమల్లోకి రావటంతో లావాదేవీలు, పన్ను వసూళ్లలో స్పస్టత ఏర్పడిందని చెప్పారాయన. అందుకే ఈ రంగంలో డిమాండ్ పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో ఈ–కామర్స్‌దే హవా హైదరాబాద్‌లో గిడ్డంగులకు ప్రధానంగా ఈ–కామర్స్ రంగం నుంచే డిమాండ్ వస్తోంది. 2017లో నగరంలో 20 లక్షల చ.అ. వేర్ హౌజ్ లావాదేవీలు జరగగా.. 2018 నాటికి ఇది వంద శాతం వృద్ధితో 40 లక్షలకు చేరింది. మొత్తం లీజు/కొనుగోళ్ల లావాదేవీల్లో ఈ–కామర్స్ విభాగం వాటా 40 శాతం వరకూ ఉన్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇందులోనూ 70 శాతం లావాదేవీలు జీడిమెట్ల – మేడ్చల్– కొంపల్లి క్లస్టర్‌లోనే జరిగాయని పేర్కొంది. శంషాబాద్, పటాన్చెరు క్లస్టర్స్ కూడా ముఖ్యమైనవేనని తెలిపింది. ఐదేళ్లలో రూ. 47,385 కోట్లు గిడ్డంగుల రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ జోరు నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడి న్యూఢిల్లీ: గిడ్డంగుల రంగంలో గత కొన్నేళ్లలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రాపర్టీ కన్సల్టెంట్, నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక పేర్కొంది 2014 నుంచి చూస్తే, ఇప్పటివరకూ మొత్తం 47,385 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించింది. జీఎస్టీ అమలు తర్వాత తయారీదారులు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లాజిస్టిక్ స్పేస్‌కు డిమాండ్ పెరుగుతోందని, అందుకే ఈ స్థాయి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని పేర్కొంది. ముఖ్యాంశాలు... ► గత ఏడాది వేర్ హౌజింగ్ స్పేస్ 77 శాతం వృద్ధితో 46.2 మిలియన్ చదరపుటడుగులకు పెరిగింది. ► 2014 నుంచి గిడ్డంగుల రంగంలో వచ్చిన రూ.47,385 కోట్ల పెట్టుబడుల్లో ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) సంస్థల వాటా 49 శాతంగా ఉంది. సావరిన్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు 31 శాతం, డెవలపర్ల ఇన్వెస్ట్మెంట్స్ 20 శాతంగా ఉన్నాయి. ► తయారీ రంగం నుంచి వేర్‌హౌసింగ్ స్పేస్ డిమాండ్ ప్రస్తుతం 74 కోట్ల చదరపుటడుగులుగా ఉంది. ఇది 5 శాతం చక్రగతి వృద్ధితో 2024 కల్లా 92 కోట్ల చదరపుటడుగులకు చేరుతుంది. -
ఇష్టారాజ్యంగా గిడ్డంగి పనులు
బోథ్ : రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నచందంగా రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న ప్రభుత్వ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడుతోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక రైతు సహకారం సంఘం గిడ్డంగి నిర్మాణానికి రూ.13.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. పనులను సాంఘిక సంక్షేమశాఖ పర్యవేక్షిస్తోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు మూడో వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి నేరడిగొండ మండలంలో ఓ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు అడ్డు చెప్పరనే ధీమాతో పనులు సాగిస్తున్నాడు. నాసిరకం ఇసుక వాడకం దశాబ్దాలపాటు నిలవాల్సిన పనులకు మేలైన ఇసుక వాడేందుకు అధికారులు అనుమతిచ్చారు. ఇందుకు అవసరమైన ఇసుకను నిజామాబాద్ జిల్లా పెద్దవాగు నుంచి, మహారాష్ట్ర నుంచి అనుమతితో వచ్చిన ఇసుకనుగాని వాడేందుకు అందుకు అవసరమైన దూరాన్ని, ధరను నిర్ణయించారు. కాని సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ నుంచి తెప్పించిన నాసిరకం మట్టితో కూడిన ఇసుక వాడి పనులు సాగిస్తున్నాడు. కనిపించని వైబ్రేటర్ రూ. లక్షలు వెచ్చించి నిర్మిస్తున్న పనుల్లో సీసీ భీంలో అన్ని వైపులా చేరుకోవడానికి వైబ్రేటర్‌ను ఉపయోగిస్తారు. వైబ్రేటర్ ఉపయోగించడంతో దాదాపు 25 శాతం మేర కంకర, ఇసుక, సిమెంటు అధికంగా వినియోగం అవుతుంది. పనుల్లో వాడే వస్తువులు విలువను తగ్గించుకోవడానికి, పనుల్లో వైబ్రేటర్‌ను వినియోగించడంలేదు. అనుభవం లేని వ్యక్తులతో నిర్మాణం పనులను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు పనులు చేపడుతున్నారు. నైపుణ్యం గల కార్మికులను వినియోగించకుండా తూతుమంత్రంగా పనులు చేపడుతున్నారు. పుటింగ్లను నుంచి ప్లింత్ భీంల వరకు జరిగిన పనుల్లో వంకరగా చేసిన పనులు వారి పని తనానికి అద్దంపడుతున్నాయి. పైకి కనిపించే పనులు ఇలా ఉంటే లోపల చేపట్టిన కర్టెన్‌వాల్, ఇతర పనులు ఏవిధంగా చేపట్టారో చెప్పనవసరం లేదు. తీసివేయని మట్టి ఇక్కడి నల్లరేగడి నేలకు అనుకూలంగా అధికారులు పనుల్లో నాణ్యత లోపించకుండా ప్రతిపాదనలు పంపుతారు. పునాదుల్లో తీసిన మట్టిని పూర్తిగా తొలగించి, అందుబాటులోని గ్రావెల్‌తో పునాదులను నింపుతారు. అలాంటిది పనుల్లో ఇప్పటివరకు తీసిన మట్టిని పునాదుల్లోనే వేసేశారు. ఇప్పటికీ మట్టిని తొలగించకుండా ప్లోరింగ్‌లో కూడా అదే మట్టిని ఉపయోగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైతుల ఆవేదన నాసిరకం పనులపై సంఘానికి చెందిన పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడతామని అధికారంలో కొచ్చిన నేతలు ఇలాంటి పనులు చేపట్టడం ఏమిటని వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి పనులు నాణ్యతతో చేయించాలని కోరుతున్నారు. పనులు పరిశీలిస్తాం - ప్రభాకర్, డీఈఈ, సాంఘిక సంక్షేమశాఖ నాసిరకం పనుల విషయం నా దృష్టికి రాలేదు. ప్రస్తుతం బోథ్ మండలంలోనే ఐదు పనులు కొనసాగుతున్నాయి. అన్ని పనులను పర్యవేక్షించడం కష్టసాధ్యం అవుతుంది. గోదాం పనులను సోమవారం పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తా. అవసరమైతే కాంట్రాక్టు రద్దుకు సిఫార్సు చేస్తా.